ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఉచిత శిక్షణ
● జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ బి.శ్రీనివాసులు
ఒంగోలు సబర్బన్: జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువతులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఉచితంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ బి.శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో యువతీ, యువకులను పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చేయటానికి ర్యాంపు పథకం ద్వారా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కమ్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం కింద ప్రత్యేకంగా ఉచిత శిక్షణ ఇస్తున్నామన్నారు. నెల రోజుల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నామన్నారు. ఈనెల 22వ తేదీ నుంచి ఒక బ్యాచ్‌కు, ఈ నెల 28వ తేదీ నుంచి రెండో బ్యాచ్‌కు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాలు ట్రెండ్‌జ్ ఐటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు వివరించారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు అందిస్తారన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు స్థాపించుకోవటానికి అవసరమైన అవగాహన, ప్రాజెక్టు ప్రిపరేషన్, పథకాల వివరాలు, మార్కెట్‌పై అవగాహన కల్పిస్తారని చెప్పారు. ఉచిత శిక్షణకు హాజరు కావాల్సిన అభ్యర్థుల వయస్సు 18 నుంచి 58 సంవత్సరాల మధ్య ఉండాలన్నారు. ఆధార్ కార్డు, పాస్ పోర్టు సైజు ఫొటోలు, కులధ్రువీకరణ పత్రం, తెల్లరేషన్ కార్డు తీసుకొని ఈ నెల 24వ తేదీన సంబంధిత కార్యాలయాల్లో హాజరు కావాలన్నారు. ఔత్సాహికులైన నిరుద్యోగ యువతీ, యువకులు ట్రెండ్‌జ్ కార్యాలయాలు ఒంగోలు నగరంలోని అంజయ్య రోడ్డులోని డొమినోస్ పిజ్జా ఎదురుగా కోటయ్య ప్లాజాలోని రెండో అంతస్తులో కార్యాలయంలో, మార్కాపురంలోని గణేష్ నగర్ పోస్టల్ ఏరియా కొండపల్లి రోడ్డులో ఉన్న ట్రెండ్‌జ్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. పూర్తి వివరాల కోసం 91606 07606, 70937 73775 సెల్ నంబర్లను సంప్రదించి సమాచారం తెలుసుకోవాలన్నారు.
రోస్టర్ సరిచేశాకే గ్రూప్–2 పరీక్షలు నిర్వహించాలి
● అఖిల భారత యువజన సమాఖ్య మాజీ రాష్ట్ర కార్యదర్శి వీరారెడ్డి
ఒంగోలు సిటీ: రోస్టర్ విధానం సరిచేసిన తర్వాతనే గ్రూప్–2 పరీక్షలు నిర్వహించాలని అఖిల భారత యువజన సమాఖ్య మాజీ రాష్ట్ర కార్యదర్శి వీరారెడ్డి అన్నారు. కలెక్టర్ కార్యాలయం వద్ద శుక్రవారం ప్లకార్డులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత యువజన సమాఖ్య మాజీ రాష్ట్ర కార్యదర్శి వీరారెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపాధి కల్పనలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు యువతకి ఇచ్చిన హామీ అమలు చేయాలన్నారు. డీఎస్సీని వెంటనే విడుదల చేసి యువతకి ఉపాధి కల్పించాలన్నారు. సీపీఐ నగర సహాయ కార్యదర్శి శ్రీరామ శ్రీనివాసరావు మాట్లాడుతూ నిన్నటి వరకు కోర్టులో ఉందని చెప్పి సమయం లేకుండా ఈ నెల 23 తేదీ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం సరైన పద్ధతి కాదని, రోస్టర్ సరిచేసి పరీక్షలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో బాషా, సలోమాన్, విజయరాజ్, సంపత్, మహేష్ పాల్గొన్నారు.
జాతీయ స్థాయి నెట్‌బాల్ పోటీలకు దొనకొండ విద్యార్థులు
దొనకొండ: రాష్ట్ర స్థాయి జూనియర్ నెట్‌బాల్ పోటీలు ఈ నెల 16న తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో నిర్వహించారు. జిల్లా నుంచి దొనకొండ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు పత్తి వెంకట లక్ష్మీనారాయణ, ఎనబరి ప్రైజీ రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. ఈ నెల 23 నుంచి హర్యానాలో నిర్వహించే జాతీయ పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున వీరు పాల్గొంటారని వ్యాయామ ఉపాధ్యాయుడు కాలే నరసింహారావు తెలిపారు. వీరిని ప్రధానోపాధ్యాయుడు వీవీ రామాంజనేయులు, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు అభినందించారు. రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు దొనకొండ విద్యార్థులు ఈ నెల 23 నుంచి 24వ తేదీ వరకు కర్నూలులో రాష్ట్ర స్థాయి జూనియర్ హ్యాండ్‌బాల్ పోటీలు నిర్వహిస్తున్నారని, ఈ పోటీలకు జిల్లా జట్టుకు దొనకొండ జెడ్పీ పాఠశాలకు చెందిన చంద్రశేఖర్, ఏడుకొండలు ఎంపికయ్యారని వ్యాయామ ఉపాధ్యాయుడు నరసింహారావు తెలిపారు.
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఉచిత శిక్షణ
Comments
Please login to add a commentAdd a comment