సోషల్ మీడియా సైనికుల సమావేశంలో మాట్లాడుతున్న విజయసాయిరెడ్డి
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావటంలో పార్టీ సోషల్ మీడియా పాత్ర అధికంగా ఉందని, పార్టీ సోషల్ మీడియా సైనికులు ప్రాణాలకు తెగించి టీడీపీవారి పోస్టింగ్‌లకు కౌంటర్ పోస్టులు పెట్టారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి అన్నారు. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరువరన్నారు. వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కర్నూలు–ప్రకాశం జిల్లాల కార్యకర్తల ఆత్మీయ సమావేశం బుధవారం తాడేపల్లిలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి అధ్యక్షతన జరిగింది. సాయిరెడ్డి మాట్లాడుతూ.. సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయపరంగా పార్టీ మద్దతు సంపూర్ణంగా ఉంటుందన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు అభ్యంతరకరంగా ఉండరాదని సూచించారు.
పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ప్రతిఒక్కరికీ గుర్తింపు కార్డులిస్తామని ప్రకటించారు. అయితే వీటిని దుర్వినియోగం చేయొద్దని సూచించారు. సోషల్ మీడియా కార్యకర్తలతో రాష్ట్ర, జిల్లా, నియోజక, మండల కమిటీలు వేస్తామని, తర్వాత శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ, మండల స్థాయిల్లో మూడు నెలలకోసారి సమావేశాలు ఏర్పాటు చేస్తామని, ఏ పోస్టులు పెట్టాలి.. ఎలా పెట్టాలి.. పార్టీ విధివిధానాలు తెలియచేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పోచ బ్రహ్మానందరెడ్డి, శాసనసభ్యుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఏపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్ చల్లా మధు, వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గుర్రంపాటి దేవేందర్‌రెడ్డి, కర్నూలు, ప్రకాశం జిల్లాల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment