న్యూఢిల్లీ: తిరుపతి పార్లమెంట్, నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 23న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. నామినేషన్ దాఖలుకు ఈ నెల 30 చివరి తేదీగా ఈసీ పేర్కొంది. ఏప్రిల్ 17న పోలింగ్, మే 2న ఫలితాలు వెల్లడించున్నట్లు తెలిపింది. కాగా తిరుపతి ఎంపీగా ఉన్న బల్లి దుర్గా ప్రసాద్ రావు(వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ), నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా ఉన్న నోముల నర్సింహయ్య(టీఆర్‌ఎస్) ఆకస్మిక మరణంతో ఆయా స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈసీ ఫిబ్రవరి 26న షెడ్యూల్ విడుదల చేసిన విషయం విదితమే.
ఈ క్రమంలో తిరుపతి, సాగర్ ఉప ఎన్నికకు సైతం ఆరోజే షెడ్యూల్ ప్రకటిస్తారని భావించినా, ప్రత్యేకంగా ఈసీ నేడు రిలీజ్ చేసింది. ఇక అసోంలో మూడు విడతల్లో(126 స్థానాలు- మార్చి 27, ఏప్రిల్ 1, 6వ తేదీల్లో) తమిళనాడులో ఏప్రిల్ 6న ఒకే విడతలో(234 స్థానాలు), కేరళలో సైతం ఒకే విడత(140 స్థానాలు- ఏప్రిల్ 6)లో పోలింగ్ జరుగనుండగా, పశ్చిమ బెంగాల్లో మాత్రం (294 స్థానాలు) మొత్తం 8 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 27, ఏప్రిల్ 1, 6, 10, 17, 22, 26, 29 తేదీల్లో అక్కడ పోలింగ్ చేపట్టనున్నారు.ఇక కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి(30 స్థానాలు)లో ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్ జరుగనుంది. అయితే అన్నిచోట్లా ఫలితాలు మాత్రం మే2నే తేలనున్నాయి.
తిరుపతి, సాగర్ ఉప ఎన్నిక షెడ్యూల్- వివరాలు
►మార్చి 23న నోటిషికేషన్
►నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ- మార్చి 30
►నామినేషన్ల పరిశీలన-మార్చి 31
►నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 3.
►ఏప్రిల్ 17వ తేదీన పోలింగ్.
►మే 2న ఫలితాలు.
Comments
Please login to add a commentAdd a comment