
తాడేపల్లి : ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పై మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత కాకాని గోవర్థన్ ధ్వజమెత్తారు. గతం మోసం, వర్తమానం మోసం.. భవిష్యత్ కూడా మోసమేనని చంద్రబాబు మళ్లీ రుజువు చేశారని కాకాని మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. ‘రైతులను మోసం చేసిన దగా బడ్జెట్ ఇది. ఈరోజు రాష్ట్ర రైతులకు బ్లాక్ డే . బాబు ష్యూరిటీకి నో గ్యారెంటీ అని రైతులు చర్చించుకుంటున్నారు. చట్టసభల సాక్షిగా తన నిజాయితీ నిరూపించుకోలేకపోయారు.
జగన్‌ని దూషిస్తూ, చంద్రబాబును కీర్తిస్తూ బడ్జెట్ ప్రసంగాన్ని మంత్రి చదివారు. ఈ బడ్జెట్ ప్రజల ఆశలు, ఆకాంక్షలు తీర్చేలా కనపడలేదు. లోకేష్ కు భజన చేయటమే ఆర్థికమంత్రి పనిగా పెట్టుకున్నారు. మోసం, వంచనకు ఈ బడ్జెట్ నిలువుటద్దంగా మారింది. అన్ని వర్గాల ప్రజలను నిలువునా ముంచారు. చంద్రబాబు వచ్చాడు, వ్యవసాయాన్ని దండగ చేశాడు అనే పేరును మళ్ళీ గుర్తు చేశారు. చంద్రబాబు రెండు నాలుకలతో కాదు రెండు వందల నాలుకలతో అబద్దాలు చెప్పారు. రైతులకు రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు కేంద్రం ఇచ్చే నిధులతో కలిపి ఇస్తానని మాట మార్చారు. ధరల స్థిరీకరణ నిధి కింద కేవలం రూ.300 కోట్లు ఇస్తానంటున్నారు.

ఆ అరకొర నిధులు అసలు ఏ మూలకు వస్తాయి? , చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ రైతు అన్యాయానికి గురవుతారు. జగన్ మిర్చి యార్డుకు వెళ్తే తప్ప దానిపై చంద్రబాబు స్పందించలేదు. ఇంతకంటే సిగ్గుచేటు, దౌర్భాగ్యం మరొకటి లేదు. ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. ఆ వ్యవస్థ లేకుండా అసలు రైతులకు ఎలా మేలు చేస్తారు? , స్మార్ట్ అగ్రికల్చరల్ అంటూ కొత్తకొత్త పదాలు వాడటం తప్ప ఇంకేమీ లేదు. వ్యవసాయ మంత్రి బరువుకు తగ్గట్టుగానైనా రైతుల కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారనుకున్నాం. జగన్ రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తే చంద్రబాబు కేవలం రూ. 3 వందల కోట్లే కేటాయించారు. జగన్ ఉచితంగా బోర్లు వేయించారు. ఉచిత విద్యుత్ ని ఎగ్గొట్టటానికే సోలార్ విద్యుత్ ని తెరమీదకు తెచ్చారు. అంకెల గారడీ, అభూత కల్పనల బడ్జెట్ ఇది. ఇది రైతులను ముంచే ప్రభుత్వం అని తేలి పోయింది. ఎక్కడా మిషన్, మీనింగ్ లేదు, మాయాజాలం మాత్రమే ఉంది. ప్రాజెక్టులకు కూడా ఆశాజనకంగా నిధుల కేటాయింపు జరగలేదు’ అని కాకాని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment