మార్కాపురం: పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మంగళవారం మండలంలోని కోలభీమునిపాడులో జరిగింంది. రూరల్ ఎస్సై అంకమరావు వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన దూదేకుల కాశయ్య (54)కు మద్యం అలవాటు ఉంది. గత ఐదురోజుల నుంచి భార్య నాగుల మీరమ్మ, పిల్లలను మద్యంకోసం డబ్బులు అడుగుతున్నాడు. దీంతో భార్య, పిల్లలు కాశయ్యను మందలించారు. క్షణికావేశానికి లోనైన కాశయ్య ఈనెల 24వ తేదీన మధ్యాహ్నం సమయంలో పురుగుమందు తాగాడు. కుటుంబసభ్యులు గుర్తించి వెంటనే ఆటోలో మార్కాపురంలోని జీజీహెచ్‌కు తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
200 లీటర్ల బెల్లంఊట ధ్వంసం
● డ్రోన్ కెమెరాలతో గుర్తింపు
గిద్దలూరు రూరల్: మండలంలోని వేములపాడు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో 200 లీటర్ల నాటుసారా తయారీ బెల్లం ఊటను సీఐ కె.సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం ధ్వంసం చేశారు. వివరాల్లోకి వెళితే.. వేములపాడు అటవీప్రాంతంలో నాటుసారా తయారు చేస్తున్నారన్న సమాచారం మేరకు సీఐ డ్రోన్ కెమెరాల సహాయంతో ఎక్కడ తయారు చేస్తున్నారో గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకొని నాటుసారా బెల్లంఊటను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ డ్రోన్ కెమెరాల సహాయంతో నేరాలను గుర్తించి వాటిని అదుపు చేస్తున్నామని తెలిపారు.
మింట్ కంపెనీపై చెక్ బౌన్స్ కేసు పెట్టాం
● తెలంగాణ పోలీసుల వ్యవహారంపై విజయభాస్కర్ వివరణ
ఒంగోలు టౌన్: హైదరాబాద్‌కు చెందిన మింట్ ఎన్విరాన్‌మెంట్ కంపెనీపై కోర్టులో చెక్ బౌన్స్ కేసు వేసినట్లు, దాని నుంచి తప్పించుకునేందుకు మాదాపూర్ పోలీస్‌స్టేషన్లో తప్పుడు కేసులు పెట్టారని జి. విజయభాస్కర్ తెలిపారు. చెక్ బౌన్స్ కేసులో విజయ భాస్కర్‌ను అరెస్టు చేసేందుకు తెలంగాణకు చెందిన పోలీసులు ఈ నెల 23వ తేదీన నగరంలోని బీకే అపార్ట్‌మెంటులోని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నివాసానికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం ప్రకటన ద్వారా తెలిపారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తమ్ముడు మల్లికార్జున్‌తో కలిసి 2021లో హైదరాబాద్‌కు చెందిన మింట్ ఎన్విరాన్‌మెంట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు. రూ.6.5 కోట్ల రుపాయలు తిరిగి ఇచ్చేదానికి ఐసీఐసీఐ బ్యాంక్‌లో అకౌంట్ తెరిచామని, అయితే ఆ డబ్బులను కంపెనీ దుర్వినియోగం చేసిందని తెలిపారు. క్రిమినల్ కేసు వేస్తామని చెప్పడంతో రూ.6.5 కోట్లకు చెక్ ఇచ్చారని, దాన్ని బ్యాంకులో వేయగా బౌన్స్ అయిందని తెలిపారు. దీనికి సంబంధించి కోర్టులో చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేశామన్నారు. దాని నుంచి తప్పించుకునేందుకు నా మీద, మల్లికార్జునపై తప్పుడు కేసు నమోదు చేశారన్నారు.
ఉపాధి కూలీల సంఖ్య పెంచాలి
కొత్తపట్నం: వేసవిలో ఉపాధి లేక ఇంటికే పరిమితం అవుతున్నారని, కూలీలకు 100 రోజుల ఉపాధి కల్పించడానికి సిబ్బంది కృషి చేయాలని డ్వామా పీడీ జోసఫ్ కుమార్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీడీఓ శ్రీకృష్ణ అధ్యక్షత వహించారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో జరిగిన పనులపై సామాజిక తనిఖీ నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో వేసిన మామిడి మొక్కలు ఎండిపోవడంపై పీడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజుపాలెంలో 2018–19లో నిర్మించిన మినీ గోకులంలో శ్లాబ్ వేయకుండా వేసినట్లు బిల్ చేయడంపై మండిపడ్డారు. బాధ్యుల నుంచి నగదు రికవరీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఉపాధి కూలీలకు పని కల్పించి రోజుకు రూ.300 కూలి వచ్చేలా చూడాలని సూచించారు. ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి మాట్లాడుతూ మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న అన్నా ట్యాంకు చెరువు చుట్టూ మరమ్మతులు చేసి చెట్లు నాటాలన్నారు. కార్యక్రమంలో ఏపీఓ రత్నజోత్స్య, జేఈ చంద్రశేఖర్, టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య
పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య


