bypolling
-
భవానీపూర్ ఓటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు : మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్: భవానీపూర్ ఉపఎన్నికలలో తృణముల్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఆమె భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రియాంక టిబ్రివాల్‌పై 58,389 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. తనను భారీ మెజార్టీతో గెలిపించిన భవానీపూర్ ఓటర్లకు తన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నందిగ్రామ్‌లో ఓడించడానికి బీజేపీ పెద్ద కుట్ర చేసిందని అన్నారు. పశ్చిమ బెంగాల్లో.. బీజీపీ ప్రభుత్వం తరచు వివాదాలను సృష్టించిందని అన్నారు. తమ ప్రభుత్వంపై బీజేపీ అసత్య ఆరోపణలు చేసిందని మమత మండిపడ్డారు. భవానీపూర్‌లో.. తాను బరిలో దిగకుండా బీజీపీ అనేక కుయుక్తులు పన్నిందని ఆరోపించారు. ప్రజలు నాపై నమ్మకం ఉంచి భారీమెజార్టీతో గెలిపించారని అన్నారు. కేవలం ఆరు నెలల్లోనే ఎన్నికలను నిర్వహించినందుకు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. భవానీపూర్ విజయంతో తన బాధ్యత మరింత పెరిగిందని సీఎం మమత అన్నారు. చదవండి: Mamata Banerjee: భారీ మెజార్టీతో మమతా బెనర్జీ విజయం -
‘చంద్రబాబు, లోకేష్ నీచంగా మాట్లాడటం సిగ్గుచేటు’
-
‘చంద్రబాబు, లోకేష్ నీచంగా మాట్లాడటం సిగ్గుచేటు’
సాక్షి, తిరుపతి: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ నోటికొచ్చినట్లు నీచంగా మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థాయి ఎక్కడ.. లేకేష్ స్థాయి ఎక్కడ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా సీఎం వైఎస్ జగన్ తిరుపతి సభను రద్దు చేసుకున్నారని కన్నబాబు తెలిపారు. ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీల వైఖరేంటో స్పష్టం చేశాకే తిరుపతి సభను నిర్వహించాలని అన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రతిగడపకు తీసుకునిపోతుందని అన్నారు. ప్రజలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి బ్రహ్మారథం పడుతున్నారని అన్నారు. చంద్రబాబుకి ఓటమి భయం పట్టుకుందని అందుకే దిగజారి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. లోకేష్ ఛాలెంజ్‌లు చూస్తుంటే కామెడీ చేస్తున్నట్లుందని ఎద్దేవా చేశారు. చదవండి: పాచిపోయిన లడ్డూలు పవన్‌కు రుచిగా ఉన్నాయా? -
నోటిఫికేషన్ల కోసం యువత మరో ఉద్యమం చేపట్టాలి: భట్టి
నాగార్జునసాగార్: రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి మార్గాలు లేక ఆదాయంరాక తీవ్ర నిరుత్సాహంలో ఉందని సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఏడాదిగా ఉపాధి లేక నాగార్జున సాగర్ హిల్ కాలనీలో ఉంటున్న రవి అనే ప్రయివేటు టీచర్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రవి పార్థివ దేహానికి ఈ సందర్భంగా భట్టి విక్రమార్కమల్లు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొన్న సునీల్ నాయక్, నిన్న మహేందర్ యాదవ్.. నేడు రవి ఆత్మహత్యలు ముఖ్యమంత్రి పాపమేనని భట్టి తీవ్రస్థాయిలో విమర్శించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కొలువుల కోసమేనని.. ఆ కొలువులు రావని తెలిసి యువత ఆత్మహత్యకు పాల్పడుతోందని భట్టి ప్రశ్నించారు. ఆత్మహత్యలు దీనికి సమాధానం కాదని ఆయన యువతను ఉద్దేశించి చెప్పారు. రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్లు కోసం యువత మరో ఉద్యమం మొదలు పెట్టాలని.. ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి ప్రజలను మాటలతో భ్రమలో ఉంచుతూ తెచ్చుకున్న తెలంగాణ లక్ష్యాలను నీరు గార్చుతున్నారని భట్టి మండిపడ్డారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం దోపిడీకి గురౌవుతోందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ దోపిడీని ఆపాలంటే యువత రోడ్డుమీదకు వచ్చి.. ఉద్యమానికి నడుం బిగించాలని సిఎల్పీ నేత పిలుపునిచ్చారు. ఎన్నికలను కుటిల ప్రయత్నాలతో గెలుస్తూ.. తాను చేసింది కరెక్ట్ అని ప్రజలు తీర్పు ఇస్తున్నారని చెబుతున్న కేసీఆర్ కు ఎన్నికల్లోనే ప్రజలు బుద్ది చెప్పాలని సూచించారు. -
సాగర్ ఎన్నికలు: ఆ అభ్యర్థి పై అనర్హత వేటు వేయాలి!
హైదరాబాద్: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తప్పుడు ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేశారని, ఆయనపై విచారణ జరిపి అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. కాంగ్రెస్ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, జి.నిరంజన్, మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి గురువారం ఇక్కడ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ) శశాంక్ గోయెల్‌ను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. 2009, 2018 ఎన్నికల్లో రోహిత్ రెడ్డి దాఖలు చేసిన అఫిడవిట్లు, అసెంబ్లీ వెబ్సైట్లో ఆయన బయోడేటా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఆయన సమర్పించిన కోర్సు కంప్లీషన్ సర్టిఫికెట్లను పరిశీలిస్తే ఆయన వివిధ సందర్భాల్లో తన విద్యార్హతల విషయంలో పొంతన లేని సమాచారం ఇచ్చారని తేలిందన్నారు. స్వీడన్‌లోని బీటీహెచ్ వర్సిటీ నుంచి బీటెక్, ఎంఎస్ చేసినట్టు తప్పుడు వివరాలు ఇచ్చారని ఆరోపించారు. పోస్టు గ్రాడ్యుయేషన్ కంప్లీషన్ సర్టిఫికెట్ కోసం కనీసం 60 క్రెడిట్ పాయింట్లు కావాల్సి ఉండగా, రోహిత్ రెడ్డి సమర్పించిన సర్టిఫికెట్లో 30 పాయింట్లు మాత్రమే వచ్చినట్టు ఉందని, ఇది డిగ్రీగా చెల్లుబాటు కాదన్నారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రోహిత్ రెడ్డి దొంగ ఓటు వేశారని ఆరోపించారు. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ల ముఠాతో రోహిత్‌కు సంబంధాలున్నాయన్నారు. ఈ అంశంపై డీజీపీతో విచారణ జరిపించాలన్నారు. తమ ఫిర్యాదుపై స్పందించిన సీఈఓ శశాంక్ గోయెల్, జిల్లా కలెక్టర్‌తో విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారని శశిధర్ రెడ్డి తెలిపారు. ఈ అంశంపై త్వరలో గవర్నర్‌తో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి సైతంఫిర్యాదు చేస్తామన్నారు. -
సాగర్‌లో బీజేపీకీ షాక్..టీఆర్ఎస్లోకి బీజేపీ కీలక నేత!
గజ్వేల్: నాగార్జునసాగర్ ఉప ఎన్నిక వేడి ఊపందుకున్న వేళ మంగళవారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ వేదికగా కీలక పరిణామం చోటుచేసుకుంది. సాగర్ నుంచి బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ ఆ పార్టీ అసంతృప్త నేత కడారి అంజయ్య యాదవ్ వందలాది మంది అనుచరులతో సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతోపాటు బీజేపీ సీనియర్ నాయకులు లక్ష్మీనర్సింహారెడ్డి, బాబురావు నాయక్, బొల్లి రాంచంద్రం, లింగాల పెద్దన్న తదితరులు టీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ వారికి స్వయంగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కడారి అంజయ్య విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ నాయకత్వం యాదవులను విస్మరించేలా కుట్రలు చేయడం తనకు నచ్చలేదన్నారు. టీఆర్ఎస్లో శ్రీనివాస్ యాదవ్‌ను మంత్రిగా నియమించడం, లింగయ్య యాదవ్‌కు రాజ్యసభ సభ్యుడిగా అవకాశమివ్వడం, దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తర్వాత ఆయన కుమారుడు భగత్‌కు టికెట్ ఇవ్వడం యాదవులపట్ల టీఆర్ఎస్ చిత్తశుద్ధిని తెలియ జేస్తోందన్నారు. బీజేపీలో యాదవులను అణచివేసే ధోరణి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే సమస్యలను పరిష్కరించు కోగలుగుతామన్న నమ్మకంతోనే టీఆర్ఎస్లో చేరినట్లు ప్రకటించారు. సాగర్‌లో నోముల భగత్ ఘన విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. టెయిల్ పాండ్ ప్రాజెక్టు, డిగ్రీ కళాశాల, రోడ్లు, మౌలికవసతుల కల్పనకు కృషి చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు కడారి వివరిం చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, రవీంద్రకుమార్ తదిరులు పాల్గొన్నారు. -
సాగర్ ఉప ఎన్నిక.. చివరి రోజు నామినేషన్లు వేసిందేవరంటే..
నల్లగొండ: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో నామినేషన్ల పర్వం మంగళవారం ముగిసింది. చివరి రోజు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మరో 55 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. నిడమనూరులో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ రోహిత్‌సింగ్‌కు నామినేషన్ పత్రాలను సమర్పించారు. మొత్తంగా గడువు ముగిసే సమయానికి 78 మంది అభ్యర్థులు 128 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఎంసీ కోటిరెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌తో నామినేషన్ వేయించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి తలసాని, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. అంతకు ముందే కాంగ్రెస్ అభ్యర్థి కె.జానారెడ్డి నామినేషన్ వేశారు. ఆయన వెంట స్థానిక నేతలు లింగారెడ్డి, కొండేటి మల్లయ్య ఉండగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హాజరయ్యారు. చివర్లో బీజేపీ అభ్యర్థి పి.రవికుమార్ నామినేషన్ వేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ కార్యక్రమానికి హాజరవగా నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి ఎస్.వెంకటేశ్వర్రావు నామినేషన్ వేయించారు. ‘టీఆర్ఎస్ భయభ్రాంతులకు గురిచేస్తోంది’ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని చూస్తున్న టీఆర్ఎస్ గ్రామాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని జానారెడ్డి విమర్శించారు. నామినేషన్లు వేశాక ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేలా ప్రచారం చేయకుండా ఉండాలని టీఆర్ఎస్, బీజేపీలకు మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. కొత్త సంప్రదాయానికి సాగర్ నుంచే శ్రీకారం చుట్టాలన్నారు. కాగా, నియోజకవర్గానికి ఏం చేస్తానో చెప్పుకోవడానికి ఏమీ లేకనే నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుందామని జానారెడ్డి కొత్త పాట ఎత్తుకున్నారని మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. మీ బిడ్డగా ఆశీర్వదించండి: నోముల భగత్ 2014 ఎన్నికల్లో తన తండ్రి నోముల నర్సింహయ్య ఓడిపోయినా.. నియోజకవర్గంలోనే, ప్రజల మధ్య లోనే ఉండి 2018 ఎన్నికల్లో విజయం సాధించారని, ఇప్పుడు ఆయన హఠాన్మరణంతో జరుగు తున్న ఈ ఎన్నికలో మీ బిడ్డగా ఆశీర్విందించాలని టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమని, టీఆర్ఎస్కు ఓటేయాలని కోరారు. -
నామినేషన్ వేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి
-
నామినేషన్ వేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి
సాక్షి, నెల్లూరు: తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి నెల్లూరు కలెక్టరేట్లో నామినేషన్ వేశారు. ముందుగా ఆయన నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయానికి చేరుకొని దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వీఆర్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి గురుమూర్తి నివాళులు అర్పించారు. తర్వాత వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ర్యాలీగా గురుమూర్తి కలెక్టరేట్‌కు చేరుకొని మూడు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశీస్సులతో నామినేషన్ వేస్తున్నానని తెలిపారు. ప్రజల నుంచి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కన్నబాబు, బాలి నేని శ్రీనివాసరెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, గౌతమ్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామితో పాటు చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన పలువురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, అభిమానులు హాజరయ్యారు. ఇక ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. గురుమూర్తి నేపథ్యం: ► చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని మారుమూల గ్రామమైన మన్నసముద్రం దళితవాడకు సామాన్య కుటుంబంలో జన్మించారు. ► గురుమూర్తి తల్లిదండ్రులు రమణమ్మ, మునికృష్ణయ్య. ఆయనకు ఐదుగురు అక్క చెల్లెళ్లు ఉన్నారు. ► తండ్రి మునికృష్ణయ్య రెండెకరాల ఆసామి. ఆ భూమి కూడా 1975లో అప్పటి ప్రభుత్వం ఇచ్చింది. ఈ భూమికి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పట్టా ఇచ్చారు. ► ప్రస్తుతం అందులోనే మునికృష్ణయ్య మామిడి సాగుచేస్తున్నారు. ► గురుమూర్తి ఐదో తరగతి వరకు మన్నసముద్రంలో ప్రాథమిక విద్య, ఆరు నుంచి 10వ తరగతి వరకు పక్కనే ఉన్న బండారుపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆ తర్వాత ఇంటర్ తిరుపతిలో చదువుకున్నారు. ► అనంతరం స్విమ్స్‌లో ఫిజియోథెరిపీ పూర్తి చేశారు. ఆ సమయంలో విద్యార్థి సంఘ నాయకుడిగా సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని తరచూ వెళ్లి కలిసేవారు. ► ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తూ వైఎస్ కుటుంబానికి దగ్గరయ్యారు. ► 2017లో వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రలో ఆయన వెంటే ఉన్నారు. -
తిరుపతి ఉప ఎన్నిక: ‘ఫ్యాను’దే హవా
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో ‘ఫ్యాను’ హవా కొనసాగుతుందని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వైఎస్సార్సీపీకి అత్యధిక మెజారిటీని అందిస్తాయని అంచనా వేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఉండడం అదనపు బలంగా మారిందని వివరిస్తున్నారు. ఈక్రమంలో ‘స్థానిక’ ఫలితాలే పునరావృతమవుతాయని స్పష్టం చేస్తున్నారు. రెండో స్థానం నిలబెట్టుకునేందుకే టీడీపీ తంటాలు పడుతోందని అభిప్రాయపడుతున్నారు. జాతీయ పార్టీలు ‘నోటా’తో పోటీకే పరిమితమవుతాయని విశ్లేషిస్తున్నారు. సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చాయి. ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. అందులో భాగంగా సిట్టింగ్ స్థానం నిలబెట్టుకునేందుకు వైఎస్సార్సీపీ పావులు కదుపుతోంది. 2014, 2019 ఎన్నికల్లో తిరుపతి ఎంపీ సీటును ఆ పార్టీనే కైవసం చేసుకుంటోంది. ఈ క్రమంలో మరింత మెజారిటీతో విజయం సాధించేందుకు కృషి చేస్తోంది. 7 అసెంబ్లీ స్థానాలూ వైఎస్సార్‌సీపీవే! తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలు వైఎస్సార్సీపీ ఖాతాలో ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నెల్లూరు జిల్లాలోని గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, సర్వేపల్లె నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. 2019 ఎన్నికల సందర్భంగా మొత్తం 16,50,453 ఓట్లలో దాదాపు 80 శాతం పోలింగ్ నమోదైంది. అందులో 55శాతం 7,22,877 ఓట్లు వైఎస్సార్సీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్‌కు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి 37శాతంతో 4,94,501 ఓట్లు సాధించారు. దీంతో వైఎస్సార్సీపీ 2,28,376 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. ప్రస్తుత ఉప ఎన్నికల్లో సైతం భారీ మెజారిటీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తిని గెలిపించుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ‘నోటా’తో పోటీ 2019 ఎన్నికల్లో తిరుపతి ఎంపీ సీటును వైఎస్సార్సీపీ గెలుచుకోగా రెండో స్థానంలో టీడీపీ నిలిచింది. 25,787 ఓట్లతో నోటా మూడో స్థానం దక్కించుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ 24,039ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. జనసేన మద్ధతుతో పోటీ చేసిన బీఎస్పీ అభ్యర్థికి 20,971 ఓట్లు రాగా, బీజేపీ ఖాతాలో 16,125 ఓట్లు మాత్రమే పడ్డాయి. నోటా కంటే తక్కువ ఓట్లతో జాతీయ పార్టీలు డిపాజిట్లను కోల్పోయాయి. మళ్లీ అదే పరిస్థితి పునరావృతమవుతుందని మేధావులు విశ్లేషిస్తున్నారు. పట్టు కోసం బీజేపీ తంటాలు వైఎస్సార్సీపీకి రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా మారుతామని బీజేపీ నేతలు వల్లెవేస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికలో గణనీయమైన ఓట్లు సాధించి బలం నిరూపించుకోవాలని తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో కర్ణాటక మాజీ సీఎస్ రత్నప్రభను అభ్యర్థిగా ఎంపిక చేశారు. మంద కృష్ణ మాదిగను ప్రచారానికి ఆహ్వానించారు. అయితే ఓడిపోయే సీటును ఇస్తే ప్రచారానికి ఎలా వస్తానని మంద కృష్ణ అన్నట్లు కాషాయ కార్యకర్తలు వెల్లడిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశం బీజేపీని వెంటాడుతోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మరో వైపు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ తెరపైకి రావడంతో కమలానికి షాక్ తప్పదని తెలియజేస్తున్నారు. విభజన పాపం నుంచి కాంగ్రెస్ విముక్తం కాలేదని వివరిస్తున్నారు. 2019లో కాస్తో కూస్తో ఓట్లు వచ్చాయంటే అది కేవలం చింతా మోహన్ వ్యక్తిగత ప్రాబల్యమేనని వెల్లడిస్తున్నారు. ఏదిఏమైనా తిరుపతి ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి విజయం నల్లేరుపై నడకేనని విశ్లేషిస్తున్నారు. టీడీపీయేతరులే అధికం తిరుపతి పార్లమెంట్ స్థానంలో తొలి నుంచి టీడీపీయేతర పార్టీలకే ప్రజలు ఎక్కువ పర్యాయాలు పట్టం కట్టారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1984లో మాత్రమే ఆ పార్టీ విజయం సాధించింది. అప్పట్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన చింతామోహన్ గెలుపొందారు. ఆ తర్వాత వరుసగా 1989, 1991, 1996, 1998 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. 1999లో టీడీపీ మద్ధతుతో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి వెంకటస్వామి విజయం సాధించారు. 2004, 2009 ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా చింతామోహన్ గెలిచారు. 2014లో వైఎస్సార్సీపీ అభ్యర్థి వరప్రసాద్‌ను విజయం వరించింది. 2019 ఎన్నికల్లో కూడా ప్రస్తుత టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై వైఎస్సార్సీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాదరావు గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తితో టీడీపీ తరఫున పనబాక లక్ష్మి పోటీ చేస్తున్నారు. అయితే ఈ పర్యాయం రెండో స్థానం దక్కించుకుంటే చాలని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. చదవండి: తిరుపతిలో బంపర్ మెజార్టీ సాధిస్తాం -
దేవుని భక్తి.. 'క్షుద్ర శక్తుల' శాసనం..!
తెర వెనుక: పొట్ట చేత పట్టుకొని వలస పోయిన కూలీలు ఇంకా గూటికి చేరలేదు.. మరో వైపు పక్కరాష్ట్రంలో పండరీ దేవుని జాతరంటూ భక్త జనం వరుస కట్టారు... ఇంకోవైపు ‘క్షుద్ర శక్తుల’భయం చూపి నిరక్షరాస్య ఓటరును ఇంట్లోనే బంధించే ప్రయత్నమేదో జరుగుతోంది. ఓట్ల పండగ రానే వచ్చింది, కానీ ఎన్నో అడ్డంకులు. ప్రతిదీ సగటు ఓటరును ఓటుకు దూరం చేసేదే. ఇన్ని ఒడిదుడుకుల నడుమ నారాయణఖేడ్ ఉప ఎన్నికల పోలింగ్ శాతం భారీగా తగ్గే ప్రమాదం ఉన్నట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గత సాధారణ ఎన్నికల్లో 2.5 లక్షల మంది ఓటర్లు ఉండగా 1.58 లక్షల ఓట్లు అంటే 79.64 శాతం ఓట్లు పోలయ్యాయి. అయితే ఈసారి పోలింగ్ స్లిప్పులు తీసుకున్న వారిలో కూడా దాదాపు 20 నుంచి 25 శాతం మంది ఓటర్లు పోలింగ్‌కు దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. నియోజకవర్గం నుంచి దాదాపు 15 వేల మంది భక్తులు పండరీపురం విఠలేశ్వర స్వామి జాతరకు పాదయాత్రగా వెళ్లారు. ఈ మాసం ఏకాదశి (ఈనెల 3న) రోజున మొదలైన పండరీ భక్తుల ప్రయాణం, త్రయోదశి (ఈ నెల 6న) వరకు కొనసాగింది. ప్రతి పల్లెనుంచి పదుల సంఖ్యలో భక్తులు పండరి వెళ్లారు. మనూరు, కంగ్టి, నారాయణఖేడ్ మండలాల్లో పండరీ దేవుని ప్రభావం ఎక్కువగా ఉంది. వీళ్లంతా పోలింగ్‌కు దూరం అయినట్టే. ఇదిలా ఉంటే.. గ్రామీణ ప్రాంతంలో మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. నిరక్షరాస్యత ఓటర్లు క్షుద్ర శక్తుల భయంతో వణికిపోతున్నారు. ప్రధానంగా కల్హేర్, కంగ్టి, మనూరు ప్రాంతంలో ఈ ‘శక్తుల’ప్రభావం తీవ్రంగా ఉంది. సగటు ఓటరును ఇంట్లోనే బంధీగా చేయడానికి ఓ వర్గం పని గట్టుకొని క్షుద్ర విద్య అస్త్రాన్ని ప్రయోగిస్తున్నట్టు జనం హడలిపోతున్నారు. పలు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల చుట్టూ మంత్రించిన ఆవాలు చల్లితే మరికొన్ని గ్రామాల్లో ఎన్నికల కేంద్రం తలుపుల వద్ద పసుపు కుంకుమ పెట్టి వెళ్లిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. భయం.. భయం.. మంత్రగాళ్లు మనుసులో ఏ రాజకీయ పార్టీకి ఓటు వేయాలని శాసిస్తాడో... అదే పార్టీకి గుర్తుకు ఓటు వేయాలని, లేదంటే క్షుద్ర శక్తులు బలి తీసుకుంటాయని ప్రచారం జరుగుతోందని గ్రామస్తులు అంటున్నారు. కల్హెర్ మండలంలోని రాపర్తి, మీర్ఖాన్పేట, అలీఖాన్‌పల్లి గ్రామాల్లో ని ప్రజలను ‘సాక్షి’ ప్రతినిధి పలకరించినప్పుడు జనం క్షుద్ర శక్తుల పట్ల తీవ్రమైన భయాందోళన వ్యక్తం చేశారు. ఓ పేరు మోసిన మంత్రగానితో ఆవాలు మంత్రించి, క్షుద్ర శక్తులను పోలింగ్ తలుపుల వద్ద కాపలా పెట్టారని జనం చెప్తున్నారు. ఓ పార్టీకి ఓటు వేయాలని మంత్రగాడు శాసించాడో జనం చెప్తున్నారు కానీ.. మీకు ఏ వ్యక్తి చెప్పాడని అడిగితే మాత్రం బదులు రావడం లేదు. ఎవరో చెప్పుకొంటుంటే విన్నామని మాత్రమే అంటున్నారు. ఇది ఒకరి నుంచి ఒకరికి ఇలా వ్యాపిస్తోంది. ఈ భయంతో ఓటర్లు ఓటు వేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఇంట్లోనే ఉండిపోవాలనే యోచనలో చాలామంది ఉన్నారు.