ఉత్తమ సేవలతోనే పేరు ప్రఖ్యాతులు
● ఎస్పీ దామోదర్
ఒంగోలు టౌన్: ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పదని, అయితే, ఉద్యోగంలో ఉన్నప్పుడు అందించిన ఉత్తమ సేవలతోనే ఉద్యోగానంతరం కూడా గుర్తుండిపోయేలా పేరు ప్రఖ్యాతులు లభించి ఆత్మసంతృప్తి కలిగిస్తాయని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. జరుగుమల్లి ఏఎస్సై జి.శ్రీనివాసరావు, గిద్దలూరు హెడ్‌కానిస్టేబుల్ కేవీ రమణారెడ్డి, ఐటీ కోర్ హెడ్ కానిస్టేబుల్ సీహెచ్ శ్రీనివాసరావు సోమవారం ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రత్యేకంగా వారిని ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు శాఖలో సుదీర్ఘకాలం సేవలు అందించడం గొప్ప విషయమని, అందరికీ సకాలంలో రిటైర్డ్‌మెంట్ ప్రయోజనాలు అందించడానికి కృషి చేస్తానని చెప్పారు. రిటైర్‌మెంట్ ద్వారా వచ్చిన డబ్బును జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని సూచించారు. శేష జీవితాన్ని సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఏదైనా సహాయం కావాలంటే సంప్రదించాలని, పోలీసు శాఖ ఎప్పటికీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్బీ ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర, ఆర్‌ఐ సీతారామిరెడ్డి, ఏఆర్ ఎస్సై తిరుపతిస్వామి, సిబ్బంది పాల్గొన్నారు.


