
మీడియాతో మాట్లాడుతున్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటుంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు నిరంతరం అడ్డుపడుతున్నారని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. సోమవారం విశాఖలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నాథ్, తిప్పల నాగిరెడ్డి, అదీప్‌రాజ్‌లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి చెందిన పది మంది కార్పొరేటర్ల గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బలం లేకపోయినా పోటీకి దిగడం టీడీపీ నీచ సంస్కృతికి నిదర్శనమని మండిపడ్డారు. కార్పొరేటర్లను కులం పేరుతో ప్రలోభాలకు గురిచేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ పద్ధతిని మార్చుకోవాలని హితవు పలికారు. టీడీపీ సభ్యులు పోటీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటే.. కాస్త గౌరవమైనా ఉంటుందని సూచించారు. ప్రతిపక్ష నేత ప్రజా సమస్యలపై పోరాడి ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలి గానీ.. అభివృద్ధిని అడ్డుకోకూడదన్నారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మట్లాడుతూ.. 2019 నుంచి జరిగిన ప్రతి ఎన్నికలోనూ వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించిందన్నారు. భారీ విజయంతో ఏలూరు కార్పొరేషన్‌నూ కైవసం చేసుకుందన్నారు. ప్రజల్లో సీఎం జగన్‌కున్న విశ్వసనీయతకు, నిబద్ధతకు, నమ్మకానికి ఇవన్నీ నిదర్శనమని చెప్పారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీలో వైఎస్సార్‌సీపీకి చెందిన సభ్యులే గెలుస్తారన్నారు. జీవీఎంసీలో వైఎస్సార్‌సీపీకి 61 మంది కార్పొరేటర్‌లున్నారని చెప్పారు. వీరిలో 58 మంది వైఎస్సార్‌సీపీ సభ్యులని, ముగ్గురు స్వతంత్రులు మద్దతు ఇస్తున్నారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment