సాక్షి, న్యూఢిల్లీ: విస్తృత సమాలోచనలు..ఎడతెగని సంప్రదింపులు..తర్జనభర్జన అనంతరం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ శుక్రవారం రాత్రి విడుదల చేసింది. 45 మందికి టికెట్లు కేటాయించింది. అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాలేరు నియోజకవర్గం నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వర్‌రావు, మునుగోడు నియోజకవర్గం నుంచి గురువారం నాడే కాంగ్రెస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది.
కంటోన్మెంట్‌లో గద్దర్ కుమార్తె వెన్నెలకు అవకాశం కల్పించింది. ప్రకటించని మిగతా స్థానాలపై నేతలందరి అభిప్రాయం తెలుసుకున్నాక ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయాన్ని బట్టి తుది జాబితా విడుదల కానుంది.
విస్తృత కసరత్తుతో..
ఈ నెల 15న 55 మందితో తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ రెండో జాబితా విడుదలకు విస్తృత కసరత్తు చేసింది. అనేకచోట్ల ఇద్దరు, ముగ్గురేసి అభ్యర్థులు బరిలో ఉండటం, సర్వేల్లోనూ వారికి సమాన గెలుపు అవకాశాలు ఉండటం, అభ్యర్థుల విషయంలో స్క్రీనింగ్ కమిటీలోని సభ్యుల మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు ఉండటంతో స్క్రీనింగ్ కమిటీ భేటీ మూడు నాలుగు సార్లు కావాల్సి వచ్చింది. ఈ క్రమంలో మరోసారి ఫ్లాష్ సర్వేలు సైతం నిర్వహించి, అందులో ముందంజలో ఉన్న అభ్యర్థుల పేర్లను కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)కి నివేదించింది.
ఈ నెల 25న ఖర్గే అధ్యక్షతన ఒకమారు భేటీ అయిన సీఈసీ.. శుక్రవారం మరోమారు సమావేశమైంది. ఈ భేటీకి ఖర్గేతో పాటు అగ్రనేతలు సోనియాగాం«దీ, కేసీ వేణుగోపాల్, మురళీధరన్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు హాజరై 45 మంది అభ్యర్థుల జాబితా సిద్ధం చేశారు. సీపీఐకి ఇప్పటికే కొత్తగూడెం, చెన్నూరు నియోజకవర్గాలు కేటాయించగా, సీపీఎంకు కేటాయించే అవకాశమున్న స్థానాలపై (మిర్యాలగూడ, వైరా) ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది.
సీపీఎంకు కేటాయించే సీట్లతో పాటు మరో 15 స్థానాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతుండటంతో వీటిపై తుది నిర్ణయం చేసే అధికారం ఖర్గేకు కట్టబెట్టారు. ఈ స్థానాల్లో నెలాఖరులోగా టిక్కెట్ల కేటాయింపు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇక టికెట్ దక్కని నేతలను ముందుగానే ఢిల్లీ పిలిపించి ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే వారికి వివిధ పదవులు కట్టబెడతామని హామీ ఇచ్చారు.
సస్పెన్స్‌లో కామారెడ్డి..
కమ్యూనిస్టులు పోనూ మిగిలిన మరో 15 స్థానాలను పార్టీ పెండింగ్‌లో పెట్టింది. ఇందులో అందరి దృష్టీ కామారెడ్డి నియోజకవర్గం పైనే ఉంది. ఇక్కడ రేవంత్‌రెడ్డిని బరిలో నిలపాలని పార్టీ అధిష్టానం యోచిస్తున్న నేపథ్యంలో దీన్ని పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ఇక్కడి సీనియర్ నేత షబ్బీర్ అలీని నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయించే ఆలోచన నేపథ్యంలో ఆ స్థానాన్నీ ప్రకటించలేదు. కామారెడ్డి జిల్లాలోనే ఉన్న బాన్సువాడ నియోజకవర్గం నుంచి సీనియర్ నేత వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి, పార్టీలో చేరిన ఏనుగు రవీందర్‌రెడ్డి పోటీలో ఉండటం, జుక్కల్ నుంచి సీనియర్ నేత గంగారాంతో పాటు తోట లక్ష్మీకాంతరావులు పోటీ పడుతుండటంతో ఆ స్థానాలపై ఇంకా నిర్ణయం చేయలేదు.
పటాన్‌చెరు నియోజకవర్గాన్ని పార్టీలో చేరిన నీలం మధు కోరుతుండటం, అక్కడి నుంచి కాటా శ్రీనివాస్‌గౌడ్ పేరు ఇప్పటికే పరిశీలనలో ఉండటంతో దీన్నీ పెండింగ్‌లో పెట్టారు. ఇక నారాయణఖేడ్ నుంచి సీనియర్లు సురేశ్ షెట్కార్‌తో పాటు సంజీవ్‌రెడ్డిలు పోటీ పడుతుండగా నిర్ణయం తీసుకోలేదు. షెట్కార్ పేరును రేవంత్ ప్రస్తావిస్తుండగా, మిగతా సీనియర్లు సంజీవ్‌రెడ్డికి మద్దతుగా ఉన్నారు. తుంగతుర్తి టిక్కెట్ ఆశించి మోత్కుపల్లి నర్సింహులు, కరీంగనర్ సీటు ఆశిస్తూ మాజీ ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్‌లు పార్టీలో చేరడంతో వాటినీ పెండింగ్‌లోనే ఉంచారు.
45 టికెట్లు ఇలా..
1. సిర్పూర్ – రావి శ్రీనివాస్
2. ఆసిఫాబాద్ (ఎస్టీ) – అజ్మీర శ్యాం
3. ఖానాపూర్ (ఎస్టీ) – వెద్మ బొజ్జు
4. ఆదిలాబాద్ – కంది శ్రీనివాస్ రెడ్డి
5. బో«థ్(ఎస్టీ) – వన్నెల అశోక్
6. ముధోల్ – నారాయణరావు పాటిల్
7. ఎల్లారెడ్డి – కె.మదన్‌మోహన్ రావు
8. నిజామాబాద్ రూరల్ – డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి
9. కోరుట్ల – జువ్వాడి నర్సింగరావు
10. చొప్పదండి (ఎస్సీ) – మేడిపల్లి సత్యం
11. హుజూరాబాద్ – వొడితల ప్రణవ్
12. హుస్నాబాద్ – పొన్నం ప్రభాకర్
13. సిద్దిపేట – పూజల హరికృష్ణ
14. నర్సాపూర్ – ఆవుల రాజిరెడ్డి
15. దుబ్బాక – చెరుకు శ్రీనివాస్ రెడ్డి
16. కూకట్‌పల్లి – బండి రమేష్
17. ఇబ్రహీంపట్నం – మల్‌రెడ్డి రంగారెడ్డి
18. ఎల్బీనగర్ – మధుయాష్కీ గౌడ్
19. మహేశ్వరం – కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి
20. రాజేంద్రనగర్ – కస్తూరి నరేందర్
21. శేరిలింగంపల్లి – వి.జగదీశ్వర్ గౌడ్
22. తాండూరు – బుయ్యని మనోహర్ రెడ్డి
23. అంబర్‌పేట – రోహిన్‌రెడ్డి
24. ఖైరతాబాద్ – పి.విజయారెడ్డి
25. జూబ్లీహిల్స్ – మహమ్మద్ అజారుద్దీన్
26. సికింద్రాబాద్ కంటోన్మెంట్ – డాక్టర్ జి.వి.వెన్నెల
27. నారాయణ్‌పేట్ – డాక్టర్ పర్ణిక చిట్టెంరెడ్డి
28. మహబూబ్‌నగర్ – యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
29. జడ్చెర్ల – జె.అనిరుద్ రెడ్డి
30. దేవరకద్ర – గవినోళ్ల మధుసూదన్‌రెడ్డి
31. మక్తల్ – వాకిట శ్రీహరి
32. వనపర్తి – డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి
33. దేవరకొండ(ఎస్టీ) – నానావత్ బాలునాయక్
34. మునుగోడు – కె.రాజగోపాల్‌రెడ్డి
35. భువనగిరి – కుంభం అనిల్‌కుమార్ రెడ్డి
36. జనగాం – కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి
37. పాలకుర్తి – యశశ్విని మామిడాల
38. మహబూబబాద్(ఎస్టీ) – డాక్టర్ మురళీనాయక్
39. పరకాల – రేవూరి ప్రకాశ్‌రెడ్డి
40. వరంగల్ వెస్ట్ – నాయిని రాజేందర్‌రెడ్డి
41. వరంగల్ ఈస్ట్ – కొండా సురేఖ
42. వర్ధన్నపేట(ఎస్సీ) – కె.ఆర్.నాగరాజు
43. పినపాక(ఎస్టీ) – పాయం వెంకటేశ్వర్లు
44. ఖమ్మం – తుమ్మల నాగేశ్వరరావు
45. పాలేరు – పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment