
విజయవాడ, సాక్షి: వల్లభనేని వంశీ అరెస్ట్.. రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్‌కు అద్దం పడుతోందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. ఇదంతా వంశీపై కక్షతో చంద్రబాబు చేస్తున్న కుట్ర అని మండిపడ్డారాయన. మంగళవారం విజయవాడ సబ్ జైల్లో వల్లభనేని వంశీతో ములాఖత్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
పోలీసులు పెట్టిన కేసు ఏంటి?. టీడీపీ ఫిర్యాదులో ఎక్కడా వల్లభనేని వంశీ పేరు లేదు. వంశీ ఎలాంటి తప్పు చేయలేదని టీడీపీ ఆఫీస్‌లో పని చేసే సత్యవర్ధన్ చెప్పారు. పట్టాభి, ఆయన అనుచరులు కలిసి ఓ ఎస్సీ నేతపై దాడి చేశారు. అయినా వంశీపై తప్పుడు కేసులు పెట్టారు. పట్టాభి రెచ్చగొట్టడం వల్లే గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగింది. వంశీని రెచ్చగొట్టేలా పట్టాభి నీచంగా మాట్లాడారు. పట్టాభిని చంద్రబాబే పంపించి గన్నవరంలో దాడి చేయించారు.

మంగళగిరికి సత్యవర్ధన్‌ను పిలిపించుకుని మరో ఫిర్యాదు చేయించారు. ఆ కేసులోనూ ఎక్కడా వంశీ పేరు లేదు. టీడీపీ ప్రభుత్వం రాగానే వంశీని టార్గెట్ చేశారు. కేసు మళ్లీ రీ ఓపెన్ చేశారు. సత్యవర్ధన్ నుంచి మరోసారి స్టేట్‌మెంట్ తీసున్నారు. అందులోనూ వంశీ తప్పు లేదని చెప్పారు. దీంతో గన్నవరం టీడీపీ కార్యాలయం(TDP Office Case) తగలబెట్టే ప్రయత్నం చేశారని, ఆ కార్యాలయం ఎస్సీ,ఎస్టీలకు సంబంధించిందని వంశీపై చంద్రబాబు తప్పుడు కేసులు పెట్టించారు.
టీడీపీ కార్యాలయం తగలబడింది లేదు.. ఆ కార్యాలయం ఎస్సీ,ఎస్టీలకు సంబంధించింది కాదు. వంశీపై చంద్రబాబు కక్ష గట్టి తప్పుడు కేసులు పెట్టించారు. వంశీకి బెయిల్ రాకూడదని చంద్రబాబు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించారు. మరో నెలల తరబడి బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు. మరో 44 మంది వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు పెట్టారు.

వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ ముఖ్యాంశాలు..
రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలు
ఈ రోజు వంశీని అరెస్ట్ చేసిన తీరు, ఆయన మీద పెట్టిన తప్పుడు కేసు నిజంగా రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతిభద్రతలకు అద్దం పడుతోంది. వంశీని అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనించినట్లయితే అతి దారుణమైన లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కనిపిస్తోంది.
ఈ కేసులో గన్నవరం టీడీపీ కార్యాలయంలో దాడి జరిగిందని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్థన్ అనే వ్యక్తి గన్నవరం టీడీపీ ఆఫీస్ లో పనిచేస్తున్న ఈ వ్యక్తి సాక్షాత్తు తానే జడ్జ్ గారి సమక్షంలో, జడ్జ్ గారు ఇచ్చిన సమన్లతో, పోలీసుల నుంచి సమన్లు అందుకుని, న్యాయస్థానం ముందుకు వచ్చి జడ్జ్ గారి ముందు హాజరై వాగ్మూలం ఇచ్చారు.
ఆ వాగ్మూలంలో ఆయన వంశీ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పినప్పటికీ కూడా వంశీపై తప్పుడు కేసును బనాయించారు.
ఇదీ కేసు చరిత్ర
2023, ఫిబ్రవరి 19న మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో పట్టాభి అనే వ్యక్తితో వంశీపై భరించలేని విధంగా చంద్రబాబు బూతులు తట్టించారు.
మర్నాడు ఫిబ్రవరి 20న చంద్రబాబు నేరుగా గన్నవరంకు పట్టాభిని పంపారు. అక్కడ పట్టాభి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి వల్లభనేని వంశీని తిట్టారు.
అ తర్వాత అక్కణ్నుంచి ఒక ప్రదర్శనగా వెళ్లి వైయస్సార్‌సీపీ కార్యాలయం చేరుకుని అక్కడ, శీనయ్య అనే దళిత సర్పంచ్‌పై దాడి చేశారు. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన గన్నవరం సీఐ కనకారావుపైనా టీడీపీ మూకలు దాడి చేశాయి. పట్టాభి, ఆయన అనుయాయులు సీఐ కనకారావు తల పగలగొట్టారు.
ఆ ఘటన తర్వాత పోలీసులు ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు. అయితే అప్పుడు మేమే అధికారంలో ఉన్నా ఏకపక్షంగా వ్యవహరించలేదు.
పోలీసులు సుమోటోగా తెలుగుదేశం వారితో పాటు వైయస్‌ఆర్ సీపీ వారిపైనా కూడా కేసులు పెట్టారు. అందులో ఎక్కడా వల్లభనేని వంశీ పేరు లేదు. కారణం వంశీ ఘటనా స్థలంలో లేరు.
కుట్రపూరితంగా..
ఇది జరిగిన రెండు రోజుల తరువాత గన్నవరం టీడీపీ ఆఫీస్‌లో డీటీపీ ఆపరేటర్‌గా పని చేస్తున్న సత్యవర్థన్ అనే దళిత యువకుడిని మంగళగిరిలోని టీడీపీ ఆఫీస్ కు చంద్రబాబు మనుషులు పిలిపించారు.
అక్కడ సత్యవర్థన్ తో తెల్లకాగితంపై సంతకం తీసుకుని మరో ఫిర్యాదు ఇప్పించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు.
ఆ కేసులోనూ ఎక్కడా వంశీ పేరు లేదు. కారణం వంశీ ఆ ఘటనా స్థలంలో లేరు కాబట్టి.
2023 ఫిబ్రవరి 23న పోలీసులు సత్యవర్థన్ నుంచి 161 స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ఈ స్టేట్‌మెంట్ లో కూడా ఎక్కడా వంశీ పేరు లేదు. ఘటన జరిగినప్పుడు తాను అక్కడ నుంచి వెళ్ళిపోయాను అని కూడా చెప్పారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత..
గత ఏడాది టీడీపీ ప్రభుత్వం ఏర్పడగానే వంశీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. 2024 జూలై 10న ఆ కేసు రీఓపెన్ చేశారు.
వంశీపై చంద్రబాబు పెట్టుకున్న ఆక్రోశం, కోపం ఏ స్థాయిలో ఉందంటే, ఎలాగైనా సరే వంశీని ఈ కేసులో ఇరికించాలని, వంశీ ఘటనా స్థలంలో లేకపోయినా కూడా, ఆయన్ను ఈ కేసులో 71వ నిందితుడిగా చేర్చారు.
అవన్నీ బెయిలబుల్ సెక్షన్లు కావడంతో, ముందస్తు బెయిల్ కోసం అప్పటికే వంశీ హైకోర్ట్‌ను ఆశ్రయించాడు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ రాకూడదని చంద్రబాబు కుట్రను ఇంకా ముందుకు తీసుకువెళ్లారు.
గన్నవరం టీడీపీ ఆఫీస్ తగలబెట్టే ప్రయత్నం చేశారంటూ మరో తప్పుడు కేసు నమోదు చేశారు. వాస్తవానికి టీడీపీ ఆఫీస్‌ను ఎవరూ తగలబెట్టలేదు. కనీసం ఆ ప్రయత్నం కూడా జరగలేదు. అయినా తప్పుడు కేసు పెట్టారు.
ఆ ఆఫీస్ చంద్రబాబుకు సంబంధించిన కడియాల సీతారామయ్య అనే వ్యక్తికి చెందినది. ఆయన ఎస్సీ. అలా వంశీపై ఎస్సీ, ఎస్టీ కేసు బనాయించి, బెయిల్ కూడా రాకూడదని చేసిన కుట్ర ఇది.
మొత్తం 94 మందిపై కేసు పెడితే, నెలలు తరబడి వైయస్‌ఆర్ సీపీ వారిని వేధించాలని ఇంకా 44 మందికి బెయిల్ రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారు.
చంద్రబాబు, లోకేష్ కుట్ర
ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న సత్యవర్థన్ మేజిస్ట్రేట్ ముందు హాజరై వాగ్మూలం ఇస్తే, మిగతా వారికి కూడా బెయిల్ వస్తుందనే ఉద్దేశంతో చంద్రబాబు, పోలీసులు కలిసి కుట్రపన్నారు.
పలు సమన్ల తర్వాత 2025 ఫిబ్రవరి 10న జడ్జిగారి ముందు హాజరైన సత్యవర్థన్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దీంతో చంద్రబాబుగారు, లోకేష్‌కు మనశ్శాంతి లేకుండా పోయింది. మళ్లీ వీరు పోలీసులకు కలిసి కుట్రపన్నారు.
సత్యవర్థన్ కోర్టును తప్పుదోవ పట్టించారంటూ, ఆ మర్నాడే 11న విజయవాడ, పటమట పీఎస్‌లో సత్యవర్థన్ మీద ఒక ఎఫ్‌ఐఆర్ పెట్టి, దాన్ని వారి కుటుంబ సభ్యులకు చూపించి, బెదిరించారు.
ఆ మర్నాడు ఫిబ్రవరి 12న సత్యవర్థన్ అన్నతో సత్యవర్థన్ వద్ద ఉన్న రూ.20 వేలు లాక్కుని, అతడిని కిడ్నాప్ చేశారని, దీనిని ఎవరో చూసి తమకు చెప్పారంటూ పోలీసులకు ఒక ఫిర్యాదు చేయించి వెంటనే కేసు రిజిస్టర్ చేశారు.
ఆ మరుసటి రోజు ఫిబ్రవరి 13వ తేదీ తెల్లవారుజామున వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు.
ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. అదే రోజు 13వ రోజు సాయంత్రం సత్యవర్థన్ స్టేట్‌మెంట్ నమోదు చేసి, అందులో వంశీపై చెప్పించారు.
అంటే కనీసం ఎవరైతే కిడ్నాప్ అయ్యారని చెబుతున్నారో.. అతడి స్టేట్‌మెంట్ నమోదు చేయక ముందే, వంశీని తెల్లవారుజామునే అరెస్ట్ చేశారంటే ఎంత కుట్రపూరితంగా ఈ అరెస్ట్ జరిగిందో అర్థమవుతోంది.
దొంగ కేసులకు నిదర్శనం
ఒక మనిషి తప్పు చేస్తే అతడిని శిక్షిస్తే పోలీసులకు ఒక గౌరవం ఉంటుంది. కానీ నేడు రాష్ట్రంలో తమకు నచ్చని వారిపై దొంగ సాక్ష్యాలు సృష్టించి, దొంగ కేసులు పెట్టి నెలల తరబడి జైలులో పెడుతున్నారు.
దీనికి వంశీపై పెట్టిన కేసు ఒక నిదర్శనం.
దిగజారిన ప్రజాస్వామ్యం:
పిడుగురాళ్ళ మున్సిపాలిటీలో మొత్తం 33 కౌన్సిలర్ స్ఠానాలకు గానూ అన్నింటినీ వైయస్‌ఆర్ సీపీ గెలుచుకుంది. తెలుగుదేశంకు ఒక్క కౌన్సిలర్ కూడా లేరు.
కానీ, నిన్న జరిగిన పిడుగురాళ్ళ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలో ఒక్క సభ్యుడు కూడా లేని తెలుగుదేశం సిగ్గు లేకుండా మేమే గెలుచుకున్నాము అని చెప్పుకోవడం చూస్తే చంద్రబాబు హయాంలో పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోయి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారో చెప్పడానికి నిదర్శనం.
తిరుపతి కార్పోరేషన్‌లో మొత్తం 49 స్థానాలుంటే, అందులో వైయస్‌ఆర్‌సీపీ 48 స్థానాలను, తెలుగుదేశం ఒక స్థానంను గెలుచుకుంది.
అటువంటి చోట డిప్యూటీ మేయర్ ఎన్నిక పోలీసుల ఆధ్వర్యంలో తెలుగుదేశం వారు కిడ్నాప్ చేసి డిప్యూటీ మేయర్ ను గెలుచుకున్నామని చెప్పుకున్నారు. అటే పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోయారో అర్థం చేసుకోవచ్చు.
తుని మున్సిపాలిటీలో మొత్తం 30 స్థానాలు వైయస్‌ఆర్ సీపీ గెలుచుకుంది. తెలుగుదేశం ఒక్కటి కూడా గెలుచుకోలేదు.
అలాంటి చోట తెలుగుదేశం పార్టీ వైస్ ఛైర్మన్‌ను ఎలా గెల్చుకుంటుంది? ఇక్కడ దౌర్జన్యం చేసి వైయస్‌ఆర్ సీపీ కౌన్సిలర్లను తీసుకువెళ్ళేందుకు అవకాశం లేకపోవడంతో చివరికి తెలుగుదేశం పార్టీ వత్తిడితో ఎన్నికనే వాయిదా వేయించారు.
అంటే వారికి అనుకూల వాతావరణం వచ్చే వరకు ఎన్నిక జరపరు.
పాలకొండలో వైయస్‌ఆర్ సీపీకి 17 స్థానాలు ఉంటే, టీడీపీకి కేవలం మూడు స్థానాలు ఉన్నాయి. అక్కడ వైస్ చైర్మన్ పదవి వైయస్‌ఆర్ సీపీకే వస్తుందని ఎన్నికను వాయిదా వేయించారు.
పోలీసులూ గుర్తుంచుకొండి
పోలీసులను ఇష్టానుసారంగా వాడుకుని ప్రజాస్వామ్యంకు తూట్లు పొడుస్తున్నారు. ఈరోజు ప్రతి పోలీస్ కు చెబుతున్నాను, మీ టోపీల కనిపించే ఆ మూడు సింహాలకు సెల్యూట్ కొట్టండి, కానీ తెలుగుదేశం నాయకులకు కాదు.
వారు చెప్పినట్లు చేయడం మొదలు పెట్టి అన్యాయాలు చేస్తే ఎల్లకాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదని ప్రతి అధికారికి తెలియచేస్తున్నాను.
రేపు మా అధికారం వస్తుంది. అన్యాయం చేసిన ఈ అధికారులు, నాయకులను బట్టలు ఊడదీసి నిలబెడతామని తెలియచేస్తున్నాను. ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు.
ఇదే వంశీని అరెస్ట్ చేసేప్పుడు సీఐ అన్నడంట. నేను ఒకటిన్నర సంవత్సరాల తరువాత రిటైర్ అవుతాను అని. రిటైర్ అయినా కూడా, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా, మొత్తం అందరినీ పిలిపిస్తాం. చట్టం ముందు నిలబెడతాం. బట్టలు ఊడదీస్తాం.
– న్యాయం జరిగేట్టుగా చేస్తామని ప్రతి ఒక్కరికీ తెలియచేస్తున్నాను. ఈ మాదిరిగా అన్యాయం చేస్తే ఖచ్చితంగా ప్రజలు, దేవుడు వీరిని శిక్షించే కార్యక్రమం జరుగుతుందని మరోసారి చెబుతున్నాం.
– అన్యాయంలో భాగస్వాములు కావొద్దు. మీ టోపీలపై ఉన్న సింహాలను గౌరవించండి. వాటికి సెల్యూట్ కొట్టండి. మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలని ప్రతి అధికారికి తెలియచేస్తున్నాం.
మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..
ప్రతి కేసూ ఇల్లీగల్
ప్రజాస్వామ్యం కూలిపోతోందనేందు ఇవ్వన్నీ నిదర్శనం. ప్రతి కేసు ఇల్లీగల్ కేసే. ప్రతి కేసులోనూ వీరే బెదిరిస్తున్నారు. తిరిగి మమ్మల్నే బెదిరిస్తున్నారంటూ తప్పుడు కేసులు పెడుతున్నారు.
అసలు ఎవరు, ఎవరిని బెదరిస్తున్నారు. ప్రతి విషయంలోనూ వీరే. పారిశ్రామికవేత్తలను, రాజకీయనేతలను వదిలిపెట్టడం లేదు. ప్రతి ఒక్కరినీ వీరే బెదరించి, అవతలి వారు బెదిరిస్తున్నారంటూ తప్పుడు కేసులు పెడుతున్నారు.
ఇవ్వన్నీ ఊరికే పోవు. ఇవ్వన్నీ కూడా వీరికి చుట్టుకుంటాయి. అప్పుడు వారి పరిస్తితి అతి దారుణంగా తయారవుతుంది.
వంశీ ఎందుకు టార్గెట్ అంటే..
తన సామాజికవర్గం నుంచి ఒక వ్యక్తి (వంశీ) ఎదుగుతున్నాడని.. అతడు తన కంటే, లోకేష్ కంటే గ్లామరస్‌గా ఉన్నాడని చంద్రబాబుకు కోపం.
అలాగే కొడాలి నానిపైనా చంద్రబాబుకు జీర్ణించుకోలేని ఆక్రోశం.
ఇంకా అవినాశ్ కూడా లోకేష్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి ఏదో ఒక రోజు టార్గెట్ అవుతారు. ఇదీ చంద్రబాబు మనస్తత్వం.
కేవలం తాను, తన కుమారుడు మాత్రమే ఆ సామాజికవర్గంలో లీడర్లుగా ఉండాలని చంద్రబాబు మాట. అందుకే వారికి అనుకూలంగా లేని వారిని ఆ సామాజికవర్గం నుంచి వెలేస్తారు.
అదో మాఫియా రాజ్యం
చంద్రబాబు, ఆంధ్రజ్యోతి, టీవీ5 కలిసి చేసేది. ఇది ఒక మాఫియా సామ్రాజ్యం.
చంద్రబాబును సీఎంను చేయడం కోసం, ఆయనకు ఓట్లు వేయించడం కోసం ఆ మాఫియా సామ్రాజ్యం తయారైంది.
వారి సామాజికవర్గంలో ఎవరైనా వ్యతిరేకంగా నిలబడితే వారి పని అంతే. వారిపై తప్పుడు కేసులు, అక్రమ అరెస్ట్. వారిపై బురద చల్లడం. వారిపై ట్రోలింగ్ చేయించడం చేస్తున్నారు. ఇవ్వన్నీ చంద్రబాబు, లోకేష్ నైజానికి అద్దం పడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment