వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీల్లో జిల్లా నాయకుల నియామకం
ఒంగోలు సిటీ: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన ఆ పార్టీ నాయకులు పలువురిని రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీల్లో వివిధ హోదాల్లో నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీగా మేడికొండ జయంతి, రైతు విభాగం సెక్రటరీగా సూరసాని మోహన్‌రెడ్డి, రైతు విభాగం జాయింట్ సెక్రటరీలుగా ఏలం మురళీకృష్ణ, తాటికొండ రామచంద్రరావును నియమించారు. అలాగే, రాష్ట్ర బీసీ సెల్ జాయింట్ సెక్రటరీలుగా సారే వెంకటనాయుడు, ఎన్నాబత్తిన వెంకటేశ్వరరావును నియమించారు. రాష్ట్ర బూత్ కమిటీ జనరల్ సెక్రటరీగా బొర్రా కృష్ణారెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ సెక్రటరీలుగా సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, వెగినాటి ఓసురారెడ్డిని నియమించారు.
ఆర్యవైశ్యులు భిక్షగాళ్లు కాదు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఆర్యవైశ్యుల్లో నిరుపేదలు ఉంటారుగానీ భిక్షగాళ్లు ఉండరని అమరజీవి పొట్టి శ్రీరాములు అభిమాన సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు పేరకం నాగాంజనేయులు అన్నారు. ఆర్యవైశ్యులు కష్టపడి సంపాదించుకుని తమకు వచ్చిన దాంట్లోనే ఇతరులకు సాయం చేస్తుంటారని, ఆత్మగౌరవంతో బతుకుతారని అన్నారు. పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్షకు సంబంధించిన మెసేజ్‌ను అందరితో పాటు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పీఏ అనిల్‌కు పెట్టినందుకు తనను భిక్షం అడుక్కునే కొ..క అంటూ ఫోన్ చేసి ధూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఒక వీడియో విడుదల చేసిన ఆయన.. జరిగిన విషయాలను వివరించారు. 2014లో టీడీపీ విజయం కోసం తాను కృషి చేశానని, ఆ క్రమంలో తాను రూ.8 లక్షలు నష్టపోయానని చెప్పారు. అయినప్పటికీ బాధ పడలేదని, పొట్టి శ్రీరాములు గుడి నిర్మాణానికి విరాళం అడిగితే ఇంటి చుట్టూ తిప్పుకున్న అప్పటి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తన వద్ద డబ్బులు లేవని చెప్పారని.. అవహేళనగా మాట్లాడి తనను అవమానించారని వివరించారు. ఇప్పుడు పొట్టి శ్రీరాములు వీడియో పంపితే ఎమ్మెల్యే పీఏ అనిల్ తనను ముష్టివాడని ధూషిస్తూ ఫోన్ చేశారన్నారు. ఇంటికొచ్చి కొడతానంటూ బెదిరించాడని తెలిపారు. ఎమ్మెల్యే దామచర్లకు ఆర్యవైశ్యులపై ఏమాత్రం గౌరవం ఉన్నా తన పీఏను మందలించాలని కోరారు. లేకపోతే అతడు ఆర్యవైశ్యుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూనే ఉంటాడని చెప్పారు. పొట్టి శ్రీరాములు విగ్రహం కోసం రూపాయిచ్చే గతి లేకపోయినా కనీసం ఆ మహనీయుడిని గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. ఆర్యవైశ్యుల ఓట్లు లేకుండా టీడీపీ గెలుపు సాధ్యమయ్యేదా అని ప్రశ్నించారు. ఆర్యవైశ్యులు తలచుకుంటే పరిస్థితులు మారిపోతాయని హెచ్చరించారు.
సోషల్ మీడియాపై
నిరంతర నిఘా
● ఎస్పీ ఏఆర్ దామోదర్
ఒంగోలు టౌన్: సోషల్ మీడియాపై నిరంతర నిఘా ఉందని, తప్పుడు సందేశాలు, విద్వేషాలు రెచ్చగొట్టే మెసేజ్‌లు పెట్టే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఏఆర్ దామోదర్ హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వాట్సప్, ఫేస్ బుక్, ఇన్‌స్టా గ్రాం, టెలిగ్రాం, యూ ట్యూబ్ తదితర సామజిక మాధ్యమాల్లో ఇతరులను కించపరిచేలా, అసభ్యకరమైన, అనైతిక పోస్టులు పెడితే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా, కులాల మధ్య, మతాల మధ్య, రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రగల్చడం, సున్నితమైన మతవిశ్వాసాలపై వదంతులు, అవాస్తవాలు ప్రచారం చేయడం నేరమన్నారు. ప్రజలను పక్కదారి పట్టించే విధంగా ఫేక్ న్యూస్‌లు పెట్టిన, ఫార్వార్డ్ చేసిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment