పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
ఒంగోలు సిటీ: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఈనెల 23న గ్రూప్–2 మెయిన్స్ రాత పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్నీ చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. గ్రూప్–2, ఇంటర్మీడియెట్, పదో తరగతి పరీక్షల నిర్వహణపై శుక్రవారం ప్రకాశం భవనంలోని మినీ మీటింగ్ హాల్‌లో ఎస్పీ దామోదర్, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ లతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఏ.తమీమ్‌అన్సారియా మాట్లాడుతూ 7 కేంద్రాల్లో నిర్వహించనున్న పరీక్షలకు 4,544 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని తెలిపారు. పరీక్ష కేంద్రాలైన క్విస్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో 944 మంది, శ్రీనాగార్జున డిగ్రీ కళాశాలలో 600 మంది, శ్రీహర్షిణి డిగ్రీ కళాశాల, పీజీ కళాశాలలో 600 మంది, రైస్ కాలేజీలో రెండు కేంద్రాల్లో 1200 మంది, పేస్ కళాశాలలో రెండు కేంద్రాల్లో 1200 మంది అభ్యర్థులను కేటాయించినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణకు కోఆర్డినేటింగ్ అధికారిగా జేసీ గోపాలకృష్ణ ఉంటారన్నారు. ఏడుగురు జిల్లా స్థాయి లైజన్ అధికారులను నియమించామన్నారు. పేపరు–1 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, పేపరు–2 మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 వరకు జరుగుతుందన్నారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఏదైనా సమాచారం లేదా ఫిర్యాదు కోసం కంట్రోల్ రూమ్ నెంబరు 88011 88046 కు కాల్ చేసి తెలియజేయవచ్చని తెలిపారు.
ఇంటర్మీడియెట్ పరీక్షలు రాయనున్న 42,439 మంది:
ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలను మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తారని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో 67 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మొదటి సంవత్సరం 21,624 మంది, రెండో సంవత్సరం 20,815 మంది చొప్పున మొత్తం 42,439 మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. వీటికి గాను చీఫ్ సూపరింటెండెంట్లు 67 మంది, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు 67 మంది, 27 మంది కస్టోడియన్లు, 3 సిట్టింగ్ స్క్వాడ్‌లు, 3 ఫ్లయింగ్‌స్క్వాడ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా స్థాయి ప్రత్యేక అధికారిగా ఐ.శ్రీనివాసరావు నియమించారు. హాల్‌టికెట్ డౌన్‌లోడ్ విషయంలో ఏమైనా సమస్యలున్నా ఒంగోలులోని ఆర్‌ఐఓ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబరు 08592–281275 ను సంప్రదించవచ్చన్నారు. మొబైల్‌ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి తీసుకురావద్దని చెప్పారు.
183 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు:
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా 183 కేంద్రాల్లో నిర్వహిస్తారని, 29,602 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వీరికి ఉదయం గం.9.30 నుంచి గం.12.45 వరకు పరీక్ష ఉంటుందన్నారు. ఓపెన్ ఇంటర్మీడియెట్ పరీక్షలకు 4,175 మంది విద్యార్థులు 21 కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. వీరికి మార్చి 3 నుంచి 15వ తేదీ వరకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే ఓపెన్ పదో తరగతి పరీక్షలు మార్చి 17 నుంచి 28వ తేదీ వరకు నిర్వహిస్తున్నారనీ, ఇందులో 1564 మంది విద్యార్థులు 23 కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. వీరికి పరీక్ష ఉదయం గం.9.30 నుంచి గం.12.30 వరకు ఉంటుందని తెలిపారు.
పటిష్ట భద్రత:
ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ జిల్లాలోని గ్రూప్–2 మెయిన్స్ రాత పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని, పరీక్ష కేంద్రానికి 200 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ అమలులో ఉందని చెప్పారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని అన్ని జిరాక్స్ సెంటర్లను మూసివేయిస్తున్నామని తెలిపారు. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ లో పోలీస్ హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద డ్రోన్ ద్వారా కూడా భద్రతను పర్యవేక్షిస్తామని ఎస్పీ తెలిపారు. సోషల్ మీడియాలో మెయిన్స్ పరీక్ష గురించి తప్పుదారి పట్టించే ఫేక్ న్యూస్ పెట్టినా, షేర్ చేసే వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏ పరీక్షా కేంద్రం వద్ద ఎవైనా ఘటన జరిగినా వెంటనే డయల్ 100/112 లేదా జిల్లా పోలీస్ వాట్సాప్ 9121102266 కు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. సమావేశంలో డీఆర్వో బి.చిన ఓబులేసు, ఆర్‌ఐఓ సైమన్ విక్టర్, డీఈఓ అత్తోట కిరణ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 23న 7 కేంద్రాల్లో గ్రూప్–2 మెయిన్స్ మార్చి 1 నుంచి 67 కేంద్రాల్లో ఇంటర్మీడియెట్ పరీక్షలు మార్చి 17 నుంచి 183 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు కలెక్టర్ తమీమ్ అన్సారియా
Comments
Please login to add a commentAdd a comment