Telangana BJP Chief Bandi Sanjay Kumar Resigned - Sakshi
Sakshi News home page

Bandi Sanjay Resigned: బండి సంజయ్ ను ఎందుకు తప్పించారు?

Published Tue, Jul 4 2023 3:09 PM | Last Updated on Tue, Jul 4 2023 4:35 PM

Telangana BJP Chief Bandi Sanjay Kumar Resigned - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ బీజేపీలో ఊహించిందే జరిగింది. తెలంగాణ బీజేపీ చీఫ్‌ పదవికి కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ రాజీనామా చేశారు. ఢిల్లీలో పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అనంతరం ఆయన ఈ నిర్ణయం ప్రకటించారు.

ప్రజా సంగ్రామ యాత్ర పేరిట పలు విడతల్లో తెలంగాణలోని చాలా జిల్లాల్లో పాదయాత్ర చేసి పార్టీకి కొత్త ఊపు తీసుకొచ్చిన బండి సంజయ్ పదవి సరిగ్గా ఎన్నికల సమయానికి ఎందుకు పోయింది? ఇది బండి సంజయ్ చేసుకున్న స్వయంకృతపరాధమా? లేక పార్టీ పెద్దలు ఇచ్చిన డెడ్ లైన్ ముగిసిందా? అధ్యక్ష పదవికి రాజీనామా చేయగానే తన ట్విట్టర్ అకౌంట్ లో హోదా మార్చుకున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి స్థానంలో బీజేపీ కార్యకర్త అని పేర్కొన్నారు. 

బలాలు - విజయాలు

ఎన్ని విమర్శలున్నా, ఎన్ని వివాదాలొచ్చినా.. బండి సంజయ్ అధ్యాయం తెలంగాణ బీజేపీలో ఎప్పటికి మరిచిపోలేనిది. నిస్తేజంగా ఉన్న పార్టీకి ఒక ఊపును తీసుకొచ్చిన నాయకుడు బండి సంజయే. అది పాదయాత్ర అయినా, లేక పాత బస్తీ అయినా.. అధికార పార్టీ BRSతో సై అంటే సై అన్నట్టుగా సాగింది బండి ప్రయాణం. 

బండి సంజయ్‌కి ఆది నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) నుంచి మద్దతు ఉంది. RSS సపోర్ట్ కారణంగా.. బండి సంజయ్‌ని పదవులు వరించాయి. ఒకానొక దశలో కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయిన సంజయ్.. కట్టెలమ్మిన చోటే.. పూలమ్మాలన్నట్టుగా లోక్ సభ ఎన్నికల్లో గెలిచి ఎంపీగా నిలిచారు.

బక్కపలచని ఆహార్యం, పూర్తి మాస్ తరహాలో డైలాగ్ లు కమలనాథుల్లో ఓ కొత్త జోష్ నింపేందుకు ఆరంభంలో బండి సంజయ్ బాగా ప్రయత్నించారు. ఒకానొక దశలో కెసిఆర్ ను ఢీ కొట్టే నాయకుల్లో బండి సంజయ్ పేరు బలంగా నిలిచింది. 

వివాదాలు - విమర్శలు

బండి సంజయ్ పై ఉన్న ప్రధాన విమర్శ నోటి దురుసు. తొందరగా మాట జారేయడం, దాన్ని వెనక్కి తీసుకోలేక.. ఇబ్బంది పడడం. ఆయనపై ఉన్న మరో ఆరోపణ నాయకత్వ లోపం. క్యాడర్ ను బాగా చూసుకుంటాడని మంచి పేరున్నా.. చుట్టున్న నేతలను కలుపుకుని పోలేడని అంటారు.

తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ పెద్ద తలకాయల్లో చాలా మందితో బండి సంజయ్ కు పొసగదని అంటారు. కొందరయితే బండి సంజయ్ ఉన్నంత కాలం బీజేపీ ఆఫీసుకు రానని శపథం పట్టారని చెప్పుకుంటారు. తన సహచర ఎంపీలయిన ధర్మపురి అరవింద్ తోనూ సంజయ్ కు సత్సంబంధాలు లేవు. 

బండి సంజయ్ ఉంటే ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకురావడం కష్టమన్నది మరికొందరి ఆరోపణ. అలాగే చాలా నియోజకవర్గాల్లో ఒక బలమైన నేతను పార్టీ కోసం నిలపలేకపోయారంటారు. ఇప్పటికీ చాలా చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో ఎవరికి తెలియదు. 

బండి సంజయ్ కు ఉన్న మరో బలహీనత కార్పోరేట్ పాలిటిక్స్ అలాగే ఢిల్లీ పాలిటిక్స్ గురించి పూర్తి ఔపాసన పట్టకపోవడం. మాస్ లీడర్ గా ఎదిగే క్రమంలో క్లాస్ ను మరిచిపోవడం వల్ల బండి సంజయ్ పడ్డ కష్టానికి సరైన ఫలితం దక్కలేదంటారు ఆ పార్టీ నాయకులు. 

బండి ప్రస్థానం

  • బండి సంజయ్‌ తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఒకటో తరగతిలో సరస్వతి శిశుమందిర్‌ లో సంజయ్‌ ను చేర్పించాడు, అక్కడే ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు
  •  ఆర్‌ఎస్‌ఎస్‌లో ఘటన్‌ నాయక్‌గా, ముఖ్య శిక్షక్‌గా ప్రాథమిక విద్యా స్థాయిలోనే పనిచేశాడు.
  • అద్వానీ రథయాత్ర నిలిచిపోయినప్పుడు బండి సంజయ్‌ను ఢిల్లీ సెంట్రల్‌ ఆఫీస్‌లో సహాయక్‌గా నియమించారు
  • బండి సంజయ్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ABVP)లో కరీంనగర్ పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగానూ బాధ్యతలు నిర్వర్తించాడు.
  • 1994-2003 మధ్య ది కరీంనగర్ కో-ఓపరేటివ్ అర్బన్ బ్యాంక్‌లో రెండు పర్యాయాలు డైరెక్టర్‌గా పనిచేశాడు
  •  భారతీయ జనతా యువమోర్చా కరీంనగర్ పట్టణ ప్రధాన కార్యదర్శి, పట్టణ అధ్యక్షునిగా, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబెర్‌గా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్‌గా, జాతీయ కార్యదర్శిగా పని చేశాడు.
  • భారతీయ జనతా పార్టీ కేరళ, తమిళనాడు ఇంచార్జి‌గా బాధ్యతలు నిర్వహించాడు.
  • 2005 లో కరీంనగర్ 48వ డివిజన్ నుండి బిజెపి కార్పొరేటర్ గెలిచాడు
  • రెండు పర్యాయాలు కరీంనగర్ బిజెపి అధ్యక్షునిగా పనిచేశాడు.
  • 2014 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు
  • 2018లో అసెంబ్లీ ఎన్నికలో కరీంనగర్ నుంచి పోటీ చేసి గంగుల కమలాకర్ చేతిలో ఓడిపోయాడు
  • 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అదే కరీంనగర్ నుంచి అప్పటి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వినోద్‌ కుమార్‌పై 89508 ఓట్ల మెజారిటీతో గెలిచాడు.
  • 2020 మార్చి 11న తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడయ్యారు
  • 2023 జులై 4న తెలంగాణ బీజేపీకి అధ్యక్ష పదవికి హైకమాండ్ ఆదేశాలతో రాజీనామా చేశారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement