క్యాన్సర్‌ను జయించొచ్చు
తొలి దశలో గుర్తిస్తే
మద్దిపాడు: క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే ప్రతి ఒక్కరూ జయించవచ్చని ప్రముఖ సినీ నటి, లైఫ్ ఎగెయిన్ ఫౌండేషన్ సంస్థ నిర్వాహకురాలు గౌతమి అన్నారు. క్యాన్సర్‌పై అవగాహన కోసం మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడులో మంగళవారం నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షలు, బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. సకాలంలో పరీక్షలు, సత్వర వైద్యం, మనో ధైర్యంతో క్యాన్సర్ పై తాను విజయం సాధించాలని తెలిపారు. శరీరంలో ఏమాత్రం మార్పు కనిపించినా నిర్లక్ష్యం చేయొద్దని, పరీక్షలు చేయించుకోవడంలో సిగ్గు పడరాదని అన్నారు. వ్యాధులు ముందుగా గుర్తిస్తే ఆహారంలో మార్పుల తోపాటు వ్యాయామం చేయాలని సూచించారు. వ్యాయామం ద్వారా ఎన్నో రోగాలను అదుపు చేసుకోవచ్చని చెప్పారు. మహిళలకు క్యాన్సర్ పై అవగాహన పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సరైన అవగాహన, సత్వర వైద్యంతో క్యాన్సర్‌ను జయించవచ్చని రాష్ట్ర, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. మూడు రకాల క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని గత ఏడాది నవంబర్ 14న ప్రక్రియ ప్రారంభించామన్నారు. క్యాన్సర్లలో 63 శాతం నివారించుకోవచ్చు అని, మిగతా 37 శాతం జన్యుపరమైన కారణాల వలన నివారణ కష్టం అన్నారు. ఏడుగుండ్లపాడు గ్రామంలో 329 మందికి స్క్రీనింగ్ చేయగా 11 క్యాన్సర్ అనుమానత కేసులను గుర్తించామని, వీటిలో పది నోటికి సంబంధించినవి కాగా, ఒకటి రొమ్ముకు సంబంధించిన కేసు అని ఆయన తెలిపారు. తన తల్లి, అక్కా క్యాన్సర్ కారణంగా మరణించారని చెప్పారు. కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మాట్లాడుతూ జిల్లాలో 4,07,85,186 మంది 18 ఏళ్లు నిండిన ప్రజలు ఉన్నారని, వీరిలో 94,99,268 మందికి ఇప్పటి వరకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. వీరిలో 37 వేలకు పైగా నోటి, 24 వేలకు పైగా రొమ్ము, 26 వేలకు పైగా గర్భాశయ ముఖ ద్వార అనుమానిత కేసులను గుర్తించామన్నారు. క్యాన్సర్ నివారణకు స్క్రీనింగ్ చేయించుకుంటామని స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ రావు, బీఎన్.విజయ్ కుమార్ , ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి, అసంక్రమిత వ్యాధుల నివారణ కార్యక్రమ రాష్ట్ర నోడల్ ఆఫీసర్ కె.శ్యామల, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య, జిల్లా రెవెన్యూ అధికారి బి.చిన ఓబులేసు, డీఎంహెచ్‌వో టి.వెంకటేశ్వర్లు, డీసీహెచ్‌ఎస్ సూరిబాబు, ఆర్.బీ.ఎస్.కె.డి.పి.ఎం. డాక్టర్ భగీరధి, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, తహశీల్దార్ సుజన్ కుమార్, సర్పంచ్ శిల్ప సౌందర్య పాల్గొన్నారు.
క్యాన్సర్ స్క్రీనింగ్ పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి ప్రముఖ సినీ నటి గౌతమి
Comments
Please login to add a commentAdd a comment