రైతుల పక్షాన పోరాడితే జగనన్నపై కేసులా.?
సింగరాయకొండ: మిర్చి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతుంటే వారి సమస్యను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసిందని, రైతు పక్షపాతి అయిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతు సోదరులను ఓదార్చేందుకు గుంటూరు మిర్చియార్డుకు వెళ్లి వారి బాధలు తెలుసుకుని పరామర్శిస్తే కేసులు పెడతారా అని వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సింగరాయకొండ మండల కేంద్రంలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. జగనన్నపై పోలీసులు కేసు నమోదు చేయడంపై ఘాటుగా స్పందించారు. గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో జగనన్నతో పాటు మరో 8 మంది పార్టీ నాయకులపై కేసులు నమోదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రైతుకు ఇచ్చిన హామీలైన అన్నదాత సుఖీభవ, గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి వైఫల్యం చెందిందన్నారు. పంటల బీమా పథకాన్ని తుంగలో తొక్కి కనీసం పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వక రైతులు అల్లాడుతుంటే వారికి సమాధానం చెప్పకోలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. రైతుల పక్షాన జగన్ పోరాటం చేస్తుంటే కేసులు బనాయిస్తూ కూటమి ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment