సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తెచ్చిన సంక్షేమ పథకాలపై చంద్రబాబు కుట్ర పన్నారని వైఎస్సార్‌సీపీ పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. సోమవారం(డిసెంబర్ 9) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ఆఫీసు నుంచి పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో సజ్జల మాట్లాడారు. టెలీ కాన్ఫరెన్స్‌లో పార్టీ జిల్లా అధ్యక్షులు,నియోజకవర్గ సమన్వయకర్తలు,రీజనల్ ఇంఛార్జులు,ఎమ్మెల్యేలు,ఎంపీలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ ‘వైఎస్ జగన్ పథకాలను ఉద్దేశపూర్వకంగా కూకటి వేళ్లతో పెకిలిస్తున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ ప్రజల పక్షమే. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తాం. ఈనెల 13న రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తాం.
రైతులతో కలిసి భారీ ర్యాలీలు నిర్వహిస్తాం. సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పిస్తాం. పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని ఈ నెల 27న,ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదల కోరుతూ జనవరి 3న ధర్నాలు చేస్తాం. సోషల్ మీడియా కార్యకర్తలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి జైళ్లలో మగ్గేలా చేస్తోంది. బాధితులకు పార్టీ అండగా ఉంది. వారికి న్యాయ సహాయం అందిస్తూనే ఉంటుంది’అని సజ్జల తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment