పాత, కొత్త నేతలంటూ వివాదం
ఈటల రాజేందర్‌ను రాష్ట్ర చీఫ్‌గా ప్రకటిస్తారంటూ వార్తలు
అమిత్‌షా హామీ ఇచ్చారంటూ ప్రచారం
అగ్రెసివ్ నేతకే పగ్గాలు అప్పగించాలన్న రాజాసింగ్
ఘాటుగా స్పందించిన ఈటల
అధ్యక్ష పదవి ఆశిస్తున్న పలువురు నేతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో ఆధిపత్యపోరు మరోసారి తెరపైకి వచ్చింది. త్వరలోనే రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడి నియామకం జరగొచ్చుననే అంచనాల మధ్య అది తీవ్ర రూపం దాలి్చంది. ప్రధానంగా కొంతకాలం క్రితం కొత్తగా పార్టీలో చేరి ఎంపీ, ఎమ్మెల్యే ఇతర పదవుల్లో ఉన్న వారు, ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వారి మధ్య తీవ్రపోటీ నెలకొంది. పార్టీ సిద్ధాంతాలు, విధానాలపై పూర్తి అంకితభావంతో ఉన్న పాత నాయకులకే ఈ పదవి దక్కాలంటూ బీజేపీలో ఓ వర్గం నాయకులు గట్టిగా ప్రయతి్నస్తున్నారు. అయితే పార్టీ విస్తరించాలంటే కొత్తవారు చేరడం ముఖ్యమని, కొత్త, పాత తేడాలు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అడ్డంకిగా మారకూడదని మరికొందరు వాదిస్తున్నారు.
రాజాసింగ్ వర్సెస్ ఈటల
దాదాపు రెండేళ్ల క్రితం పార్టీలో చేరి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచి, ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి దాదాపు 4 లక్షల భారీ మెజారిటీతో విజయం సాధించిన ఈటల రాజేందర్ పేరు పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటున్నట్టుగా పార్టీలోని ఓ వర్గం గట్టిగా నమ్ముతోంది. కేంద్ర కేబినెట్‌లో మంత్రి పదవిని కోరుకున్న ఈటలకు.. రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తామని, 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కచ్చితంగా అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని బీజేపీ అగ్రనేత అమిత్‌షా చెప్పినట్టు సమాచారం.
మరోవైపు కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి వీలైనంత త్వరగా తనను తప్పించాలని కోరడంతో.. త్వరలోనే అంటే వారం, పది రోజుల్లోనే కొత్త అధ్యక్షుడిని ప్రకటించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ దేశభక్తి కలిగి దూకుడుగా వ్యవహరించే (అగ్రెసివ్) నేతకే రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలంటూ అధిష్టానానికి విజ్ఞప్తి చేయడం పార్టీలో సంచలనం సృష్టించింది. రాజాసింగ్ విడుదల చేసిన వీడియోపై ఈటల ఘాటుగా స్పందించారు.
గల్లీల్లో ఉన్నవారు కాదు కావాల్సింది
‘ఫైటర్‌కు పదవిని ఇవ్వాలంటూ కొందరు మాట్లాడుతున్నారు.. ఎవరికి ఇవ్వాలి.. స్ట్రీట్‌ఫైటర్‌కు ఇవ్వాలా..’అంటూ నేతల పేరును ప్రస్తావించకుండా ఈటల వ్యాఖ్యానించారు. సందర్భం వచ్చినపుడు కుంభస్థలాన్ని కొట్టే దమ్మున్న వాడు కావాలని, గల్లీల్లో ఉన్న వారు కాదని రాజ్యాన్ని, అధికారంలో ఉన్న వారిని నిగ్గదీసి నిలదీయగలిగే వాడే ఫైటర్ అవుతాడని అన్నారు. తన లాంటి వారు ఊరికే మాట్లాడరని సందర్భం వచ్చినపుడు జేజమ్మతో కొట్లాడే సత్తా ఉన్న వారిమని ఓ సమావేశంలో పాల్నొన్న సందర్భంగా ఈటల వ్యాఖ్యానించారు. కొత్త, పాత నాయకులు అనే తేడాలు లేకుండా అందరినీ సమన్వయం చేసుకుని బీజేపీ ముందుకు వెళుతుందన్నారు. ఒక పార్టీ కొత్తగా ఎదిగి, అధికారంలోకి రావాలంటే కొత్త శక్తి, కొత్త నీరు జతకావాల్సిందేనన్నారు.
కొత్త, పాత ఏమీ లేదన్న రఘునందన్
తాజాగా మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ రఘునందన్‌రావు వద్ద ఓ విలేకరి ఈ విషయాలు ప్రస్తావించగా.. ‘కొత్తగా వచి్చన నేతలకు పదవి రాదు అనేది ఏమీ లేదు. అలా అయితే హిమంత బిశ్వ శర్మ అసోం సీఎం అయ్యేవారు కాదు. ఒక పార్టీని వీడి మరో పార్టీలో చేరి కండువా కప్పుకున్న రోజునుంచే ఆ పార్టీ నాయకుడిగా సదరు వ్యక్తి చెలామణి అవుతారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా అభిప్రాయాలు చెప్పవచ్చు.. రాజాసింగ్ తన అభిప్రాయం చెప్పారు’అంటూ స్పందించడం గమనార్హం.
పోటీలో పలువురు నేతలు
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌తో పాటు ఎంపీలు డీకే అరుణ, అర్వింద్ ధర్మపురి, ఎం.రఘునందన్‌రావు, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, సీనియర్ నేతలు చింతా సాంబమూర్తి, చింతల రామచంద్రారెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, జి.మనోహర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు అధ్యక్షుడి రేసులో ఉన్నట్టు సమాచారం. వీరిలో కొందరు ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో తమ వంతు లాబీయింగ్ కూడా మొదలుపెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల చివరి నాటికి బీజేపీ రాష్ట్ర కొత్త సారథిపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment