TS:ఐటీ మంత్రి ఎవరో..? | Who Will Be Telangana New It Minister | Sakshi
Sakshi News home page

ఐటీ మంత్రి ఎవరో..?

Published Fri, Dec 8 2023 11:58 AM | Last Updated on Fri, Dec 8 2023 1:56 PM

Who Will Be Telangana New It Minister  - Sakshi

సాక్షి,హైదరాబాద్‌ : తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడింది. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు 11 మంది మంత్రులు బాధ్యతలు చేపట్టారు. అయితే వీరికి ఇంకా శాఖలు కేటాయించలేదు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యంగా సోషల్‌ మీడియాలో ఒకే ఒక్క పోర్ట్‌ఫోలియోపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వంలో కేటీఆర్‌ నిర్వహించిన ఐటీ శాఖ కొత్త ప్రభుత్వంలో ఎవరికి కేటాయిస్తారన్నది హాట్‌టాపిక్‌గా మారింది.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఐటీ శాఖను కేటీఆర్‌ డైనమిక్‌గా నిర్వహించి బాగా పాపులర్‌ అయ్యారు. ఐటీ శాఖలో కేటీఆర్‌ చేసిన కృషి వల్లే బీఆర్‌ఎస్‌ హైదరాబాద్‌లో క్లీన్‌స్వీప్‌ చేసిందన్న వాదనా ఉంది. ఇప్పుడు శాఖ తీసుకునే మంత్రిని యూత్‌ కేటీఆర్‌తో పోల్చడం ఖాయం. కొత్తగా ఐటీ శాఖ తీసుకునే మంత్రి కేటీఆర్‌ రేంజ్‌లో శాఖ నిర్వహించకపోతే యువత అసంతృప్తికి గురయ్యే చాన్స్‌ లేకపోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో కొత్త ప్రభుత్వంలో ఈ శాఖ కేటాయింపు విషయం ఆసక్తికరంగా మారింది. 

కొత్త ప్రభుత్వంలో ఇప్పటికే మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వారిలో ఎక్కువ మంది సీనియర్లే. వీరిలో ఎవరికీ గతంలో ఐటీ శాఖ నిర్వహించిన అనుభవం లేదు. మంత్రులుగా బాధ్యతలు చేపట్టినవారిలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి లేదంటే శ్రీధర్‌బాబుకు ఐటీ శాఖ ఇచ్చే అవకాశాలున్నయని సోషల్‌ మీడియాలో ‍ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇదే నిజమైతే వీరిద్దరూ కేటీఆర్‌కు ధీటుగా ఐటీ శాఖను నిర్వహించగలుగుతారా అన్నది తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే. 

మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి తన మంత్రివర్గంలో ఇంకో ఆరుగురు మంత్రులను తీసుకోవాల్సి ఉంది. త్వరలోనే ఆయన తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారని తెలుస్తోంది. కొత్తగా మంత్రులు కానున్న వారి జాబితాలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కలకుంట్ల మదన్‌మోహన్‌రావుల పేర్లు ఉండవచ్చని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. వీరిద్దరిలో ఎవరికి మంత్రి పదవి దక్కినా వారికి ఖాయంగా ఐటీ కేటాయించే అవకాశం ఉందని సమాచారం. 

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కలకుంట్ల మదన్‌మోహన్‌రావుకు సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఉంది. అమెరికాలో ఐటీ బిజినెస్‌ను కూడా ఈయన నడుపుతున్నారు. గతంలో రాహుల్‌గాంధీ టీంలో పనిచేసిన ఈయన కాంగ్రెస్‌ పార్టీకి ఐటీ పరంగా సేవలందించారు. సభ్యత్వ నమోదు, ఎన్నికల్లో అనలిటిక్స్‌ వంటి విషయాల్లో ఈయన పార్టీ కోసం ఎంతో కృషి చేసినట్లు చెబుతారు. దీంతో మదన్‌మోహన్‌రావుకు ఐటీ శాఖ వచ్చే అవకాశాలున్నాయని సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

యువకులకు, వ్యాపార రంగంలో పరిచయాలు ఉన్న వారికి ఐటీ శాఖ కేటాయిస్తేనే కేటీఆర్‌కు ధీటుగా ఆ శాఖలో పనిచేయగలుగుతారని యువత భావిస్తోంది. ఐటీ మంత్రిగా కేటీఆర్‌ హైదరాబాద్‌కు కొత్తగా ఎన్నో కంపెనీలు తీసుకువచ్చారు. ప్రపంచవ్యాప్తంగా  ఉన్న పాపులర్‌ ఎంఎన్‌సీ కంపెనీలతో మరిన్ని పెట్టుబడులు పెట్టించి ఎంతో మంది యువతకు ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇలా కేటీఆర్‌ స్థాయిలో పనిచేసి ఐటీలో బ్రాండ్‌ హైదరాబాద్‌ను నిలబెట్టాలంటే  ఐటీ రంగంపైన అవగాహన, అనుభవం ఉన్నవారైతేనే బెటర్‌ అన్న అభిప్రాయాన్ని ఎక్కువ మంది యువకులు వ్యక్తం చేస్తున్నారు. 

ఇదీచదవండి..మాజీ సీఎం కేసీఆర్‌కు తీవ్ర గాయం.. యశోదకు తరలింపు

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement