తెలంగాణ కమలం పార్టీలో ఏం జరుగుతోంది? ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలకు విలువ ఇవ్వడంలేదా? రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేసిందెవరు? ఉన్న నలుగురు ఎంపీల మధ్య సయోధ్య లేదు ఎందుకని? అధ్యక్షుడంటే ఇతర నేతలకు ఎందుకు పడటంలేదు? తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది?
తెలంగాణ కాషాయపార్టీ సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. నేతల మధ్య సమన్వయం కోసం హైకమాండ్ కసరత్తు చేస్తున్నా.. పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. ప్రజాబలంతో గెలిచిన నేతలను కూడా పార్టీ పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ తీసుకునే నిర్ణయాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను కనీసంగా కూడా పరిగణించడంలేదనే టాక్ నడుస్తోంది.
2019 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీజేపీ తరపున నలుగురు ఎంపీలు గెలిచారు. సికింద్రాబాద్ ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి కేంద్ర క్యాబినెట్ లో కొనసాగుతున్నారు. కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నలుగురు ఎంపీలు ఈ మధ్యకాలంలో ఒకే వేదికపై కనిపించిన దాఖలాలే లేవు. కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు, మిగిలిన ఇద్దరు ఎంపీలది తలోదారి అన్నట్లుగా తయారయ్యరంటూ పార్టీలోనే చర్చ జరుగుతోంది.
తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యేల పరిస్థితి మరోలా తయారైంది. గోషామహల్ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్‌పై చాలా కాలంగా కొనసాగుతున్న పార్టీ సస్పెన్షన్ ఇంకా తొలగించలేదు. ఎన్నికలు దగ్గరపడుతున్నా ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడంలేదని గోషామహల్ నియోజకవర్గ కేడర్ పార్టీ నాయకత్వం మీద ఆగ్రహంతో ఉంది. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావులను పార్టీ అస్సలు పట్టించుకోవడం లేదని టాక్.
చదవండి: తెలంగాణ బీజేపీ సీఎం అభ్యర్థి ప్రకటన.. ఉత్కంఠ వీడేది అప్పుడేనా?
ఈటల రాజేందర్ నేరుగా ఢిల్లీ వెళ్లి పార్టీ హైకమాండ్ కే తన సమస్యని మొరపెట్టుకున్నారు. మరో ఎమ్మెల్యే రఘునందన్.. రాష్ట్రంలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ.నడ్డాను కలిసి పార్టీలో జరుగుతున్న విషయాలను వివరించారు. తమ అభిప్రాయాలు పార్టీ రాష్ట్ర నాయకత్వం అసలు పట్టించుకోవడంలేదని ఎమ్మెల్యే రఘునందన్ జే.పీ.నడ్డాకు ఫిర్యాదు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీ కార్పొరేటర్ల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోంది. 48 మంది కార్పొరేటర్లు బీజేపీ నుంచి గెలవగా.. ఇద్దరు మృతి చెందారు.. మరో నలుగురు పార్టీ నుంచి జంప్ అయ్యారు. మరో నలుగురు కూడా అధికార బీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎంపీ బండి సంజయ్.. నిజంగా మిగతా ప్రజా ప్రతినిధులను కలుపుకొని వెళ్లడం లేదా ? లేక బండితో వాళ్లే కలిసిరావడం లేదా ? ఢిల్లీ పెద్దలు ప్రజాబలంతో గెలిచిన నేతలను కలుపుతారా? వదిలేస్తారా ? ఎన్నికలు ముంగిట్లోకి వస్తున్న తరుణంలో పార్టీలోని కీచులాటలను ఎలా సరిదిద్దుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment