పేదలకు అండ ఎర్ర జెండా..
ఒంగోలు టౌన్: ఎర్ర జెండా నీడలో భూ పోరాటాల ద్వారా లక్షలాది మంది పేదలకు భూమి పంపిణీ చేసినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య పేర్కొన్నారు. స్థానిక మల్లయ్య లింగం భవనంలో గురువారం సీపీఐ శత జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. దేశంలో ప్రశ్నించేతత్వాన్ని నేర్పింది కమ్యూనిస్టు పార్టేనని చెప్పారు. పార్టీ అధికారంలోకి రాకపోయినప్పటికీ దేశాభివృద్ధిలో పోరాటాల ద్వారా కీలకపాత్ర పోషించిందన్నారు. సీపీఐ రాష్ట్ర నాయకుడు పీజే చంద్రశేఖర్ ప్రసంగిస్తూ.. రానున్న కాలంలో మరిన్ని ప్రజా ఉద్యమాలు చేపడతామని చెప్పారు. సీపీఐ శత జయంతి ఉత్సవాలు ఏడాదిపాటు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ముగింపు సభలను తెలంగాణాలోని ఖమ్మంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం సీపీఐ కార్యాలయం వద్ద సీనియర్ నాయకులు నల్లూరి వెంకటేశ్వర్లు ఎర్రజెండా ఎగరేశారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సభలో డీహెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు, సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.వెంకటరావు, మాజీ కార్యదర్శి ఎం.వెంకయ్య, నగర కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి శ్రీరాం శ్రీనివాస్, సీనియర్ అడ్వకేట్ ముదివర్తి రాఘవరావు, ఎంఏ సాలార్, ఎస్‌డీ సత్తార్, సీహెచ్ వెంకటేశ్వర్లు, కారుమూడి నాగేశ్వరరావు, కె.సుబాన్ నాయుడు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment