హస్తం... పదిలం | Votes for Congress in the Lok Sabha elections at the assembly level | Sakshi
Sakshi News home page

హస్తం... పదిలం

Published Wed, Jun 5 2024 5:53 AM | Last Updated on Wed, Jun 5 2024 5:53 AM

Votes for Congress in the Lok Sabha elections at the assembly level

అసెంబ్లీ స్థాయిలోనే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్లు

కంచుకోట జిల్లాల్లో అవే ఫలితాలు.. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌లలో భారీ మెజార్టీలు

దేశంలో ధుబ్రీ, తిరువల్లూర్‌ తర్వాత కాంగ్రెస్‌కు అత్యధిక మెజార్టీ నల్లగొండలోనే

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఎన్నికలు మా పాలనకు రెఫరెండం.. లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్య ఇది. దీనిని సమర్థించుకునేందుకు వీలుగా మిగిలిన అన్ని పార్టీల కంటే ఎక్కువ ఓట్లే కాంగ్రెస్‌ సాధించగలిగింది. అయితే రేవంత్‌ విశ్వాసానికి తగిన స్థాయిలో గెలుపు సాధ్యం కాకపోయినా కాంగ్రెస్‌ పార్టీ ఓట్లు మాత్రం పదిలంగానే ఉన్నాయని లోక్‌సభ ఫలితాల సరళి స్పష్టం చేస్తోంది. 

కాంగ్రెస్‌ గెలిచిన చోట్ల భారీ మెజార్టీలనే సాధించగలిగింది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, భువనగిరి, పెద్దపల్లిల్లో లక్ష నుంచి ఐదున్నర లక్షల మెజార్టీ సాధించగా, నాగర్‌కర్నూల్‌లో లక్షకు దగ్గరగా, జహీరాబాద్‌లో మాత్రం అత్యల్పంగా 50 వేల లోపు తేడాతో గెలిచింది. ఇక మహబూబ్‌నగర్, మెదక్‌లలో స్వల్ప తేడాతోనే ఓడిపోయింది. 

మరోవైపు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ గెలిచిన స్థానాల్లో అతిపెద్ద మూడో మెజార్టీని నల్లగొండ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి సాధించగా, ఆ స్థానం పరిధిలోనికి వచ్చే హుజూర్‌నగర్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా  ఏకంగా 1.05 లక్షల పైచిలుకు మెజార్టీ రావడం గమనార్హం. అక్కడ ఇన్‌చార్జిగా మంత్రి, సిట్టింగ్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యవహరించడం తెలిసిందే.

కోటలు బీటలు వారకుండా..
అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయానికి ఎక్కడా తీసిపోకుండా లోక్‌సభ ఎన్నికల్లోనూ విజయతీరాలను చేరడంతో కాంగ్రెస్‌ పార్టీ కేడర్‌ ఊపిరి పీల్చుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు దోహదపడిన కంచు కోటలకు ఎక్కడా బీటలు వారకుండా లోక్‌సభ ఎన్నికల్లోనూ ఓట్లను రాబట్టుకోగలిగింది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో 36 అసెంబ్లీ స్థానాలుండగా, అందులో 34 చోట్ల ఎమ్మెల్యేలుగా కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందారు.

 ఇప్పుడు ఆ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోనికి వచ్చే నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్‌ లోక్‌సభ స్థానాల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. దాదాపు అసెంబ్లీలో సాధించిన స్థాయిలోనే ఆయా నియోజకవర్గాల్లో ఓట్లను రాబట్టుకోగలిగింది. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని పెద్దపల్లి, రామగుండం, ధర్మపురి, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని స్థానాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందగా, ఇప్పుడు కూడా ఆ పార్లమెంటులో మంచి మెజార్టీతో కాంగ్రెస్‌ విజయం సాధించింది. 

ఇక మహబూబ్‌నగర్, కరీంనగర్‌ జిల్లాల్లో బీజేపీతో హోరాహోరీ తలపడిన కాంగ్రెస్‌ అక్కడ కూడా మంచి విజయాలనే సాధించగలిగింది. నాగర్‌కర్నూల్‌లో 94 వేల ఓట్లు, పెద్దపల్లిలో 1.3 లక్షల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్‌ పార్టీ మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానాన్ని కేవలం ఐదువేల లోపు ఓట్ల తేడాతో కోల్పోయింది.


కరీంనగర్‌లో భారీ తేడాతో ఓటమి
కరీంనగర్‌ లోక్‌సభ స్థానాన్ని మాత్రం భారీ తేడాతో పోగొట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీ, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయిన మెదక్‌ పార్లమెంటు స్థానంలో మాత్రం రెండో స్థానానికి చేరుకోగలిగింది. ఇక్కడ కేవలం 40 వేల ఓట్ల తేడాతో మాత్రమే కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌ పరాజయం పాలయ్యారు. మొత్తం మీద మహబూబ్‌నగర్, మెదక్‌ స్థానాల్లో గెలుపు అంచుల వద్ద బోల్తా పడ్డామని, లేదంటే తాము ఆశించిన డబుల్‌ డిజిట్‌ స్థానాలు వచ్చేవనే అభిప్రాయం కాంగ్రెస్‌ నేతల్లో వ్యక్తమవుతోంది.

గాంధీభవన్‌లో సంబురాలు
రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆశించిన సీట్లు గెలవడంతో బాణాసంచా మోత
సాక్షి, హైదరాబాద్‌: ఇటు తెలంగాణలో, అటు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ ఆశించిన స్థాయిలో విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు గాంధీభవన్‌లో సంబురాలు చేసుకున్నాయి. తెలంగాణలో 8 ఎంపీ స్థానాల్లో గెలవడం, కంటోన్మెంట్‌ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందడంతో డప్పులు మోగిస్తూ, బాణాసంచా కాల్చుకుంటూ, స్వీట్లు పంపిణీ చేసి తమ సంతోషాన్ని పంచుకు న్నారు.

ఈ సంబురాల్లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్, పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, పార్టీ నేతలు హర్కర వేణు గోపాల్, ఫహీం ఖురేషీ, రోహిణ్‌రెడ్డి, మెట్టుసాయి కుమార్, సంగిశెట్టి జగదీశ్వరరావు పాల్గొన్నారు.

తప్పిదాలు సరిదిద్దుకుంటాం: మహేశ్‌కుమార్‌
గాంధీభవన్‌లో మహేశ్‌కుమార్‌గౌడ్‌ మీడియాతో మాట్లాడుతూ ఇటు తెలంగాణలో, అటు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీకి ఓటేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపు రేవంత్‌ పాలనపై ప్రజలకున్న నమ్మకానికి అద్దం పడుతుందన్నారు. 

తాము చెప్పినట్టుగా లోక్‌సభ ఎన్నికలను రెఫరెండంగానే భావిస్తున్నామని, గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల కంటే ఈ లోక్‌సభ ఎన్నికల్లో తమకు ఎక్కువ ఓట్లు వచ్చాయని, అంటే ప్రజల్లో తమపై విశ్వాసం పెరిగినట్టేనని చెప్పారు. తన కంటిని తన వేలుతో పొడుచుకున్నట్టు స్వయంకృతాపరాథంతో బీజేపీని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ గెలిపించారని, ఆ రెండు పార్టీల మధ్య కుదిరిన లోపాయికారీ ఒప్పందంతోనే బీజేపీ 8 స్థానాల్లో గెలవగలిగిందని చెప్పారు. 

మోదీని ప్రజలు తిరస్కరించారు: వీహెచ్‌
మాజీ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ నరేంద్ర మోదీ పదేళ్లలో ఏమీ చేయలేదని, ప్రజలకిచ్చిన హామీలు నిలబెట్టుకోలేదన్నారు. ఇస్‌బార్‌ చార్‌సౌ పార్‌ అన్న మోదీని ప్రజలు తిరస్కరించారన్నారు. తుది విడత పోలింగ్‌ పూర్తయిన తర్వాత వచ్చిన ఎగ్జిట్‌పోల్స్‌ చూస్తే రాత్రి తనకు నిద్ర పట్టలేదని, గోడీ మీడియా ఎంత ఊదరగొట్టినా ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించారని చెప్పారు. ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ మోదీ గ్యారంటీ ఎక్స్‌పైరీ అయిందని, మోదీ ప్రధాని పదవికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement