అధికారుల నిర్లక్ష్యం ఖరీదు రూ.10 కోట్లు
సింగరాయకొండ: భూముల రీసర్వేలో మండల రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా ప్రభుత్వానికి సుమారు రూ.10 కోట్లు నష్టం వాటిల్లగా, వందల ఎకరాల్లో భూ యజమానులు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళ్తే..మండలంలోని మూలగుంటపాడు పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు 108 కు రీ సర్వే లో భాగంగా 860 ఎల్‌పీఎం నంబరు కేటాయించారు. ఈ ఎల్‌పీఎం కింద సుమారు 51 సర్వే నంబర్లు ఉండగా 281 ఎకరాల విస్తీర్ణం ఉంది. అయితే ఈ ఎల్‌పీఎం నంబరు పరిధిలో ప్రభుత్వ జూనియర్ కాలేజి కూడా ఉండటంతో ఆ నంబరును నిషేధిత జాబితాలో చేర్చారు. రెవెన్యూ అధికారులు చేసిన పొరబాటుకు నాలుగు నెలలుగా 108 సర్వే నంబరులో భూముల రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. ఫలితంగా రిజిస్ట్రేషన్‌ల ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రోజుకు సుమారు రూ.8 లక్షల నష్టం వాటిల్లుతోంది. అంటే ఈ నాలుగు నెలల్లో సుమారు రూ.10 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. అంతేకాక భూముల ధరలు కూడా అమాంతం పడిపోయాయి. దీంతో భూముల కొనుగోలుదారులు, అమ్మకందారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే సింగరాయకొండ, సోమరాజుపల్లి, పాతసింగరాయకొండ, కనుమళ్ల, శానంపూడి గ్రామ పంచాయతీలోని సుమారు 1,500 ఎకరాల భూములు దేవదాయ శాఖ పరిధిలోకి రావటంతో ఆ సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో ఉంచటంతో 11 సంవత్సరాలుగా భూముల రిజిస్ట్రేషన్లు ఆగిపోయి ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు రిజిస్ట్రేషన్ చార్జీల రూపంలో నష్టం వాటిల్లింది. భూముల ధరలు పడిపోయి ప్రజలు అమ్ముకోలేక, బ్యాంకుల్లో రుణాల కోసం తనఖా పెట్టుకునే అవకాశం లేక ఆర్థికంగా నష్టపోయారు. కానీ ఇప్పుడు కేవలం అధికారులు నిర్లక్ష్యం కారణంగా 281 ఎకరాల్లో రిజిస్ట్రేషన్లు ఆగిపోవటంతో మళ్లీ ఎప్పుడు సమస్య పరిష్కారమై రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తారో అర్థం కావటం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మూలగుంటపాడులో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఉందని నిషేధిత జాబితాలో 860 ఎల్‌పీఎం నంబర్ రీసర్వేలో అధికారుల నిర్వాకం ఆ ఎల్‌పీఎం కింద 51 సర్వే నంబర్లలో 281 ఎకరాలు నాలుగు నెలలుగా ఆగిన భూముల రిజిస్ట్రేషన్ పడిపోయిన భూముల ధరలు రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి
నివేదిక వస్తే చర్యలు తీసుకుంటాం
108 సర్వే నంబరుకు సంబంధించి విచారణకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌ను నియమించాం. ఆయన ఇచ్చే నివేదిక ప్రకాారం నా లాగిన్ ద్వారా ఆ సర్వే నంబరును నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించి మళ్లీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాను.
– గోపాలకృష్ణ, జాయింట్ కలెక్టర్
ప్రభుత్వానికి రోజుకు రూ.8 లక్షల నష్టం
సుమారు నాలుగు నెలలుగా 108 సర్వే నంబరులో రిజిస్ట్రేషన్ల ప్రకియ ఆగిపోవడంతో ప్రభుత్వానికి రోజుకు సుమారు రూ.8 లక్షల మేర నష్టం వస్తోంది. ఈ మండలానికి ప్రభుత్వం రూ.30 కోట్ల టార్గెట్ ఇస్తే ఇప్పటికి రూ.15 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. ఈ విధంగా నిషేధిత జాబితా లో భూములు ఉంటే ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాన్ని ఏవిధంగా చేరుకోవాలో అర్థం కావడం లేదు.
– షేక్.షాన్, సబ్‌రిజిస్ట్రార్
Comments
Please login to add a commentAdd a comment