గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు
● కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు అర్బన్: ప్రజల సమస్యలు పరిష్కరించడంతో పాటు గ్రామాల అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని, అందుకోసం గ్రామ సభలు నిర్వహించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రకాశం భవనం నుంచి మండల స్థాయి అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 23వ తేదీ గ్రామసభలు నిర్వహించనున్న నేపథ్యంలో మండల స్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉపాధి పనులు, తాగునీరు, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం తదితర అంశాలపై ప్రజలతో చర్చించి అవగాహన కల్పించాలన్నారు. ప్రతి కుటుంబం ఎల్‌పీజీ గ్యాస్ వినియోగించుకునేలా చూడాలన్నారు. జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయిన 8 మండలాల పరిధిలోని 57 గ్రామాల్లో నీటిమట్టం పెరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీపీఓ ఉషారాణి, డ్వామా పీడీ అర్జునరావు, జెడ్పీ సీఈఓ మాధురి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మర్దన్ అలీ, పశుసంవర్థకశాఖ జేడీ బేబీరాణి, గిరిజన సంక్షేమ అధికారి జగన్నాథరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
హార్టీకల్చర్ కేంద్రంగా పశ్చిమ ప్రాంతం
ఒంగోలు అర్బన్: జిల్లాలో హార్టీకల్చర్‌ను ప్రోత్సహించాలని ముఖ్యంగా పశ్చిమ ప్రాంతాన్ని హార్టీ కల్చర్ కేంద్రంగా మార్చాలని ఆ దిశగా ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులకు సూచించారు. గురువారం ప్రకాశం భవనంలో హార్టీకల్చర్, మైక్రో ఇరిగేషన్ శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా సమీక్షించి ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో సాగవుతున్న ఉద్యాన పంటల విస్తీర్ణం, నీటి విస్తీర్ణాన్ని పెంచేందుకు ఉన్న అవకాశాలు, సబ్సిడీపై ఇస్తున్న పరికరాలు, పథకాలపై సంబంధిత అధికారులు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు అధిగమించేలా సూచనలు, సాంకేతిక సలహాలు అందజేయాలన్నారు. రాబోయే ఐదేళ్లలో ఉద్యాన పంటల సాగులో జిల్లా ముందుండాలని, అందుకు అవసరమైన ప్రణాళికలు నెలాఖరుకి సిద్ధం చేసి అందజేయాలని ఆదేశించారు. దీనిలో ఉద్యానవన శాఖ అధికారి గోపిచంద్, ఏపీఎంఐపీ పీడీ పీవీ రమణ, ఎంహెచ్‌ఓలు, ఎంఐఏఓలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment