హైదరాబాద్: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తప్పుడు ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేశారని, ఆయనపై విచారణ జరిపి అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. కాంగ్రెస్ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, జి.నిరంజన్, మాజీ ఎమ్మెల్యే టి.రామ్‌మోహన్ రెడ్డి గురువారం ఇక్కడ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ) శశాంక్ గోయెల్‌ను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. 2009, 2018 ఎన్నికల్లో రోహిత్ రెడ్డి దాఖలు చేసిన అఫిడవిట్లు, అసెంబ్లీ వెబ్‌సైట్‌లో ఆయన బయోడేటా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఆయన సమర్పించిన కోర్సు కంప్లీషన్ సర్టిఫికెట్లను పరిశీలిస్తే ఆయన వివిధ సందర్భాల్లో తన విద్యార్హతల విషయంలో పొంతన లేని సమాచారం ఇచ్చారని తేలిందన్నారు.
స్వీడన్‌లోని బీటీహెచ్ వర్సిటీ నుంచి బీటెక్, ఎంఎస్ చేసినట్టు తప్పుడు వివరాలు ఇచ్చారని ఆరోపించారు. పోస్టు గ్రాడ్యుయేషన్ కంప్లీషన్ సర్టిఫికెట్ కోసం కనీసం 60 క్రెడిట్ పాయింట్లు కావాల్సి ఉండగా, రోహిత్ రెడ్డి సమర్పించిన సర్టిఫికెట్‌లో 30 పాయింట్లు మాత్రమే వచ్చినట్టు ఉందని, ఇది డిగ్రీగా చెల్లుబాటు కాదన్నారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రోహిత్ రెడ్డి దొంగ ఓటు వేశారని ఆరోపించారు. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ల ముఠాతో రోహిత్‌కు సంబంధాలున్నాయన్నారు. ఈ అంశంపై డీజీపీతో విచారణ జరిపించాలన్నారు. తమ ఫిర్యాదుపై స్పందించిన సీఈఓ శశాంక్ గోయెల్, జిల్లా కలెక్టర్‌తో విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారని శశిధర్ రెడ్డి తెలిపారు. ఈ అంశంపై త్వరలో గవర్నర్‌తో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి సైతంఫిర్యాదు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment