YSRCP Won Huge Majority In Tirupati By Election,YSRCP Candidate Dr M Gurumoorthy Win - Sakshi
Sakshi News home page

తిరుపతి ఉప ఎన్నిక: చెక్కు చెదరని వైఎస్సార్‌సీపీ ఓట్‌ షేర్

Published Tue, May 4 2021 8:17 AM | Last Updated on Tue, May 4 2021 4:27 PM

YSRCP Won Huge Majority In Tirupati By Election - Sakshi

కుట్రలు కూలిపోయాయి.. అసత్య ప్రచారాలు అణిగిపోయాయి.. మొత్తంగా ప్రతిపక్షాలు దుర.. ‘ఆశలు’ ఆవిరయ్యాయి. తిరుపతి పార్లమెంట్‌ ఉపఎన్నికల్లో ‘నవ’సంక్షేమానికి పట్టం గట్టిన ఓటర్లు.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి మరోమారు గంపగుత్తుగా జైకొట్టి.. జగనన్న జైత్రయాత్రకు  మద్దతుపలికారు.

సాక్షి, తిరుపతి: తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికలో టీడీపీ, బీజేపీ, జనసేన కుట్ర భగ్నమైంది. వారి దుష్ప్రచారాలకు.. వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఓట్లు చెదరకపోగా.. తిరుపతి, శ్రీకాళహస్తిలో ఇంకా పెరిగాయి.  సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుల పనితీరు.. ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ గురుమూర్తికి భారీ మెజారిటీ తెచ్చిపెట్టాయి. ప్రస్తుత ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలుపుతో ఆ పార్టీ హ్యాట్రిక్‌ విజయం అందుకుంది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, సీపీఎంకి డిపాజిట్‌ కూడా దక్కలేదు. జనసేనతో పొత్తు కారణంగా టీడీపీకి వెళ్లే ఓట్లను బీజేపీ లాక్కున్నట్లయ్యింది.

మొత్తంగా ఈ ఉప ఎన్నికలో ఓటర్లు వైఎస్సార్‌సీపీకి అఖండ మెజారిటీని అందించి విపక్ష పార్టీలకు  షాక్‌  ఇచ్చారు. ఎంపీ బల్లిదుర్గాప్రసాద్‌ అనారోగ్యంతో మృతి చెందటంతో తిరుపతి పార్లమెంట్‌కు ఉప ఎన్నిక  తప్పనిసరైంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో వచ్చిన ఉప ఎన్నిక కావడంతో ఓటింగ్‌పై కొంత ప్రభావం చూపింది. మొదట్లో 50శాతం కూడా పోలింగ్‌ జరగదని భావించినా 64.28 శాతం మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకుని శభాష్‌ అనిపించుకున్నారు. 17వ తేదీన తిరుపతి పార్లమెంట్‌ పరిధిలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సర్వేపల్లి, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల ప్రజలు ఓటింగ్‌లో పాల్గొన్నారు.

రెండు చోట్ల భారీగా పెరిగిన ఓట్‌ షేర్‌ 
తిరుపతి, శ్రీకాళహస్తి అసెంబ్లీనే లక్ష్యంగా టీడీపీ, బీజేపీ శ్రేణులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి కోసం కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు ప్రచారం చేశారు. మూడు నెలలుగా తిష్టవేసి కుట్రలు, కుతంత్రాలకు పథకం రచించారు. అందులో భాగంగానే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై విషం చిమ్మారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఏకంగా రాళ్లదాడి చేశారంటూ కొత్త డ్రామాకు తెరతీశారు.

వైఎస్సార్‌సీపీ శ్రేణులు.. రౌడీలు, గూండాలంటూ రెచ్చిపోయారు. సత్యవేడులో సాధారణంగా కరెంట్‌ కట్‌ అయితే.. అది కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పనే అని ఆరోపించారు. కుప్పంలో మతిస్థిమితం లేని మహిళ ఆలయంలో చేసిన పొరపాటునూ.. వైఎస్సార్‌సీపీకి ఆపాదించి విమర్శలు చేశారు. శ్రీకాళహస్తిలో స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అయినా తిరుపతి, శ్రీకాళహస్తిలో ఓట్‌ షేరింగ్‌ గతంకంటే పెరగడం గమనార్హం. దీంతో విపక్షాలు పూర్తి ఆత్మరక్షణలో పడిపోయాయి.

నవరత్నాలతోనే ప్రజల్లోకి..  
విపక్ష పార్టీలు వైఎస్సార్‌సీపీపై విషం చిమ్ముతుంటే.... ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆదిమూలం మంత్రులు, ఎమ్మెల్యేల సహకారంతో నవరత్నాలు, సంక్షేమంపై విస్తృతంగా ప్రచారం చేశారు. శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యేతో పాటు ఆయన సతీమణి వాణిరెడ్డి, కుమార్తె పవిత్రారెడ్డి ఊరూరా ప్రచారం చేశారు. అనుకున్నట్టే తిరుపతి, శ్రీకాళహస్తిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి వచ్చిన ఓట్లకంటే అధికంగా వచ్చాయి. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి వీధి.. వీధి.. తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఫలితంగా 34 వేల ఓట్లు అధిక్యం వచ్చింది. దీంతో చేసేదిలేక.. టీడీపీ, బీజేపీ నాయకులు దొంగ ఓట్లు అంటూ.. దుష్ఫ్రచారం చేస్తున్నారు. ఇక శ్రీకాళహస్తిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే వెయ్యికిపైగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి అదనంగా రావడం విశేషం.

చదవండి: Tirupati Election Results 2021: ‘ఫ్యాన్‌’ హ్యాట్రిక్‌
ఫ్యాన్‌ స్పీడ్‌కు కొట్టుకుపోయిన టీడీపీ, బీజేపీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement