కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల సమరానికి నగారా మోగింది. రాష్ట్ర వ్యాప్తంగా 8 విడతల్లో పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 శాసన సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. మార్చి 27 నుంచి ఎనిమిది దశల్లో జరుగనున్న ఎలక్షన్ ఫలితాలు మే 2న వెలువరించనున్నట్లు తెలిపింది. ఇక ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లో పొలిటికల్ హీట్ తారస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి, అధికార తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై నిప్పులు చెరుగుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే వివిధ రకాల సంక్షేమ పథకాలు ప్రకటిస్తూ మరోసారి ఓటర్ల మనసును చూరగొనే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు... అభివృద్ధి కావాలో... అవినీతి, కట్ మనీ కల్చర్ కావాలో తేల్చుకోండి అంటూ బీజేపీ ప్రచార దూకుడు పెంచింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా బీజేపీ ప్రధాన నేతలంతా బెంగాల్‌లో పర్యటిస్తూ మమత సర్కారుపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో(2016) 294 స్థానాలకు గానూ టీఎంసీ 211, వామపక్షాలు 79 గెలుచుకోగా బీజేపీ కేవలం 3 స్థానాలకే పరిమితం అయిన విషయం తెలిసిందే.
అయితే గత లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 18 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుని మమతకు షాకిచ్చింది. అదే జోరులో టీఎంసీ కీలక నేతలను పార్టీలో చేర్చుకుంటూ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంది. దీంతో టీఎంసీ- బీజేపీల మధ్య పోరు మరింత రసవత్తరంగా మారనుంది. అల్లర్లు చెలరేగే అవకాశం ఉన్న నేపథ్యంలో శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని ఎనిమిది విడతల్లో పోలింగ్ నిర్వహించేందుకు సీఈసీ సిద్ధమైంది. ఈ విషయం గురించి సీఈసీ సునీల్ అరోరా మాట్లాడుతూ.. ‘‘రాజకీయ పార్టీల పేర్ల ప్రస్తావన అనవసరం. శాంతి భద్రతలను ప్రభావితం చేసే అంశాలు చాలా ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించినప్పుడు, ఈసారి ఎనిమిది విడతల్లో ఎన్నికల నిర్వహణ పెద్ద విషయమేమీ కాదు’’ అని పేర్కొన్నారు.
పోలింగ్ తేదీలు:
►తొలి విడత: మార్చి 27
►రెండో విడత: ఏప్రిల్ 1
►మూడో విడత: ఏప్రిల్ 6
►నాలుగో విడత: ఏప్రిల్ 10
►ఐదో విడత: ఏప్రిల్ 17
►ఆరో విడత: ఏప్రిల్ 22
►ఏడో విడత: ఏప్రిల్ 26
►ఎనిమిదో విడత: ఏప్రిల్ 29
చదవండి: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇదే..
Comments
Please login to add a commentAdd a comment