
వైఎస్సార్ క్రీడావికాసం స్టేడియంను ప్రారంభించిన మంత్రి మేరుగు నాగార్జున
చీమకుర్తి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు గడిచిన ఐదేళ్లలో పైసా అవినీతి లేకుండా ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను పారదర్శకంగా పేద ప్రజలకు అందించారని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మేరుగు నాగార్జున అన్నారు. సంతనూతలపాడు, పేర్నమిట్టలో శుక్రవారం మంత్రి మేరుగు నాగార్జున సుడిగాలి పర్యటనలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోని మహిళలకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద పీట వేశారన్నారు. చంద్రబాబునాయుడు 2014లో ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి చివరకు మేనిఫెస్టోను కూడా ప్రజలకు కనిపించకుండా వెబ్‌సైట్ నుంచి గుట్టు చప్పుడు కాకుండా తీసేసి చేతుల దులుపుకున్నాడని ఎద్దేవా చేశారు.
రూ.4.44 కోట్ల చేయూత నిధుల చెక్కులు పంపిణీ:
సంతనూతలపాడులోని 2,370 మంది లబ్ధిదారులకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రూ.4.44 కోట్ల విలువ కలిగిన చెక్కును ఈ సందర్భంగా లబ్ధిదారులకు అందించారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు విడతలలో సంతనూతలపాడులో 2,370 మందికి కలిపి రూ.15.78 కోట్ల విలువైన చేయూత చెక్కులను అందించినట్లు తెలిపారు. దానితో పాటు సంతనూతలపాడు జెడ్పీ హైస్కూలు క్రీడా ప్రాంగణంలో దాదాపు రూ.1.50 కోట్లతో నిర్మించిన వైఎస్ రాజశేఖరరెడ్డి క్రీడావికాసం స్టేడియంను మంత్రి మేరుగు నాగార్జున ప్రారంభించారు. మరో రూ.2.50 కోట్లతో నిర్మించిన సిండికేట్ రైతు సొసైటీ భవనం, ఎన్‌ఆర్‌ఈజీఎస్ భవనం, వైఎస్సార్ క్రాంతి పథం భవనం, వ్యవసాయ కార్యాలయం భవనం, ఎలక్ట్రికల్ డిపార్టుమెంట్‌కు చెందిన రెండు గదులు, ప్రహరీ, ఆర్చి నిర్మాణాలను మంత్రి మేరుగు నాగార్జున ప్రారంభించారు. పేర్నమిట్ట 39వ డివిజన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 2500 మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో వైఎస్సార్‌సీపీ దుంపా చెంచిరెడ్డి, మారెళ్ల బంగారుబాబు, బీ.విజయ, దుంపా రమణమ్మ, దుంపా యలమందారెడ్డి, దర్శి నాగమణి, గోలి లక్ష్మీ కోటేశ్వరమ్మ తిరుపతిరావు, నూకతోటి మస్తానమ్మ ఈశ్వరరావు, స్థానిక సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా మహిళలకు పెద్దపీట మంత్రి మేరుగు నాగార్జున రూ.4.44 కోట్ల చేయూత చెక్కులు, 2500 మందికి ఇంటి పట్టాల పంపిణీ