జగన్‌కు ప్రజల్లో ఆదరణ తగ్గలేదని నెల్లూరు పర్యటన రుజువు చేసింది
ప్రభుత్వం, సీఎం చంద్రబాబు లేకి బుద్ధితో వ్యవహరించారు
నిబంధనల ప్రకారమే ములాఖత్‌కు అనుమతి
హోం మంత్రి మాటలు సరికాదు: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు (పొగతోట): వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనను విఫలం చేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించిందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. వైఎస్ జగన్‌కు ప్రజల్లో ఆదరణ ఏమాత్రం తగ్గలేదని నెల్లూరు పర్యటన రుజువు చేసిందని తెలిపారు. గోవర్ధన్‌రెడ్డి శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పర్యటన విషయంలో ప్రభుత్వం, సీఎం చంద్రబాబు లేకి బుద్ధితో వ్యవహరించారని అన్నారు.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన నెల్లూరు పర్యటన ఖరారు కాగానే పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో హెలికాప్టర్ దిగేందుకు అనుమతివ్వాలని కలెక్టర్ ద్వారా ఎస్పీని కోరామన్నారు. ఎస్పీ సెలవులో ఉన్నానని చెప్పగా, ఇన్‌చార్జి అయిన ప్రకాశం జిల్లా ఎస్పీని కోరితే ఉన్నతాధికారులను అడగమన్నారని తెలిపారు. డీజీపీతో మాట్లాడితే గతంలో ఎక్కడ ఇచ్చారని అడిగారని, చివరికి పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో అనుమతిని నిరాకరించారని తెలిపారు. అతి కష్టం మీద కనుపర్తిపాడులోని జెడ్పీ హైస్కూల్ ఆవరణలో హెలికాప్టర్ దిగేందుకు అనుమతిచ్చారని చెప్పారు.
నామమాత్రపు భద్రత
వైఎస్ జగన్ కోసం ప్రజలు, కార్యకర్తలు వస్తారని తెలిసినా భద్రత నామమాత్రంగా ఇచ్చారని ఆరోపించారు. భద్రత వైఫల్యం కారణంగానే అనేక మంది హెలికాప్టర్ వద్దకు వచ్చారన్నారు. జగన్ 25 నిమిషాల్లో ల్యాండ్ అవుతారనగా జైల్ సూపరింటెండెంట్, అధికారులు ఫోన్ చేసి ములాఖత్ రద్దయిందని చెప్పారని తెలిపారు. ఎందుకు రద్దు చేశారో చెప్పాలని, మాజీ సీఎం జగన్‌తో సహా తామందరం జైలు వద్దకే వస్తామని చెప్పడంతో ఆర్ధగంట అనంతరం ములాఖత్‌కు అనుమతించారని చెప్పారు.
వైఎస్ జగన్ వస్తే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులకు ధైర్యం వస్తుందన్న కారణంతోనే ఇలా అడ్డంకులు సృష్టించారని మండిపడ్డారు. జగన్ విలేకరుల సమావేశంలో అన్ని విషయాలపై మాట్లాడారని, దీనిపై కొందరు ఏవేవో మాట్లాడుతున్నారని, వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. ఉదారంగా వ్యవహరించామని హోం మంత్రి అనడం శోచనీయమన్నారు. నిబంధనల ప్రకారం ములాఖత్‌కు అనుమతిచ్చారని, ఉదారంగా ఎవరూ వ్యవహరించలేదని తెలిపారు. జగన్ మాట్లాడిన విషయాలను పూర్తిగా వినకుండా హోం మంత్రి మాట్లాడారని అన్నారు.
ప్రతిఘటన తీవ్రంగా ఉంటుంది
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులపై దాడులు చేసి ఆస్తులను ధ్వంసం చేస్తే ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందని తీవ్రంగా హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు చేసి తిరిగి వారిపైనే కేసులు పెడుతున్నారని, టీడీపీ వారిపైనే దాడులు జరిగాయంటూ అనుకూల పత్రికల్లో రాయించుకుంటున్నారని తెలిపారు. ఆ పత్రికలను చూడాలంటేనే సిగ్గుగా ఉందన్నారు. 11 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారని ఎన్నికల కమిషన్ చెప్పిందని, ఒక్క పిన్నెల్లి పైనే కేసు పెట్టారని, మిగిలిన 10 చోట్ల కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.
ఈవీఎం కేసులో పిన్నెల్లికి బెయిల్ వచ్చిందని, దీంతో ఆయనపై దొంగ కేసులు పెట్టారని ఆరోపించారు. కేసులు, జైళ్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యే రాజకీయాల్లోకి వచ్చామని చెప్పారు. జగన్ పర్యటనకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారని, ఆయనకు ఆదరణ ఏమాత్రం తగ్గలేదన్నారు. జగన్‌కు లభిస్తున్న ఆదరణను చూసి కడుపు మంటతోనే టీడీపీ నేతలు అనేక విధాలుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
పిన్నెల్లిని కలిసేందుకు జగన్ రూ.25 లక్షలు ఖర్చు చేశారంటూ హోంమంత్రి మాట్లాడటం సరికాదని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. తనను నమ్ముకున్న పార్టీ నేతలు, కార్యకర్తలు ఎలాంటి ఆపదలో ఉన్నా జగన్ అండగా నిలుస్తారన్నారు. మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మేకపాటి రాజగోపాల్‌రెడ్డి, మేరిగ మురళి, ఖలీల్ అహ్మద్, విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment