
తాడేపల్లి: ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి మంత్రి నారా లోకేష్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది వైఎస్సార్ సీపీ. ఈ మేరకు వైఎస్సార్ సీపీ శానమండలి సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, వరుదు కళ్యాణిలు పత్రికా ప్రకటన విడుదల చేశారు. శాసనసభలోగానీ, మండలిలోగానీ అధికార పక్షం తర్వాత ఎక్కువ సీట్లు ఉన్న పార్టీనే ప్రతిపక్షం అంటూ చట్టంలో ఉన్న విషయాన్ని ఎమ్మెల్సీలు బయటపెట్టారు.
కూటమి ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీల తర్వాత ఉన్న ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీనేనని, కాబట్టి కచ్చితంగా వైఎస్సార్ సీపీని ప్రతిపక్షంగా గుర్తించాలన్నారు. ప్రజా సమస్యలపై వివరంగా మాట్లాడటానికి అప్పుడే తగినంత సమయం హక్కుగా వస్తుందన్నారు. కానీ ప్రభుత్వ లోపాలనె ఎత్తిచూపుతారనే భయంతోనే వైఎస్సార్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదన్నారు. ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఏసీని సైతం ఇవ్వకుండా అడ్డుకున్నారని, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు.