
ఉపాధ్యాయులంతా బాలల హక్కులు పరిరక్షించాలి
ఒంగోలు సిటీ: నేటి బాలలే రేపటి పౌరులని, ప్రపంచానికి ముఖ్యమైన మానవ వనరులుగా వారిని తీర్చిదిద్దేందుకు బాలల హక్కులను పరిరక్షించే బాధ్యతల్లో ఉపాధ్యాయులు ప్రధాన భూమిక పోషించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి సూచించారు. బాలల హక్కుల పరిరక్షణ, అవి అమలు జరుగుతున్న తీరుపై గురువారం డీఈవో కిరణ్‌కుమార్ అధ్యక్షతన స్థానిక ఎన్టీఆర్ కళాకేంద్రంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల హెచ్‌ఎంలు, ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన ఈ సమావేశంలో పద్మావతి పాల్గొని మాట్లాడారు. పిల్లలపై మొబైళ్ల ప్రభావం తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. పిల్లలు ఒత్తిడికి గురికాకుండా చదువుతో పాటు క్రీడలు, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకత పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. మార్కులు, ఇతర విషయాల్లో పిల్లలను ఇతరులతో సరిపోల్చకుండా కేవలం వారి వ్యక్తిగత సామర్థ్యాల మేరకే రాణించే విధంగా తీర్చిదిద్దాలన్నారు. చిన్న వయసులోనే చదువుల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న పిల్లలను చూస్తున్నామన్నారు. చదువంటే కేవలం డాక్టర్లు, ఇంజనీర్లు కావడం మాత్రమే కాదన్నారు. అనేక రంగాల్లో మంచి అవకాశాలున్నాయని, చిన్న వయసులోనే పిల్లలకు వాటిపై అవగాహన కల్పించాలని సూచించారు. అన్ని పాఠశాలల్లో కంప్లైంట్ బాక్సులను కేవలం అలంకారప్రాయంగా కాకుండా పిల్లలందరికీ తెలిసే విధంగా బహిరంగంగా ఉంచాలన్నారు. కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయడంపై ఉపాధ్యాయులు తప్పుగా భావించరాదని, పిల్లల సమస్యలు వెలుగులోకి వచ్చే విధంగా వాటిని ఉపయోగించాలని తెలిపారు. ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా ప్రహరీ క్లబ్స్ ఏర్పాటు చేయడమే కాకుండా ఆచరణాత్మకంగా అమలుచేయాలని చెప్పారు. బాలబాలికలిద్దరికీ గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించాలని, ఫ్రెండ్లీ టీచర్ కాన్పెప్ట్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు. విధిగా ప్రతి నెలా తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని, ఆరోగ్య పరీక్షలు కూడా తప్పనిసరిగా జరిపించాలని ఆదేశించారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల వివరాలను నోటీస్ బోర్డులో ఉంచాలని, పిల్లలకు చట్టాలపై అవగాహన కల్పించాలని అన్నారు. పిల్లల సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్లు 1098, 100, 112లను ప్రతీ క్లాస్ రూమ్‌ంలో ఉంచాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో పౌష్టికాహారం ఉండేలా, స్వచ్ఛమైన తాగునీరు అందేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 10వ తరగతి, ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు హాల్ టికెట్లను నిర్ణీత సమయంలో అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో బాలల సంక్షేమ మండలి సభ్యురాలు నీలిమ వంశీలత, ఐసీడీఎస్ పీడీ హేమసుజన్, బాలల సంరక్షణ విభాగ అధికారి దినేష్‌కుమార్, మండల విద్యాధికారులు, రెసిడెన్షియల్, కస్తూరిబా గాంధీ, బీసీ గురుకుల విద్యాలయాల హెచ్‌ఎంలు, ప్రైవేటు పాఠశాలల హెచ్‌ఎంలు పాల్గొన్నారు.
ప్రతి పాఠశాలలో ఫిర్యాదుల బాక్స్ తప్పనిసరి ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల వివరాలను నోటీసు బోర్డులో ఉంచాలి బాలల సంరక్షణకు సమన్వయంతో పనిచేయాలి రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు పద్మావతి
Comments
Please login to add a commentAdd a comment