సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ చీఫ్ నియామకంపై సస్పెన్స్ కొనసాగుతోంది. బీసీ నేతకే బీజేపీ పగ్గాలు అంటూ ప్రచారం జరుగుతోంది. బీసీ కోటాల్లో ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ మధ్య పోటీ నెలకొంది. సామాజిక వర్గాల ప్రకారం మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్‌కి కేంద్రమంత్రి పదవి ఇవ్వడంతో అదే సామాజికవర్గానికి చెందిన అర్వింద్‌కు పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం లేదంటున్నాయి పార్టీ వర్గాలు.
మరోవైపు, ఈసారి సంఘ్ పరివార్ క్షేత్రాల ప్రతినిధికి ఇవ్వాలనే వాదన ఉంది. మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావుకు కేటాయించాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. లోకల్‌బాడీ ఎన్నికల నేపథ్యంలో అధ్యక్ష నియామకంపై ఢిల్లీ జాతీయ నాయకత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది.
ఇప్పటికే కేంద్ర మంత్రిగా, పార్టీ రాష్ట్రఅధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నారు. దీంతో టికెట్ ఆశిస్తున్న రెడ్డి సామాజికవర్గానికి చెందిన డీకే అరుణకు ఇస్తారా? లేదా? అన్నది కూడా ఉత్కంఠగా మారింది. ఇదిలా ఉండగా ఇద్దరు సీఎంలను ఢీకొట్టి గెలిచిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి సైతం అధ్యక్షుడి రేసులో ఉన్నట్లు సమాచారం. కాగా, ఇప్పటికే బీజేఎల్పీ బాధ్యతలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహేశ్వర్ రెడ్డికి ఇవ్వడంతో పార్టీ పగ్గాలు బీసీ నేతలకే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త అధ్యక్షుడి నియామకం శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నెలాఖరులోగా ఈ టెన్షన్‌కు తెరపడే చాన్స్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment