మహారాణిపేట (విశాఖ దక్షిణ): అవినీతి చక్రవర్తి చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడు పాల్పడిన ఆర్థికనేరాలు ఒక ఆంగ్లపత్రిక ద్వారా బహిర్గతమయ్యాయని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చెప్పారు. ఇవన్నీ తప్పని, తాను నిజాయితీపరుడినని ఈ కథనాలు రాసిన పత్రికపై కేసు వేయడానికి ముందుకొస్తారా? అని ప్రశ్నించారు. విశాఖపట్నంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోకేశ్ తల్లిని తాము పల్లెత్తుమాట అనకపోయినా తమపై కేసులు పెట్టడానికి ముందుకొచ్చాడని, ఇప్పుడు తన తండ్రిపై వచ్చిన కథనాలు తప్పని ఆయా పత్రికలపై కేసులు వేయడానికి ముందుకొస్తాడా? లేక తన తండ్రికి తనకు సంబంధం లేదని వదిలేస్తాడా? అని నిలదీశారు.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఆర్థికనేరాలన్నీ రుజువులతో సహా బహిర్గతమయ్యాయని చెప్పారు. చంద్రబాబు ముడుపుల వ్యవహారాలు పత్రికల్లో వచ్చాయని, వాటిని ఆయన ఖండించకపోవడాన్ని బట్టి చూస్తే అవన్నీ నిజమేనని స్పష్టమవుతోందని పేర్కొన్నారు. గతంలో తాను అసెంబ్లీలో ఇదే అంశంపై అన్ని ఆధారాలతో సుమారు 45 నిమిషాలు మాట్లాడానని గుర్తుచేశారు. చంద్రబాబు ఆస్తులపై దాడులు నిర్వహించినప్పుడు లెక్కల్లోలేని రూ.2 వేలకోట్లు దొరికినట్లు ఆదాయపన్ను శాఖ ఆధారాలతో సహా బహిర్గతం చేసిందని తెలిపారు.
2016 సంవత్సరానికి ముందు నుంచే చంద్రబాబు కాంట్రాక్టర్ల దగ్గర కిక్ బ్యాక్స్ తీసుకున్న చంద్రబాబు అమరావతి నిర్మాణాల్లో అవినీతి సొమ్మును డొల్ల కంపెనీలకు ఏ విధంగా బదలాయించాడో ఆయన పర్సనల్ సెక్రటరీ ద్వారా ఆదాయపన్ను అధికారులు తెలుసుకున్నారని చెప్పారు. అవినీతి అంటే ఏంటో తనకి తెలియదని, అవినీతి డబ్బు తాను ఎప్పుడూ చూడలేదని చెప్పుకొనే చంద్రబాబు పత్రికల్లో వచ్చిన కథనాలకు ఎందుకు జవాబు చెప్పలేకపోతున్నాడని ప్రశ్నించారు.
చంద్రబాబు పూర్తిగా అవినీతి ఊబిలో కూరుకుపోయాడని, తన అవినీతి సామ్రాజ్యం కూలిపోతుందని తెలిసి ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకుంటున్నాడని చెప్పారు. చంద్రబాబు ఎంత ప్రయత్నించినా శేష జీవితంలో శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. చంద్రబాబు ఈ జన్మలో చేసిన పాపాలకు శిక్ష ఈ జన్మలోనే అనుభవిస్తాడని పేర్కొన్నారు.
రెండెకరాల నుంచి లక్షల కోట్లకు ఎలా ఎదిగాడో చెప్పాలి
భవిష్యత్తుకి గ్యారెంటీ అంటూ కొత్త నినాదంతో ప్రజల ముందుకు వస్తున్న చంద్రబాబు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క వాగ్దానమైనా నెరవేర్చడా? అని మంత్రి ప్రశ్నించారు. రైతులను, మహిళలను పూర్తిగా మోసం చేసిన చంద్రబాబును నమ్మవద్దని ప్రజల్ని కోరారు. చంద్రబాబు తన బుర్ర ఉపయోగించి ఒక కొత్త పథకాన్నైనా ప్రకటించగలిగాడా అని ప్రశ్నించారు. రెండెకరాల నుంచి లక్షల కోట్లకు ఎలా ఎదిగారో చంద్రబాబు చెప్పాలన్నారు. చంద్రబాబుకు రాజకీయాల్లోకి రాకముందు ఆస్తులు, ఇప్పుడున్న ఆస్తులు ప్రజలకు తెలుసని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment