
కదిరి: రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో జరిగిన పెగసస్ స్పైవేర్ బాగోతంపై రాష్ట్ర బీజేపీ పెద్దలు అప్పుడే ఫిర్యాదు చేశారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమగుట్ట విష్ణువర్ధన్‌రెడ్డి చెప్పారు. వ్యక్తిగత సమాచారం చోరీ, ఓట్ల తొలగింపుతో పాటు తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నట్లు అనుమానం ఉందని అప్పట్లోనే బీజేపీ పేర్కొందని గుర్తుచేశారు.
అనంతపురం జిల్లా కదిరిలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెగసస్‌పై హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని ఏపీ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం కావడంతో సమగ్ర విచారణ జరిపేలా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని కోరారు.