రాములమ్మకు కోపమొచ్చింది. బీజేపీలో విజయశాంతి సెకండ్ ఇనింగ్స్ సాఫీగా సాగడం లేదా ? బహిరంగంగా అసంతృప్తి వెళ్లగక్కడం వెనక కారణాలేంటీ ? తెర వెనుక ఎవరైనా ఉన్నారా ? అసలు విజయశాంతి ఆగ్రహానికి కారణమేంటి ?
విజయశాంతి...ఫైర్ బ్రాండ్... మెదక్ మాజీ ఎంపీగా తెలంగాణ ఉద్యమకారురాలిగా సుపరిచితులు. గతంలో బీజేపీ అగ్రనేత అద్వానీకి దగ్గరగా ఉండి రథయాత్రలో పాల్గొన్నారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పక్కనే ఉన్నారు. తల్లి తెలంగాణ పార్టీ పెట్టి ఆమెనే సారథ్యం వహించారు. కాంగ్రెస్ పార్టీలో ప్రచార కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. బీజేపీలో చేరిన తర్వాత... ఆ స్థాయిలో ఆమెకు ప్రాధాన్యత దక్కడం లేదని ఆమె మనోవేదనకు గురవుతున్నారట.
ఇటీవల బీజేపీలో చేరుతున్న ముఖ్య నేతల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రతీ వేదికపై విజయశాంతిని మాట్లాడించలేకపోతున్నారు. ఇదే ఆమె మనసు నొప్పించడానికి కారణమైనట్లు తెలుస్తోంది. బీజేపీ సమావేశాల్లో ఒకరిద్దరినే మాట్లాడించే ఆనవాయితీ ఉంది. వేదికపై ఎంత మంది ఉన్నా... ప్రోటోకాల్ ప్రకారం సందర్భోచితంగా మాట్లాడిస్తున్నారు. బండి సంజయ్ అదే ఫార్మూలా ఫాలో అవుతున్నారు. తాజాగా సర్వాయి పాపన్న జయంతి కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడి కార్యక్రమాన్ని ముగించారు. సమావేశంలో మాట్లాడించే అవకాశం ఇవ్వకపోవడంతో విజయశాంతి ఒక్కసారిగా తన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పాత్ర లేకుండా చేస్తే పాతరేస్తానని హెచ్చరికలు చేశారు.
రాములమ్మ ఇంతగా రియాక్ట్ కావడం వెనక ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో పార్టీలో ఓ వర్గం నేతలు అనుమానిస్తున్నారు. విజయశాంతి భుజంపై గన్ను పెట్టి .. మాటల తూటాలు పేల్చుతున్నారనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇష్యూ ఇప్పటికే అధిష్టానం పెద్దలకు చేరింది. దీంతో, ఈ వివాదాన్ని సర్దుమణుస్తారా ? లేక బహిరంగ వ్యాఖ్యలు చేసిన విజయశాంతిని వివరణ కోరుతారా ? అన్నది చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment