మెజార్టీ వీరి లక్ష్యం.. రెండో స్థానం వారి గమ్యం | YSRCP Tirupati Parliament by-election campaign As Interesting | Sakshi
Sakshi News home page

మెజార్టీ వీరి లక్ష్యం.. రెండో స్థానం వారి గమ్యం

Published Sat, Apr 3 2021 3:51 AM | Last Updated on Sat, Apr 3 2021 4:25 AM

YSRCP Tirupati Parliament‌ by-election campaign As Interesting - Sakshi

ఎన్నికల ప్రచారంలో వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, తిరుపతి లోక్‌సభ అభ్యర్థి గురుమూర్తి తదితరులు

సాక్షి, తిరుపతి: తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నిక ప్రచారం హోరెత్తుతోంది. తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ అభ్యర్థి డాక్టర్‌ గురుమూర్తి కోసం మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రచారాన్ని ఉధృతం చేశారు. భారీ మెజారిటీనే లక్ష్యంగా ఆ పార్టీ నాయకులు ఊరూ వాడా తిరుగుతూ ఫ్యాన్‌ గుర్తుకు ఓటెయ్యాలని అభ్యర్థిస్తున్నారు. బీజేపీ నేతలు తిరుపతి, శ్రీకాళహస్తిలో ప్రచారం నిర్వహించారు. టీడీపీ, కాంగ్రెస్, సీపీఎం అభ్యర్థులు, నాయకులు.. తిరుపతి, సత్యవేడులో ప్రచారం చేశారు. తిరుపతి నగరంలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో అభ్యర్థి డాక్టర్‌ గురుమూర్తితో కలిసి చిత్తూరు జిల్లా పార్టీ ఇన్‌చార్జ్, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, స్థానిక కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎండను సైతం లెక్క చేయక వీధి వీధిలో ప్రచారం చేశారు.   

ఫ్యాను గుర్తుకే మా ఓటు..  
తిరుపతి నగరంలో వైఎస్సార్‌సీపీ నాయకుల ప్రచారానికి స్థానికులు బ్రహ్మరథం పట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. కొర్లగుంటకు చెందిన వృద్ధుడు రాధాకృష్ణ యాదవ్‌ ‘జై జగన్‌’ అంటూ నినాదాలు చేస్తూ ప్రచారం చేశారు. ‘వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాకే నాకు పింఛను వస్తోంది.. అందుకే ఇలా ఆయన రుణం తీర్చుకుంటున్నా’ అని స్పష్టం చేశారు. ఇలా అనేక మంది స్థానికులు వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తిరుపతి నగరంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు దళిత ఆత్మీయ సమావేశం నిర్వహించారు. 

శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఓ వైపు, ఆయన కుమార్తె పవిత్రారెడ్డి మరో వైపు సుడిగాలి పర్యటన చేస్తూ ప్రచారం నిర్వహించారు. స్థానికుల కోరిక మేరకు ఎమ్మెల్యే పలు గ్రామాల్లో ఎడ్లబండిపై ప్రచారం చేపట్టారు. మంత్రి కొడాలి నాని, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, గన్నవరం ఎమ్మెల్యే వంశీ, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం పిచ్చాటూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో బీజేపీ, టీడీపీపై విమర్శలు గుప్పించారు. గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌లు ఎవరికి వారు గురుమూర్తికి అధిక మెజార్టీ తెప్పించేందుకు ప్రచారం నిర్వహిస్తున్నారు. 

ద్వితీయ స్థానం కోసం పోటాపోటీ 
బీజేపీ, టీడీపీ ద్వితీయ స్థానం కోసం పోటీ పడుతున్నాయి. తిరుపతిలో బీజేపీ అభ్యర్థి రత్నప్రభ కోసం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీలు టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తిరుపతి నగరంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం శ్రీకాళహస్తిలో ప్రచారం నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి కోసం ఆ పార్టీ నేతలు సత్యవేడులో ప్రచారం చేపట్టారు. సీపీఎం అభ్యర్థి యాదగిరి తరఫున ఆ పార్టీ నాయకులు తిరుపతిలో ప్రచారం నిర్వహించారు. అయితే వీరందరి ప్రచారానికి స్థానికుల నుంచి స్పందన లేకపోవటం గమనార్హం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement