సూర్యాపేట: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్ అల్ట్రా మెగా పవర్ ప్లాంట్‌కు కావాలనే కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. శనివారం సూర్యాపేటలో మీడియాతో ఆయన మాట్లాడారు. అనుమతులు ఇవ్వడంలో కేంద్రం చేస్తున్న జాప్యంపై మండిపడ్డారు.
తొమ్మిది నెలల్లో టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ ఇవ్వాలన్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలను కేంద్రం బేఖాతర్ చేస్తోందని, థర్మల్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినా అనుమతులు రావడం లేదన్నారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకొని కేంద్ర మంత్రికి ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మోదీ అడుగుపెట్టే ముందు ఆదేశాలు ఇచ్చి రావాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర రైతాంగానికి గుండెకాయగా మారుతుందనే యాదాద్రి ప్లాంట్‌పై కుట్రలు పన్నుతున్నారని, రాష్ట్రంపై జరుగుతున్న కుట్రలను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఉచిత విద్యుత్ ప్రతిపక్షాలకు కంటగింపుగా మారిందని, మూడు గంటలు చాలు అన్న కాంగ్రెస్ నాయకులు...కరెంట్ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా వరిచేను, ఒక్క వరి కంకి ఎండిపోలేదని, ప్రతిపక్షాలది పసలేని ప్రచారం అని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment