లక్నో: ఉత్తరప్రదేశ్‌లో గోరఖ్‌పూర్ ప్రాంతం.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కి కంచుకోట. గోరఖ్‌పూర్ అర్బన్ నుంచి తొలిసారిగా ఆయన అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతూ ఉంటే, సమాజ్‌వాదీ పార్టీ ఆయనపై ఒక మహిళా అభ్యర్థిని బరిలోకి దింపింది. ఒకప్పుడు బీజేపీ సహా వివిధ పార్టీలు మారిన దివంగత నాయకుడు ఉపేంద్ర దత్ శుక్లా భార్య సుభావతి శుక్లాను వ్యూహాత్మకంగా సీఎంపైనే పోటీకి నిలిపింది.
ఉపేంద్ర 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. గోరఖ్‌పూర్‌లో క్షేత్రస్థాయిలో బీజేపీ బలోపేతానికి ఆయన ఎంతో కృషి చేశారు. బీజేపీలో ఉన్నప్పుడు ఆయనకి యోగి ఆదిత్యనాథ్‌కి తరచూ తగాదాలు జరిగేవి. పార్టీలో మంచి పేరు తెచ్చుకున్నా ఎన్నికలు ఆయనకి కలిసి రాలేదు. నాలుగుసార్లు ఎన్నికల్లో పోటీ చేసినా ఒక్కసారి కూడా నెగ్గలేదు. ఉపేంద్ర గుండెపోటుతో 2020లో మరణించారు. ఆయన భార్య సుభావతి తన కుమారుడు అమిత్ దత్ శుక్లాకు గోరఖ్‌పూర్‌లోనే మరో నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తే బీజేపీ నిరాకరించింది. దీంతో సుభావతి కుమారుడితో కలిసి ఎస్పీలో చేరారు.
(చదవండి: మోదీలు, ఈడీలు, సీబీఐలు నన్ను భయపెట్టలేవు)
ఉపేంద్ర జీవించి ఉండగా సుభావతి ఎప్పుడూ ఇల్లు కదిలి బయటకు రాలేదు. ప్రచారంలో కూడా ఆమె ఎప్పుడూ కనిపించలేదు. ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని సుభావతిని యోగి ఆదిత్యనాథ్ వంటి బలమైన అభ్యర్థిపై దింపడానికి ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌కి కూడా కొన్ని లెక్కలున్నాయి. ఠాకూర్ సామాజికవర్గానికి చెందిన యోగిపై యూపీలో బ్రాహ్మణులు గుర్రుగా ఉన్నారు. గోరఖ్‌పూర్‌లో బ్రాహ్మణ సామాజిక వర్గంలో ప్రముఖ నాయకుడు ఉపేంద్ర. ఆయన మరణించినప్పుడు కూడా యోగి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవడంపై అప్పట్లో ఆయనపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. సానుభూతి ఓట్లు, ఓబీసీల అండతో పాటుగా బ్రాహ్మణ ఓట్లను కూడా దక్కించుకోవాలన్న వ్యూహంతో అఖిలేశ్ ఆమెను రంగంలోకి దింపారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
(చదవండి: లతా మంగేష్కర్ మెమోరియల్ రగడ: సేన సెంటిమెంట్‌ను కెలుకుతున్న బీజేపీ.. లతాజీ సోదరుడి ఫైర్)
Comments
Please login to add a commentAdd a comment