విద్యారంగ సమస్యల పరిష్కారంలో విఫలం
● కూటమి ప్రభుత్వంపై పీడీఎస్‌యూ
రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్ ధ్వజం
ఒంగోలు సిటీ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్నా విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైందని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్.రాజశేఖర్ ధ్వజమెత్తారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పీడీఎస్‌యూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం వద్ద గల అంబేడ్కర్ విగ్రహం వద్ద గురువారం విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యార్థులు, యువకులకు అనేక హామీలిచ్చిందని తెలిపారు. ప్రస్తుతం వాటిని అమలుచేయడంలో విఫలమైందని విమర్శించారు. చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం ద్వారా రూ.15 వేలు జమచేస్తామన్నారని, నేటికీ ఆ హామీ అమలుకాలేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.3,500 కోట్ల ఫీజు బకాయిలుంటే.. నిధులు విడుదల చేయకుండా కాలయాపన చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండగా భర్తీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. 50 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 11,000 ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇవ్వడం దారుణమన్నారు. సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, వాటిని అలకించే వారే లేరని విమర్శించారు. ెఇప్పటికై నా ప్రభుత్వం ఆలోచించి విద్యారంగ సమస్యలు పరిష్కరించకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ శ్యామ్, నాయకులు వెంకటేష్, ఎలీషా, మానస, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment