పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ కీలక నిర్ణయం.. అనుబంధ సంఘాలపై ‘దృష్టి’ | Telangana Congress Concentrates On Affiliated Unions | Sakshi
Sakshi News home page

పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ కీలక నిర్ణయం.. ఇక అనుబంధ సంఘాలపై ‘దృష్టి’

Published Tue, Mar 21 2023 7:44 AM | Last Updated on Tue, Mar 21 2023 7:47 AM

Telangana Congress Concentrates On Affiliated Unions - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ అనుబంధ సంఘాల బలోపేతంపై రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే ప్రత్యేక దృష్టి సారించారు. పార్టీ ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పటికే పలుమార్లు అనుబంధ సంఘాల రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు హాజరైన ఆయన వచ్చే పర్యటనలో కూడా అనుబంధ సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేశారు. పార్టీకి అనుబంధంగా పనిచేసే యూత్‌ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సెల్‌లతో పాటు మహిళా కాంగ్రెస్‌ నేతలతో ఇప్పటికే సమావేశమై వారికి దిశానిర్దేశం చేసిన ఆయన ఈసారి పర్యటనలో యూత్‌ కాంగ్రెస్, టీపీసీసీ ఫిషర్‌మెన్‌ కమిటీలతో సమావేశం కానున్నారు.

అనుబంధ సంఘాలే పార్టీకి బలమని తన తొలి పర్యటన నుంచి చెపుతున్న ఆయన తెలంగాణకు వచ్చిన ప్రతిసారీ ఆయా సంఘాల నేతలతో భేటీ అవుతున్నారు. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల ఏర్పాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చేయాల్సిన పోరాటాలపై యూత్‌కాంగ్రెస్, ఫిషర్‌మెన్‌ కాంగ్రెస్‌ నేతలకు భేటీల్లో ఠాక్రే దిశానిర్దేశం చేస్తారని గాంధీభవన్‌ వర్గాలు వెల్లడించాయి. 

ఈసారి నాలుగు రోజుల టూర్‌ 
మాణిక్‌రావ్‌ ఠాక్రే మరోమారు నాలుగు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈనెల 23న హైదరాబాద్‌ రానున్న ఆయన 26వరకు ఇక్కడే ఉండనున్నారు. ఈనెల 23న పీసీసీ అధ్యక్షుడు రేవంత్, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, హాథ్‌సే హాథ్‌జోడో ఇంచార్జులతో ఆయన భేటీ కానున్నారు. ఫిబ్రవరి ఆరోతేదీ నుంచి ప్రారంభమైన యాత్రలు సాగుతున్న తీరు, నాయకుల సహకారం, ప్రజల నుంచి వస్తున్న స్పందన లాంటి అంశాలపై చర్చించనున్నారు. ఇక, 24వ తేదీన యూత్‌కాంగ్రెస్, ఫిషర్‌మెన్‌ కమిటీలతో సమావేశం కానున్న ఠాక్రే ఈనెల 25న కీలక సమావేశం నిర్వహించనున్నారు.

హైదరాబాద్‌ పరిధిలో కాంగ్రెస్‌ పార్టీ బలహీనంగా ఉందన్న అంచనాల నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన పార్టీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పలు కార్పొరేషన్ల మాజీ చైర్మన్లతో సమావేశం కానున్నారు. నగరంలో పార్టీ బలోపేతం తీసుకోవాల్సిన చర్యలు, గ్రేటర్‌ కాంగ్రెస్‌ కమిటీ పునరి్నయామకం తదితర అంశాలపై ఆయన చర్చించనున్నారు. ఆ తర్వాత 26న ఖమ్మంలో రేణుకాచౌదరి ఆధ్వర్యంలో హాథ్‌సే హాథ్‌జోడో యాత్రకు కూడా హాజరుకానున్నారు.  

26 నుంచి మళ్లీ హాథ్‌సే హాథ్‌జోడో 
 రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్కలు చేపట్టిన హాథ్‌సే హాథ్‌జోడో యాత్రలకు సోమవారం నాటి నుంచి విరామం ఇవ్వనున్నారు. యాత్రల్లో భాగంగా రేవంత్‌రెడ్డి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో, భట్టి ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఉన్నారు. సోమవారం యాత్ర ముగిసిన తర్వాత ఇరువురు నేతలూ హైదరాబాద్‌ వస్తారని, ఉగాది విరామం తర్వాత ఈనెల 26 నుంచి మళ్లీ యాత్ర ప్రారంభిస్తారని గాం«దీభవన్‌ వర్గాలు తెలిపాయి. 

వచ్చే నెల హైదరాబాద్‌కు ప్రియాంకాగాంధీ  
హాథ్‌సే హాథ్‌జోడో యాత్రల్లో భాగంగా మహిళలతో కలిసి యాత్రలో పాల్గొనేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ తెలంగాణకు వస్తారని, ఏప్రిల్‌ మొదటి వారంలో ఆమె హైదరాబాద్‌కు వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
చదవండి: బీఆర్‌ఎస్‌కు కార్యకర్తలే  బలం.. బలగం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement