మాట్లాడుతున్న విజయసాయిరెడ్డి
సాక్షి, అమరావతి: ఇచ్చిన మాటకు కట్టుబడి.. సంక్షేమాభివృద్ధి పథకాలతో రాష్ట్ర దిశ, దశను మార్చేలా సుపరిపాలనను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్నారని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కొనియాడారు. ముఖ్యమంత్రి జగన్ బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
అంతకుముందు.. విజయవాడ నుంచి పార్టీ తాడేపల్లిలోని పార్టీ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని.. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవరప్రసాద్, మురుగుడు హనుమంతరావు, కల్పలతారెడ్డి, వంశీకృష్ణ తదితరులతో కలిసి వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. ఆ తర్వాత భారీ కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ఏమన్నారంటే..
పదేళ్లపాటు కార్యకర్తల పోరాటంవల్లే వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చింది. గత మూడేళ్లుగా 95% హామీలను సీఎం జగన్ అమలుచేశారు. 70% పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చి సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించారు. పరిపాలన సంస్కరణల్లో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థ, రైతుభరోసా కేంద్రాలు, పునర్వ్యవస్థీకరణ ద్వారా 26 జిల్లాలను ఏర్పాటుచేసి సుపరిపాలన అందిస్తున్నారు. అలాగే, సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లోకి రూ.1.48 లక్షల కోట్లు జమ చేసిన ప్రజా ప్రభుత్వమిది.
నామినేటెడ్ పోస్టుల్లో, పనుల్లో 50% రిజర్వేషన్లు మహిళలకు కల్పించిన మహిళా పక్షపాత ప్రభుత్వమిది. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించి.. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందిస్తూ.. పిల్లల భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తున్నాం. ఇక.. చంద్రబాబు 14 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు చేయలేనిది.. సీఎం వైఎస్ జగన్ మూడేళ్లలోనే చేసి చూపించారు.
మహానాడులో తన అనుచరులతో తొడలు కొట్టిస్తూ.. ముఖ్యమంత్రిని తిట్టిస్తూ చంద్రబాబు అమితానందం పొందారు. బాధ్యత గల ప్రతిపక్ష నేత ఎవరైనా ఇలా చేస్తారా? మూడేళ్లలో చేసిన మేలును వివరించడానికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు గడపగడపకు వెళ్తున్నారు. చంద్రబాబు తన 14 ఏళ్లలో చేసిన పనులు వివరించండానికి అలా వెళ్లే ధైర్యం ఉందా? 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించడానికి ఎంత చిత్తశుద్ధితో పనిచేశారో.. అంతే చిత్తశుద్ధితో 2024 ఎన్నికల్లో కూడా కార్యకర్తలు పనిచేయాలి. సభ అనంతరం పేదలకు భారీఎత్తున వస్త్రాలు పంపిణీ చేశారు. అన్నదానం చేశారు.
బహుజనులకు అన్ని రంగాల్లో సముచిత స్థానం
మోపిదేవి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు దళితులను, బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తే.. వారికి సీఎం జగన్ అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించారని చెప్పారు. మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ సామాజిక న్యాయం అంటే టీడీపీ, జనసేనలకు ఒక బూటకపు ఎన్నికల నినాదం మాత్రమేనని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్‌నాయుడు, ఏపీ ఫైబర్‌నెట్ చైర్మన్ గౌతమ్‌రెడ్డి, ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్‌రావు, మాల కార్పొరేషన్ చైర్‌పర్సన్ అమ్మాజీ, పార్టీ అధికార ప్రతినిధి నారమల్లి పద్మజ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment