ఇంటింటికీ ‘జగన్‌ కోసం సిద్ధం’: సజ్జల రామకృష్ణారెడ్డి | Sakshi
Sakshi News home page

ఇంటింటికీ ‘జగన్‌ కోసం సిద్ధం’: సజ్జల రామకృష్ణారెడ్డి

Published Fri, May 3 2024 5:11 AM

YSRCP Leader Sajjala Ramakrishna Reddy On Jagan Kosam Siddham

రాష్ట్ర వ్యాప్తంగా బూత్‌ స్థాయి కమిటీల విస్తృత ప్రచారం

ఐదేళ్లలో సీఎం జగన్‌ చేసిన మేలు మరోసారి ప్రజల ముందుకు

పేదలే వైఎస్సార్‌సీపీ స్టార్‌ క్యాంపెయినర్లు.. సినీ హీరోలు కాదు

ఇప్పటికే వివిధ వర్గాల నుంచి 12 మంది స్టార్‌ క్యాంపెయినర్ల ఎంపిక

వారితో కలిసే ఇంటింటికీ మేనిఫెస్టో తీసుకెళ్తున్నాం

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, అమరావతి: ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్‌సీపీ ‘జగన్‌ కోసం సిద్ధం’ పేరుతో బూత్‌ స్థాయి కమిటీలతో గురువారం నుంచి మరోసారి గడపగడపలో విస్తృతంగా ప్రచారం ప్రారంభించినట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈ ఎన్నికల సంగ్రామంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘సిద్ధం’ పేరిట బహిరంగ సభలు, ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్ర చేపట్టారని, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభల్లో పాల్గొంటున్నారని, పార్టీ క్యాడర్‌లో నూతనోత్సాహాన్ని నింపారని తెలిపారు. 

తాజాగా 47 వేలకు పైగా బూత్‌స్థాయి కమిటీలు ‘జగన్‌ కోసం సిద్ధం’ అంటూ గడపగడపకూ వెళ్లే కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. గతంలో ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ కార్యక్రమంలోనూ ప్రతి గడపను పలకరించామన్నారు. ఆ కుటుంబాలన్నీ తమ నాయకుడు జగనే అని చెప్పాయన్నారు. గడప గడపకూ కార్యక్రమంలోనూ సమస్యలు అక్కడికక్కడే పరిష్కారించామని తెలిపారు. తాజా కార్యక్రమం ద్వారా మరోసారి సీఎం జగన్‌ ఎందుకు కావాలో వివరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి బూత్‌స్థాయిలో 1 ప్లస్‌ 10 విధానంలో ఒక ప్రెసిడెంట్, 10 మంది సభ్యులు పాల్గొంటారన్నారు.

బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌ విభిన్నమైన, అభ్యుదయ ఆలోచనలతో సమాజ దిశను మార్చిన నాయకుడని చెప్పారు. బలహీన వర్గాలను కూడా సంపన్నవర్గాలకు దీటుగా మలిచారని తెలిపారు. ఈ ఐదేళ్లలో సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన మంచిని, భవిష్యత్తు కోసం తీసుకొచ్చిన తాజా మేనిఫెస్టోలోని అంశాలను పార్టీ నాయకులు, స్టార్‌ క్యాంపెయినర్లతో కలిసి ఈ కార్యక్రమంలో ఇంటింటికీ తీసుకెళ్తామన్నారు. 

అసెంబ్లీ, పార్లమెంట్‌ రెండు ఓట్లూ ఫ్యాను గుర్తుపై వేసి గెలిపించాలని కోరతామన్నారు. సీఎం జగన్‌ మళ్లీ అధికారంలోకి రాగానే తమ ప్రభుత్వం అందించే ప్రతి పథకం వివరాలతో క్యాలెండర్‌ రూపంలో మేనిఫెస్టోను ఇంటింటికీ ఇస్తామని వివరించారు. చంద్రబాబులా మేనిఫెస్టోను పక్కన పడేయడం కాకుండా.. ఒక ప్రామాణికతతో రికార్డెడ్‌గా ఉండేందుకే ప్రతి ఇంటికీ పంపిస్తున్నట్లు చెప్పారు. తద్వారా హామీలను అమలు చేయకపోతే నిలదీసే హక్కు ప్రజలకు ఉంటుందని అన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన తరువాత కూడా సీఎం జగన్‌ సచివాలయాలు, ఇతర కార్యాలయాల్లో మేనిఫెస్టో అందుబాటులో పెట్టారన్నారు.

ప్రజలే స్టార్‌ క్యాంపెయినర్లు
వైఎస్సార్‌సీపీ తరపున 12 మంది స్టార్‌ క్యాంపెయినర్లను ఎంపిక చేశామని, ఇతర పార్టీలకు ఉన్నట్లు వీరు సినీ హీరోలు కాదని, సామాన్య ప్రజల్లోంచి వచ్చారని చెప్పారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందిన వివిధ సామాజిక వర్గాల నుంచి ఎంపిక చేసిన వ్యక్తులని చెప్పారు.

చంద్రబాబును నమ్మితే జీవితం చీకటే
– టీడీపీ కూటమి మేనిఫెస్టో అబద్ధాల పుట్ట.. బూతుపత్రం
– అమలుచేయగలిగిన హామీలతోనే వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో
– 1999, 2014లో అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన చంద్రబాబు
– ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు చేస్తానని బాబు అనడంపై బీజేపీ వైఖరేమిటి?
– వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజం

టీడీపీ కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబు ఎప్పటిలానే అలవికాని హామీలు ఇస్తే.. వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలో తమ ప్రభుత్వం ఏమి చేయగలదో వాటిని మాత్రమే సీఎం వైఎస్‌ జగన్‌ పెట్టారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఆయన గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఆర్థిక వెసులుబాటు ఉంటే ప్రజలకు మరింతగా మంచి చేయడానికి సీఎం జగన్‌ ఎప్పుడూ వెనుకాడరని తెలిపారు. 

సీఎం జగన్‌ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏడాదికి రూ. 70 వేల కోట్లతో 99 శాతానికి పైగా అమలు చేశారని, కోవిడ్‌ సంక్షోభంలోనూ రెండేళ్లూ ఏ పథకాన్నీ ఆపలేదన్నారు. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా సీఎం జగన్‌ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే రాష్ట్రాన్ని శ్రీలంకగా మారుస్తున్నారని అన్న చంద్రబాబే టీడీపీ మేనిఫెస్టోలో అడ్డగోలు హామీలిచ్చారన్నారు. వాటిని అమలు చేయాలంటే ఏడాదికి రూ.1.70 లక్షల కోట్లకుపైగా అవసరమవుతాయని, అదనపు రూ.లక్ష కోట్లు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పడంలేదన్నారు. టీడీపీ మేనిఫెస్టో అబద్ధాల పుట్ట, బూతుపత్రం అని, పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే కొంప కొల్లేరవుతుందని, ప్రజల జీవితాలతో చెలగాటమాడతాడని, మళ్లీ చీకటి రోజులు తెస్తాడని చెప్పారు.

1999 ఎన్నికల్లో కోటి మందికి ఉపాధి, 35 లక్షల ఇళ్లు నిర్మిస్తానని బాబు హామీ ఇచ్చారని, 2014లో రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు, రూ.14,205 కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి.. ఇలా 650కిపైగా హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక ఒక్కటీ చేయకుండా ప్రజలను మోసం చేశారన్నారు. ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తామంటున్నారని, నిరుద్యోగులంటే ఎవరంటే స్పష్టత ఇవ్వరని చెప్పారు. రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామంటున్నారని, అర్హతలేమిటో చెప్పరన్నారు. 

ఇలా చంద్రబాబు ఇచ్చే ప్రతి హామీ అస్పష్టమేనని తెలిపారు. ఇలా అస్పష్టంగా చెప్పడం, అధికారంలోకి వస్తే అర్హతల పేరుతో కోతలు పెట్టి, ఎగ్గొట్టడం బాబుకు అలవాటేనని అన్నారు. అందుకే టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ ఆ మేనిఫెస్టోను ముట్టుకోవడంలేదన్నారు. బీజేపీ జాతీయ స్థాయిలో మేనిఫెస్టో విడుదల చేస్తుందని, రాష్ట్రాలకు విడుదల చేయదని చంద్రబాబు సమర్థించుకున్నారని, అదే నిజమైతే అరుణాచల్‌ప్రదేశ్, సిక్కింలకు బీజేపీ ప్రత్యేక మేనిఫెస్టోలను ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు.

ప్రజలపై బాబుకు కోపం
2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడించారనే కోపంతోనే చంద్రబాబు ప్రజలకు నరకం చూపిస్తున్నారని, పింఛన్ల పంపిణీలో వృద్ధులను అష్టకష్టాలు పెడుతున్నారని చెప్పారు. వలంటీర్లపై నిమ్మగడ్డ రమేష్‌తో ఫిర్యాదు చేయించి ఇంటి వద్దే పెన్షన్‌ పంపిణీ చేయకుండా అడ్డుకున్నారన్నారు. సచివాలయాల్లో పింఛన్లు ఇస్తుంటే బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ఈసీకి సూచించారని చెప్పారు. ఈసీ ఆదేశాల మేరకు బ్యాంకు ఖాతాల్లో వేసిన డబ్బులు తీసుకోవడానికి వెళ్లిన వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ పాపం చంద్రబాబుదేనన్నారు. పొరపాటున అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని నిప్పులకొలిమిగా మారుస్తానని చంద్రబాబు చెప్పకనే చెప్పారని అన్నారు.

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు చేస్తానని మోదీతో బాబు చెప్పించగలరా?
బీజేపీతో పొత్తుపెట్టుకున్న చంద్రబాబు.. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ను రద్దు చేస్తామని ప్రధాని మోదీతో చెప్పించగలరా అని సజ్జల నిలదీశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు భూములపై సర్వ హక్కులు కల్పించే ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రూపకల్పనకు 2019లో నీతి ఆయోగ్‌ ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఆ కమిటీ ఇచ్చిన ముసాయిదాను చట్టంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించిందని తెలిపారు. 

చంద్రబాబు మాత్రం ఆ చట్టం ద్వారా సీఎం జగన్‌ భూములు లాగేసుకుంటారని దుష్ఫ్రచారం చేస్తున్నారని, ఇదే చెబుతూ మేనిఫెస్టోలో బూతులు అచ్చేశారని, అందుకే టీడీపీ మేనిఫెస్టోను బూతపత్రంగా అభివర్ణిస్తున్నామని చెప్పారు. ఈ యాక్ట్‌పై చంద్రబాబు చేస్తున్న దుష్ఫ్రచారంపై బీజేపీ జాతీయ లేదా రాష్ట్ర నాయకత్వం వాటి వైఖరేమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా చెబుతున్నారని, చంద్రబాబేమో కొనసాగిస్తామంటున్నారని, దీనిపైనా బీజేపీ నేతల వైఖరిని చెప్పాలని అన్నారు.

జగన్‌ కోసం సిద్ధం బస్సులు ప్రారంభించిన సజ్జల
వైఎస్సార్‌సీపీ ఎన్నారైలు సమకూర్చిన జగన్‌ కోసం సిద్ధం బస్సులను సజ్జల రామకృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్‌ విజయమే ప్రతి ఇంట్లో గెలుపులా ప్రజలు భావిస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ విజయం కోసం సిద్ధం బస్సులు ఏర్పాటు చేసిన ఎన్నారైలకు సీఎం జగన్‌ తరపున, పార్టీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ తరపున పనిచేస్తున్న ఎన్నారైలు వికృత చేష్టలకు పాల్పడుతున్నారని తెలిపారు. 

కోమటి జయరాం అనే ఎన్నారై అహంకారంతో ఓటర్లను కొనాలని భావించడం సిగ్గుచేటన్నారు. రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని సీఎం జగన్‌ నిత్యం చెబుతారని వివరించారు. రాజకీయం అంటే డబ్బు అని చాలా మంది భావిస్తుంటారన్నారు. నాయకుడిని బట్టి ప్రజలు ఉంటారని తెలిపారు. సీఎం జగన్‌ ప్రజలకు మేలు చేస్తారు కాబట్టి వైఎస్సార్‌సీపీకి మద్దతిచ్చే ఎన్నారైలు కూడా ప్రజలకు మేలు చేయడానికి ముందుకొచ్చారని తెలిపారు. నాలుగు బస్సుల్లో స్టార్‌ క్యాంపెయినర్లు పనిచేస్తారని అన్నారు. 

వైఎస్సార్‌సీపీ గ్లోబల్‌ ఎన్నారై కన్వీనర్‌ వెంకట్‌ మేడపాటి మాట్లాడుతూ.. సీఎం జగన్‌ విధానాలు, కార్యక్రమాలతో రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించి, ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ బస్సు యాత్ర లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, పారిశ్రామిక వృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై సీఎం జగన్‌ దృష్టి సారిస్తున్నారని వైఎస్సార్‌సీపీ సింగపూర్‌ కన్వీనర్‌ దువ్వూరు మురళీకృష్ణారెడ్డి చెప్పారు. 

వైఎస్సార్‌సీపీ యూఎస్‌ఏ ప్రతినిధి పండుగాయల రత్నాకర్, రాజామణి(యూఎస్‌ఏ), సుజాత(కెనడా), కోటిరెడ్డి (సింగపూర్‌), కార్తీక్‌ యల్లాప్రగడ (నెదర్‌ల్యాండ్స్‌), మన్‌మోహన్‌ (యూకే), కుద్దీర్‌(యూఎస్‌ఏ), గోవింద నాగారాజు, మర్రి కల్యాణ్‌ (కువైట్‌), వినోద్‌ పేరూరి (ఐర్లాండ్‌), బాజిబాబ(మలేషియా), సూర్య (ఆస్ట్రేలియా), కృష్ణ కోడూరు (యూఎస్‌ఏ) సహా వందలాది ఎన్నారైలు, పార్టీ నేతలు చల్లా మధు, పుత్తా ప్రతాప్‌ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

Advertisement
Advertisement