ఉత్తరాఖండ్‌లోని చమోలీని మంచు కప్పేసిన దృశ్యం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో గత కొద్దిరోజులుగా భారీగా కురుస్తున్న మంచు అసెంబ్లీ ప్రచారాన్ని ముంచేస్తోంది. కొండల్లో ఉన్న ఈ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో మైనస్ డిగ్రీలు నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 11,697 పోలింగ్ కేంద్రాలకు గానూ 766 బూత్‌లు మంచులో కూరుకుపోయి ఉన్నాయి. వీటిలో మెజార్టీ పోలింగ్ బూత్‌లు సముద్రమట్టానికి 5 నుంచి 7 వేల అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఉత్తరకాశి, నైనిటాల్, చమోలి ప్రాంతాల్లో అధికంగా మంచు కురుస్తోంది. ఫిబ్రవరి 14న రాష్ట్రంలో అసెంబ్లీ పోలింగ్ జరగనుంది. ఎన్నికల తేదీ సమీపిస్తూ ఉండటంతో వాతావరణ పరిస్థితులు ఇలాగే ఉంటే పోలింగ్ ఎలా జరుగుతుందోనన్న ఆందోళనైతే నెలకొంది.
మంచులో చిక్కుకున్న 25 మంది బీజేపీ నేతలు
ఉత్తరాఖండ్‌లో ప్రచారాన్ని నిర్వహిస్తున్న గుజరాత్ ఎమ్మెల్యే దుష్యంత్ పటేల్ సహా 25 మంది నాయకులు రెండురోజులుగా మంచులో చిక్కుకుపోయారు. అల్మోరా నుంచి జగదేశ్వర్ ధామ్ వెళుతున్న మార్గంలో భారీగా మంచు కురుస్తూ ఉండడంతో ముందుకు వెళ్లలేకపోయారు. ఈ రెండు ప్రాంతాల్లో ప్రచారాన్ని నిర్వహించే బాధ్యతల్ని బీజేపీ అగ్రనేతలు గుజరాత్ నాయకులకు అప్పగించారు. అయితే తాము క్షేమంగానే ఉన్నామంటూ దుష్యంత్ పటేల్ ఒక వీడియో షేర్ చేశారు.
ట్రెక్కింగ్, నడకే మార్గం
మంచులో కూరుకుపోయిన ప్రాంతాలకు వాహనాల్లో వెళ్లడమే సాధ్యం కాని పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ బూత్‌లకు వెళ్లాలంటే ట్రెక్కింగ్ చేయాలి. మరికొన్ని చోట్లకి నడుచుకుంటూ వెళ్లాలి. పోలింగ్ అధికారులకే అక్కడికి వెళ్లడం అత్యంత దుర్లభం. పిత్రోగఢ్‌లోని కనర్ ప్రాథమిక పాఠశాల పోలింగ్ బూత్‌లో 588 మంది రిజిస్టర్డ్ ఓటర్లు ఉన్నారు. అక్కడికి వెళ్లాలంటే 80 కి.మీ. వాహనంలో వెళ్లాక మరో 18 కి.మీ. ట్రెక్కింగ్ చేయాలి. 200 మంది ఓటర్లున్న డ్యుమక్ పోలింగ్ కేంద్రానికి వెళ్లాలంటే 20 కి.మీ. నడవాలి. 260 మంది ఓటర్లున్న ఉత్తరకాశిలోని మోండా పోలింగ్ కేంద్రానికి వెళ్లే దారులన్నీ 2019 వరదల్లో కొట్టుకుపోయాయి. ఆ మార్గంలో వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. మరో 450 పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలంటే కనీసం 5 కి.మీ. నడవాలి.
మూడు రోజుల ముందే..
మంచు కురిసే ప్రాంతాలకు పోలింగ్ తేదీకి మూడు రోజుల ముందే అంటే శుక్రవారమే ఎన్నికల అధికారులు బయలురుతారు. వందలాది మంది ఎన్నికల సిబ్బంది ఉన్న మొత్తం 35 మంది పోలింగ్ బృందాలు గాడిదలు, గుర్రాల సాయంతో ఈవీఎం మిషన్లు, ఇతర సామగ్రి తీసుకువెళ్లనున్నారు. అసాధారణ రీతిలో మంచు కురవడంతో 24 మైగ్రేటరీ బూత్‌ల్ని కూడా ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment