
సాక్షి న్యూఢిల్లీ: అంతర్జాతీయ కంపెనీల పేరుతో అవినీతికి పాల్పడి చంద్రబాబు రాష్ట్ర పరువు తీశారని వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు. సాంకేతిక అంశాల ఆధారంగా బాబు తప్పించుకునే ప్రయత్నం చేశారన్నారు. ఢిల్లీలో ఆదివారం అఖిలపక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు కేసులకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావాలని సమావేశంలో కోరామని.. జనగణనలో కులగణన చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఏపీ విభజన చట్టంలోని హామీలన్నీ అమలుచేయాలని కూడా డిమాండ్ చేశామని, ప్రత్యేక హోదా, పోలవరం నిధుల్ని ఇవ్వాలని కోరామని భరత్ చెప్పారు.
టీడీపీకి వైఎస్సార్‌సీపీ ఎంపీల చెక్
ఇక చంద్రబాబు అరెస్టుపై సానుభూతి పొందేందుకు అఖిలపక్ష సమావేశాన్ని వేదికగా మార్చుకునేందుకు టీడీపీ చేసిన ప్రయత్నాన్ని వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మార్గాని భరత్ తిప్పికొట్టారు. చంద్రబాబు ఒక క్రిమినల్ అని, అవినీతికి పాల్పడ్డారని.. కుట్రకు ప్రధాన సూత్రధారి, లబి్ధదారు ఆయనేనని వారు తెలిపారు. అందుకే చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసిందని అఖిలపక్ష సమావేశంలో విజయసాయిరెడ్డి స్పష్టంచేశారు.
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సహా ఇతర కేంద్ర మంత్రులు, అన్ని పార్టీల నేతల సమక్షంలోనే విజయసాయిరెడ్డి కుంభకోణం గురించి వివరించారు. ఈ సమయంలో.. జి–20 సమావేశాల సమయంలో చంద్రబాబును అరెస్టుచేయడం ప్రజాస్వామ్యానికి దుర్దినమని టీడీపీ నేతలు అంటుండగా.. ఆ సమావేశాలు జరుగుతున్నాయని 420లను వదిలేయాలా? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment