సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో బందీ అయిన తెలంగాణ సమాజానికి విముక్తి కల్పిస్తానని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే సీతక్క మంగళవారం జూబ్లీహిల్స్‌లోని క్యాంపు కార్యాలయానికి వచ్చి రేవంత్‌కు అభినందనలు తెలిపారు. సమ్మక్క–సారక్క ఆలయం నుంచి ప్రత్యేక పూజలు చేసిన బొట్టు పెట్టి, రక్ష కట్టారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధిని ఆకాంక్షించి సోనియాగాంధీ తెలంగాణను ఇస్తే ఆ తెలంగాణ దోపిడీ దొంగల పాలైందని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు ఇక నుంచి కంటిమీద కునుకు లేకుండా చేస్తానని అన్నారు. తనకు పీసీసీ అధ్యక్ష పదవి ప్రకటించగానే విపక్ష నేతలకు ప్రగతిభవన్ తలుపులు తెరుచుకున్నాయని ఎద్దేవా చేశారు. పీసీసీ అధ్యక్ష పదవిని పేదల సమస్యలపై పోరాటం చేసేందుకు ఒక అవకాశంగా ఉపయోగించుకుంటానన్నారు.
కొడంగల్ సీఐ పోస్టుకు 25 లక్షలు
‘కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని ప్రతి పీఎస్‌లో ఆరునెలలకోసారి ఎస్సైలు మారుతున్నారు. ఎస్సై పోస్టుకు రూ.10 లక్షలు వసూలు చేస్తున్నారు. సీఐ పోస్టు కోసం రూ.25 లక్షలతోపాటు నెలనెలా ఎమ్మెల్యేలకు మామూళ్లు ఇచ్చే పరిస్థితి ఉంది’అని రేవంత్ ఆరోపించారు.
అభినందనల వెల్లువ
కాగా, రేవంత్‌రెడ్డికి అభినందనల వెల్లువ కొనసాగుతూనే ఉంది. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. అన్వేశ్‌రెడ్డి, రంగారెడ్డి, యాదాద్రి, నిజామాబాద్ జిల్లాల డీసీసీ అధ్యక్షులు తదితరులు రేవంత్‌ను కలిసి అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే సీతక్క తల్లిని రేవంత్ పరామర్శించారు.
బీజేపీ నేతలపై రేవంత్ ట్వీట్
మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు విషయంలో కాంగ్రెస్ పార్టీ తీరును విమర్శించిన బీజేపీ నేతలకు రేవంత్ ట్వీట్ ద్వారా బదులిచ్చారు.ఎల్.కె.అడ్వాణీ, మురళీమనోహర్‌జోషి లాంటి పార్టీ వ్యవస్థాపకులను నిర్లక్ష్యం చేసి అవమానించిన వారి నుంచి నైతికత గురించి నేర్చుకోవాల్సిన అవసరం కాంగ్రెస్‌కు లేదని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment