వైపాలెం తహసీల్దార్ బాల కిషోర్ సస్పెన్షన్
యర్రగొండపాలెం: స్థానిక తహసీల్దార్ బాల కిషోర్, వీఆర్వో ఎల్లయ్య, సర్వేయర్ దిలీప్‌లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ తమీమ్ అన్సారియా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్కాపురం రోడ్డులో ఉన్న ఎస్సీ బాలికల హాస్టల్ ఎదురుగా సర్వే నంబర్ 58, 58/1లతో పాటు రోడ్లు, భవనాల శాఖకు చెందిన స్థలాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ అయ్యేందుకు సహకరించిన వారిపై ఈ వేటు పడింది. దాదాపు రూ.5 కోట్ల విలువ చేసే ఈ స్థలాలను మండలంలోని సర్వాయపాలేనికి చెందిన ఒకరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు అధికారులు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని అతనికి కావలసిన డాక్యుమెంట్లు అందజేశారు. ఈ విషయం తెలుసుకున్న వాస్తవ స్థల హక్కుదారులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆమేరకు కలెక్టర్ ఆదేశాలతో మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట్ త్రీవినాగ్ ఈ నెల 3వ తేదీ ఆ స్థలాలపై దర్యాప్తు చేసి నివేదికను అందజేశారు. ఆ నివేదిక ప్రకారం ఈ నెల 15వ తేదీ వీఆర్వో 2 ఎల్లయ్యను పాలుట్ల పంచాయతీకి, సర్వేయర్ దిలీప్‌ను కాశికుంట తండాకు బదిలీ చేశారు. తహసీల్దార్ బాల కిషోర్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడం వలన ఆయన్ను బదిలీ చేయలేదు. ఆయన స్థానంలో డిప్యూటీ తహసీల్దార్ నలగాటి మల్లికార్జున నాయుడికి పూర్తి బాధ్యతలు అప్పచెప్పి ఇన్‌చార్జి తహసీల్దార్‌గా నియమించారు. ఆ తరువాత వారిని సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా మరో రెండు శాఖలకు చెందిన అధికారులు కూడా పెద్ద మొత్తాల్లో దండుకొని అక్రమ రిజిస్ట్రేషన్‌కు సహకరించినట్లు తెలిసింది. ఆ స్థలాల్లో సర్వేనంబర్ 58లో ఉన్న రేకుల షెడ్డుకు సర్వాయపాలేనికి చెందిన దొడ్డపనేని శ్రీనివాసరావు పన్ను చెల్లిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి ఈదుల రాజశేఖరరెడ్డి రశీదు ఇచ్చాడు. తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శి తగిన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం వలన తాము రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆ శాఖ అధికారులు సబ్ కలెక్టర్ విచారణలో చెప్పారు. రెవెన్యూ, పంచాయతీ, రిజిస్ట్రేషన్ అధికారుల అండదండలు ఉండటం వలన శ్రీనివాసరావు గతనెల 16వ తేదీ, 22వ తేదీన తన భార్యతో రిజిస్ట్రేషన్ చేయించాడు. తగిన ఆధారాలు లేకుండా రిజిస్ట్రేషన్ చేసిన వారిపై ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
వీఆర్వో, సర్వేయర్‌లు కూడా.. రూ.5 కోట్ల విలువైన స్థలాల అక్రమ రిజిస్ట్రేషన్‌కు సహకరించినందుకే వేటు
Comments
Please login to add a commentAdd a comment