సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ నేతలకు జాతీ యస్థాయిలో మరో కీలక పదవి లభించనుందా ? ఈ ప్రశ్నకు ఢిల్లీ పార్టీ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. 2024 ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికలతో పాటు, ఈ ఏడాది 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ జరిగే అవకాశాలున్నట్టు చెబుతున్నారు.ప్రస్తుతం జాతీయస్థాయిలో రాజకీయ మార్పులు చేర్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి.
ఈ కీలక పరిణా మాల్లో జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో సంస్థాగతంగా కూడా కీలక మార్పులు జరిగే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నెల 16, 17 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న పార్టీ జాతీయకార్యవర్గ భేటీలో పలు అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. కేంద్రమంత్రివర్గ విస్తరణతో పాటు ఈ ఏడాది ఎన్నికలు జరగాల్సిన కొన్ని రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షుల మార్పు కూడా జరగొచ్చుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కీలకంగా మారిన తెలంగాణ...
ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. తెలంగాణలో అధికారంలోకి రావడంతోపాటు మధ్యప్రదేశ్, కర్ణాటకలలో అధికారాన్ని నిలబెట్టుకోవడం, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌ను ఓడించడం అనేది బీజేపీకి కీలకంగా మారింది. గతంలో బీజేపీ ఎప్పుడూ గెలవని, రెండోస్థానంలో నిలిచిన, మిత్రపక్షాలకు కేటాయించిన 160 ఎంపీ సీట్లను జాతీయనాయకత్వం గుర్తించింది.
2024 ఎన్నికల్లో వీటిలో గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలవాలనే లక్ష్యంతో కార్యాచరణ ప్రణాళికను ఇప్పటికే బీజేపీ అమలు చేయడం మొదలుపెట్టింది. వచ్చే లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో... ఇప్పటికే కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డికి తోడుగా తెలంగాణ నుంచి ఎంపీలుగా ఉన్న బండిసంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపూరావులలో ఒకరికి కేబినెట్‌బెర్త్ దక్కే అవకాశాలున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన డా.కె.లక్ష్మణ్ కూడా మంత్రి పదవి రేసులో ఉన్నట్టుగా చెబుతున్నారు.
కేసీఆర్ సర్కారు వైఫల్యాలను మరింతగా ఎండగట్టేలా...
తెలంగాణలో కచ్ఛితంగా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న జాతీయనాయకత్వం ఈ దిశలో కేసీఆర్ సర్కారు వైఫల్యాలను మరింత గట్టిగా ఎండగట్టేందుకు మరో కేబినెట్ పదవి ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. గత 8 ఏళ్లలో మోదీ ప్రభుత్వం అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గురించి తెలంగాణలో విస్తృతంగా ప్రచారం చేయలేకపోయామనే అభిప్రాయంతో జాతీయనాయకత్వం ఉన్నట్టు సమాచారం. మరో పది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ఇప్పటికైనా మోదీ ప్రభుత్వ విజయాలు, తెలంగాణలో వివిధవర్గాల పేదలకు చేకూరిన ప్రయోజనాలను గురించి ప్రజలకు తెలియచేయాలని భావిస్తోంది.
ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే కేబినెట్ విస్తరణలో తెలంగాణకు చెందిన నేతకు మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సంజయ్‌ను కేంద్రమంత్రిని చేస్తే రాష్ట్ర పార్టీలో బీసీవర్గం నుంచి కీలకనేతగా ఉన్న మరో ముఖ్యనేతకు రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ పగ్గాలు అప్పగించవచ్చునని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఇప్పటికే సోషల్ మీడియాలోని కొన్ని వెబ్‌సైట్‌లలో వార్తలు పెద్దఎత్తున హల్‌చల్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment