వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నల్లబ్యాడ్జీలతో ర్యాలీ
ఒంగోలు టౌన్: వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లిం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వివిధ మసీదుకు చెందిన ముస్లింలు నల్లబ్యాడ్జీలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆయా మసీదులలో పండుగ నమాజు అనంతరం ర్యాలీగా బయలుదేరిన ముస్లింలు పాత కూరగాయల మార్కెట్ సమీపంలోని మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని, వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన వైఖరిని ప్రకటించాలని, ముస్లింల రాజ్యాంగ హక్కులను కాపాడాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరక్టర్ షేక్ మహబూబ్ మాట్లాడుతూ వక్ఫ్ ఆస్తుల ఆక్రమణదారులకు రక్షణ కల్పించేలా బిల్లులో సవరణలు తీసుకొని రావడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సమర్ధనీయం కాదని చెప్పారు. ముస్లింలను ఇబ్బందులకు గురి చేసేందుకు బీజేపీ నేతృత్వంలోని కూటమి పాలకులు చేస్తున్న దుష్ట ప్రయత్నాలను న్యాయపోరాటాల ద్వారా తిప్పి కొడతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు ఇచ్చిన మాట ప్రకారం వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిలబడాలని కోరారు. నిరసనలో ముస్లిం నాయకులు ఎస్డీ సర్దార్, న్యాయవాది కరీముల్లా, అబ్దుల్ రవూఫ్, సయ్యద్ ఇస్మాయిల్, పి.కరిముల్లా తదితరులు పాల్గొన్నారు.


