Tirupati By Election 2021: తిరుపతి ఉప ఎన్నిక: ‘ఫ్యాను’దే హవా - Sakshi
Sakshi News home page

తిరుపతి ఉప ఎన్నిక: ‘ఫ్యాను’దే హవా

Published Mon, Mar 29 2021 8:00 AM | Last Updated on Mon, Mar 29 2021 11:50 AM

YSRCP Have Chance To Win Tirupati Over Full Campaign - Sakshi

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో ‘ఫ్యాను’ హవా కొనసాగుతుందని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వైఎస్సార్‌సీపీకి అత్యధిక మెజారిటీని అందిస్తాయని అంచనా వేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఉండడం అదనపు బలంగా మారిందని వివరిస్తున్నారు. ఈక్రమంలో ‘స్థానిక’ ఫలితాలే పునరావృతమవుతాయని స్పష్టం చేస్తున్నారు. రెండో స్థానం నిలబెట్టుకునేందుకే టీడీపీ తంటాలు పడుతోందని అభిప్రాయపడుతున్నారు. జాతీయ పార్టీలు ‘నోటా’తో పోటీకే పరిమితమవుతాయని విశ్లేషిస్తున్నారు. 

సాక్షి, తిరుపతి: వైఎస్సార్‌సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ ఆకస్మిక మరణంతో తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చాయి. ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. అందులో భాగంగా సిట్టింగ్‌ స్థానం నిలబెట్టుకునేందుకు వైఎస్సార్‌సీపీ పావులు కదుపుతోంది. 2014, 2019 ఎన్నికల్లో తిరుపతి ఎంపీ సీటును ఆ పార్టీనే కైవసం చేసుకుంటోంది. ఈ క్రమంలో మరింత మెజారిటీతో విజయం సాధించేందుకు కృషి చేస్తోంది.  

7 అసెంబ్లీ స్థానాలూ వైఎస్సార్‌సీపీవే! 
తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలు వైఎస్సార్‌సీపీ ఖాతాలో ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నెల్లూరు జిల్లాలోని గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, సర్వేపల్లె నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. 2019 ఎన్నికల సందర్భంగా మొత్తం 16,50,453 ఓట్లలో దాదాపు 80 శాతం పోలింగ్‌ నమోదైంది.  అందులో 55శాతం 7,22,877 ఓట్లు  వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్‌కు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి 37శాతంతో 4,94,501 ఓట్లు సాధించారు. దీంతో వైఎస్సార్‌సీపీ 2,28,376 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. ప్రస్తుత ఉప ఎన్నికల్లో సైతం భారీ మెజారిటీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తిని గెలిపించుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు అహర్నిశలు కృషి చేస్తున్నారు.  

‘నోటా’తో పోటీ 
2019 ఎన్నికల్లో తిరుపతి ఎంపీ సీటును వైఎస్సార్‌సీపీ గెలుచుకోగా రెండో స్థానంలో టీడీపీ నిలిచింది. 25,787 ఓట్లతో నోటా మూడో స్థానం దక్కించుకుంది. కాంగ్రెస్‌ అభ్యర్థి చింతా మోహన్‌ 24,039ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. జనసేన మద్ధతుతో పోటీ చేసిన బీఎస్పీ అభ్యర్థికి 20,971 ఓట్లు రాగా, బీజేపీ ఖాతాలో 16,125 ఓట్లు మాత్రమే పడ్డాయి. నోటా కంటే తక్కువ ఓట్లతో జాతీయ పార్టీలు డిపాజిట్లను కోల్పోయాయి. మళ్లీ అదే పరిస్థితి పునరావృతమవుతుందని మేధావులు విశ్లేషిస్తున్నారు.  

పట్టు కోసం బీజేపీ తంటాలు 
వైఎస్సార్‌సీపీకి రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా మారుతామని బీజేపీ నేతలు వల్లెవేస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికలో గణనీయమైన ఓట్లు సాధించి బలం నిరూపించుకోవాలని తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో కర్ణాటక మాజీ సీఎస్‌ రత్నప్రభను అభ్యర్థిగా ఎంపిక చేశారు. మంద కృష్ణ మాదిగను ప్రచారానికి ఆహ్వానించారు. అయితే ఓడిపోయే సీటును ఇస్తే ప్రచారానికి ఎలా వస్తానని మంద కృష్ణ అన్నట్లు కాషాయ కార్యకర్తలు వెల్లడిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశం బీజేపీని వెంటాడుతోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మరో వైపు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ తెరపైకి రావడంతో కమలానికి షాక్‌ తప్పదని తెలియజేస్తున్నారు. విభజన పాపం నుంచి కాంగ్రెస్‌ విముక్తం కాలేదని వివరిస్తున్నారు. 2019లో కాస్తో కూస్తో ఓట్లు వచ్చాయంటే అది కేవలం చింతా మోహన్‌ వ్యక్తిగత ప్రాబల్యమేనని వెల్లడిస్తున్నారు. ఏదిఏమైనా తిరుపతి ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి విజయం నల్లేరుపై నడకేనని విశ్లేషిస్తున్నారు. 

టీడీపీయేతరులే అధికం 
తిరుపతి పార్లమెంట్‌ స్థానంలో తొలి నుంచి టీడీపీయేతర పార్టీలకే ప్రజలు ఎక్కువ పర్యాయాలు పట్టం కట్టారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1984లో మాత్రమే ఆ పార్టీ విజయం సాధించింది. అప్పట్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన  చింతామోహన్‌ గెలుపొందారు. ఆ తర్వాత వరుసగా 1989, 1991, 1996, 1998 ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచింది. 1999లో టీడీపీ మద్ధతుతో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి వెంకటస్వామి విజయం సాధించారు. 2004, 2009 ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థిగా చింతామోహన్‌ గెలిచారు. 2014లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వరప్రసాద్‌ను విజయం వరించింది.  2019 ఎన్నికల్లో కూడా ప్రస్తుత టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాదరావు గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తితో టీడీపీ తరఫున పనబాక లక్ష్మి పోటీ చేస్తున్నారు. అయితే ఈ పర్యాయం రెండో స్థానం దక్కించుకుంటే చాలని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.
చదవండి: తిరుపతిలో బంపర్‌ మెజార్టీ సాధిస్తాం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement