
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీతో కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలోని 50 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని టీపీసీసీ అధ్యక్షు డు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఖమ్మంలో సోమవారం నిరుద్యోగ నిరసన ర్యాలీని చేపట్టారు. ఈ ర్యాలీకి ఖమ్మం పార్లమెంట్ పరిధి నుంచి భారీ ఎత్తున నిరుద్యోగులు, ప్రజలు తరలివచ్చారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియం నుంచి ఖమ్మం పాత బస్టాండ్ వరకు గంటకు పైగా ర్యాలీ కొనసాగ గా తొలుత అమరవీరుల చిత్రపటాలకు రేవంత్‌రెడ్డితోపాటు పార్టీ నేతలు నివాళులర్పించారు.
అనంతరం పాత బస్టాండ్ సెంటర్‌లో ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్‌లో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 1.07 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చెప్పారని, ప్రస్తుతం రెండు లక్షల ఉద్యోగ ఖాళీలున్నట్లు బిస్వాల్ కమిటీ నివేదిక ఇచ్చిందని తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక ఉన్న ఉద్యోగాలు పోయాయే తప్ప కొత్త ఉద్యోగం రాలేదన్నారు. 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామంటే కేసీఆర్ మారిందేమో అనుకున్నామని కానీ అలా జరగకపోగా.. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదని విమర్శించారు.
ప్రశ్నపత్రాల లీకేజీలపై నిలదీసి, మంత్రి కేటీఆర్‌కు సంబంధం ఉన్నందున బర్తరఫ్ చేయాలని అడిగితే ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు నోటీసులు పంపిస్తున్నారన్నారు. తనపై ఇప్పటికే 130 కేసులు పెట్టారని, ఇంతకంటే కేసీఆర్ ఇంకేం చేయగలరని అన్నారు. పోడు భూములు, విద్యార్థులు, రైతుల కోసం పోరాటం చేసిన కమ్యూనిస్టులు ఇప్పుడు ఎవరి పక్కన నిల్చున్నారో గమనించాలన్నారు.
అర్హత లేని వారికి టీఎస్‌పీఎస్సీలో స్థానం
పశువులు కాసే వారిని, అర్హత లేని వారిని టీఎస్‌పీఎస్సీలో కంప్యూటర్ ఆపరేటర్లు, సెక్షన్ ఆఫీసర్లుగా నియమించడంతో వారు సంతలో పేపర్లు అమ్ముకున్నారని రేవంత్ ఆరోపించారు. పంపకాల్లో తేడాల వల్ల ప్రశ్నపత్రాల లీకేజీ బయటపడిందే తప్ప ప్రభుత్వం గుర్తించలేకపోయిందని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. మేలో హైదరాబాద్ సరూర్ నగర్ గ్రౌండ్‌లో నిర్వహించే సభకు ఏఐసీసీ నేత ప్రియాంకాగాంధీ హాజరవుతున్నట్లు చెప్పారు. డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రులు రేణుకాచౌదరి, పొరిక బలరాంనాయక్, రాష్ట్ర మాజీ మంత్రులు షబ్బీర్‌అలీ, సంభాని చంద్రశేఖర్, గడ్డం ప్రసాద్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మల్లు రవి, అంజన్‌కుమార్ యాదవ్, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment