కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పశ్చిమ బెంగాల్‌లో రాజకీయం వేడెక్కుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ, శాసనసభ ఎన్నికల్లోనూ తన మార్కు చూపించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టే విధంగా వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడి ఎపిసోడ్ సహా ఇప్పటికే పలు అంశాల్లో కేంద్రం వర్సెస్ మమత అన్నట్లుగా ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీఎంసీ అసంతృప్త నేత సువేందు అధికారి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. (చదవండి: కేంద్రంతో మమత ఢీ)
కాగా టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో సువేందు తన మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రోడ్డు రవాణా, నీటిపారుదల శాఖా మంత్రిగా పనిచేసిన ఆయన హూగ్లీ రివర్ బ్రిడ్జి కమిషన్ చైర్మన్ పదవి నుంచి కూడా వైదొలిగారు. దీంతో ప్రభుత్వానికి, సువేందుకు మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆయన అనుచరులు పలువురిని బహిష్కరిస్తూ ఆదివారం పార్టీ నిర్ణయం తీసుకుంది. కాగా సుభేందు అధికారి టీఎంసీని వీడినట్లయితే మమత సర్కారు కుప్పకూలూతుందంటూ బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అంతేగాక సువేందు బీజేపీలో చేరినట్లయితే తాము ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు.
మా నాయకుడికి బీజేపీ నేతల ఫోన్: మమతా బెనర్జీ
అధికార దాహంతో బీజేపీ తమ పార్టీ నేతలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తోందని టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ఆరోపించారు. కూచ్‌బెహర్ జిల్లాలో ఆమె మాట్లాడుతూ.. ‘‘బీజేపీ మా నాయకులకు ఫోన్‌కాల్స్ చేస్తోంది. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్రతా భక్తికి ఢిల్లీ బీజేపీ నేతల నుంచి, అనుబ్రతా మొండాల్‌కు బీర్భూమ్ నుంచి కాల్ వచ్చింది. చూడండి వాళ్లెంత ప్రమాదకరమో చూడండి. మా నాయకులను లాక్కొనేందుకు వారి ప్రయత్నాలు చూడండి’’ అని విమర్శించారు. ‘‘బీజేపీ దొంగలు, గూండాలు, చంబల్ దోపిడీదారుల పార్టీ. కూచ్‌బెహర్‌లో వాళ్లు చేసిన అభివృద్ధి ఏమీలేదు. వలస కార్మికుల రైలు చార్జీలు నేను చెల్లించాను. మైనార్టీలను అక్కున చేర్చుకున్నాను. బీజేపీని నమ్ముకుంటే లాభం లేదు’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment